సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, ఆగస్టు 2020, శనివారం

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

 


పద్మాక్షి పద్మిని పద్మాసనాసీన

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

ఐశ్వర్యదాయిని అమృతప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

ఙ్ఞానప్రదాయిని కరుణాంతరంగిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ

ఆరోగ్యదాయిని అభయప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ


ఎల్లవేళల మమ్ముల నుల్లమలర

కడుపులో దాచి కాపాడు కనకదుర్గ  

ఏలు పోలేరు పరమేశ్వరీ లలితకు         

పరమ బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ.

13, ఆగస్టు 2020, గురువారం

తిరగేసి చూచినా .....

 

తిరగేసి చూచినా చి
త్తరువున మార్పేమి లేదు తస్సాదయ్యా !
చిరుబురులాడే కైకయు ,
వర ధుఃఖిత దశరథుల ' వపా ' చిత్రమిదీ .

12, ఆగస్టు 2020, బుధవారం

ముందు చూపు .....

 

వారం క్రితం మా అమ్మగుడిలో నాటిన ఈవేపమొక్క దట్టంగా చిగురించింది

ఈ యనంతసృష్టి నెక్కడా కనరాదు
మొక్క , జీవమేది? పుడమి దక్క,
ఎంతదయ హరికి తనంత మనకొసగె
నంతటి యపురూప మైన కాన్క .

మొక్క లేని నాడు పుడమియు వ్యర్ధమే
మట్టి రాళ్ళతో సమాన మగుచు
కోట్ల కొలది విశ్వగోళాల విధమౌను
జీవ మంతరించి చేవ తొలుగు .

మొక్క నాటు మొకటి ముందుచూపు గలిగి
భూమి తరతరాలు క్షేమ మగును
పచ్చని తరు లమృత మిచ్చి పుడమి శాశ్వ
తముగ జీవములను దాల్చు కొఱకు .

11, ఆగస్టు 2020, మంగళవారం

మాధవుడే మాయగాడు

 


వెన్నకుండ ముందుబెట్టి , యశోదమ్మ

మన్ను తిన్నవ ? యని వెన్నునడిగె ,

ఏమి చెప్పు నీత డిందువదనకని

మాధవుండు వినగ మాటువేసె .


నోరు దెఱిచి చూప నీరేడు లోకాలు

గని యశోద పడియె కళ్ళుదిరిగి

మాధవు డిత డింత మాయగాడా యని ...

తనను తాను దెలిసి తప్పుకొనెను .

మన్నించు మాధవా ! .....

 


పన్నుగ మదిలో నున్నను

కన్నులు నీకేసి చూచు , కాంక్ష విడదురా !

మన్నించు మాధవా ! నిను

నెన్నక నిదురేమిరాదు , నీరజ నయనా !

తులసీదళ మంగళ గళ !

 


తులసీదళ మంగళ గళ !

విలసిత హేమాంబరధర ! విష్ణువిలాసా !

అలరుల పరిమళ మలదిన

కలవపుషా ! కృష్ణ ! మమ్ము గావర తండ్రీ !

అడుగో ! పరమాత్మ .....

 


అడుగులు తడబడ బుడుతం

డడుగో, పరమాత్మ యతడె , అడుగిడెడి, మహా

త్ముడు కృష్ణుండు, యశోదసు

తుడు , జగతి కేడుగడగ , దొరికెను దొరయై .

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

 

ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని

రచియించు నప్పుడు రమణ మీర

అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని

కాచి రక్షించు ప్రకరణ మందు

సంకర్షణు డితడు సకల సృష్టి హరించు

పట్టున ప్రళయ తాపములయందు

వాసుదేవు డితడు వర పరమాత్మయై

సర్వము తానయి పర్వునపుడు


విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు

వేద వేద్యు లరసి వేడు నపుడు

చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను

ముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు .

9, ఆగస్టు 2020, ఆదివారం

అవును , ఆరోజొస్తే ..... ఎంతబావుణ్ణు !

 ఆ రోజొస్తే ..... ఎంత బాగుణ్ణు !


సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడి , నడుచుకో గలిగితే ,


ఆర్థిక-సామాజికాంశాలో  సమ సమాజం ఏర్పడితే ,


ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించ గలిగితే ,


విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడే రోజొస్తే ,


పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజొస్తే ,


లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తే ,


మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రూపొందితే ,


పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం వస్తే ,


మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడితే ,


స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడితే ,


ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడితే ,


రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోతే ,


అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తే


రచయితలూ, కవులూ, కళాకారులూ – సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందించ గలిగితే ,


మెరుగైన జీవనం కోసం


మేలైన సమాజం ఏర్పడితే ...... ,


ఆ రోజొస్తే ....... ఎంత బాగుణ్ణు 

                                                  -  వెంకట రాజారావు. లక్కాకుల

రాధికాకృష్ణ !

 మీ జంట ప్రేమైక తేజోవిరాజిత

రాశియై వెలుగొందు రాగ విజిత

మీ జంట ఆనంద మిళితారవిందాల

అందాల సరసికి ఆనుపాను

మీ జంట మదన తేజీ మనోలాలస

రమణీయతలకు శ్రీరంగ సీమ

మీ జంట జగతికి మిథున రథము మీద

మోక్షమున్ దరలించు పుణ్యపేటి 


ఇద్దరొక్కరె , పరమాత్మ శుధ్ధ మోహ

న శుభగ మనోఙ్ఞ రూపము , నయన యుగళి

భాగ్యమిది రాధికాకృష్ణ ! పరవశముగ

కాంతు మానంద దృక్కుల కమలనయన !