సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, ఆగస్టు 2016, గురువారం

వలచిన రాధికా .....

వలచిన రాధికా లలన కౌగిట జిక్కి
ప్రియమార నిలిచిన ప్రేమ రాశి
కొలిచిన రుక్మిణీ చెలువ భక్తికి జిక్కి
హృదయాన కొలువైన మథుర వాసి
తలచిన గోపికా చెలుల రక్తికి జిక్కి
వశమైన యనురాగ వత్సలుండు
పిలిచిన దీనుల పిలుపు శక్తికి జిక్కి
పరుగున కాపాడు కరి వరదుడు

మంచి చెడులందు జీవించు మానవులకు
మార్గ నిర్దేశ మొనరించి , మంచి వైపు
నడుపు గీతోపదేశ మొనర్చు గురుని
కృష్ణు నర్చింతు కడగంటి కృపలు బరుప .

23, ఆగస్టు 2016, మంగళవారం

తెలుగు పద్యం .....

తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
తెల్గు పద్యము కొల్వు దీర వలయు

కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
తెల్గు లందరి కందంగ దివురు నటుల
తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు