27, మార్చి 2026, శుక్రవారం

సీతారాముల కళ్యాణ వైభోగం

 


కళ్యాణ రామయ్య కమనీయ మూర్తికి
పెండ్లికూతురు సీత విమల సతికి
భద్రాద్రి మందిర భవ్య మండప మందు
పరగ కళ్యాణ వైభవము జరిగె
కంచర్ల గోపన్న యెంచి సేయించిన
మాంగళ్య ధారణ మతిశయించె
రాష్ట్ర ప్రభుత్వము రమణమై తెచ్చిన
ముత్యాల తలబ్రాలు మురువు గాంచె

కన్నులారంగ గాంచి , మాకన్న ఘనులు
లేరు లేరనిరి తెలుగు వారు , నిజమె ,
సీతదీ రాముడిది తెల్గు సీమ యటులె
పెండ్లియును తెల్గు వారల పెండ్లి విథమె .


17, మార్చి 2026, మంగళవారం

పద్యాలు రాయండి ఇలా సులువుగా

 

పద్యాలు రాయండి ఇలా సులువుగా
---------------------------------------------
సుమతి వేమన్నలు చూపిన బాటలో
ద్యాలు రాయండి బాగు బాగు
దజాలము కొఱకు పరగ నిఘంటువుల్
రికింప పనిలేదు బహు విథముగ
నము మాటాడు ఆ మాటలే శోభిలు
ద్య మందున అర్థవంత మగుచు
ది సాధు విదిగొ అసాధు వను రభస
నకేల గ్రామీణ భాష మనది

చాల సులభము సఖుడ ! పద్యాలు రాయ
స్టైలు కాస్తంత పట్టుకో చాలు చాలు
నీవు పద్యాలు రాయంగ నేర్వగలవు
ఈ యుగాదిన మొదలెట్టు మేల జాగు .

ఈ యుగాది గూర్చి రాయండి ఇక్కడే
చిన్న మాటలందు చెలువు మెరయ
వెర పదేల రావ వేమన పద్యాలు
వాటి బాట పట్ట వచ్చు స్టైలు .

ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
సగము పద్య మయ్యె  సఖుడ ఇట్టివి రెండు
సగము లైన పద్య సౌరు లొలుకు .

యతులు గణము లనుచు మతివోగ గానేల
భయము వలదు స్టైలు పట్టు మొదట
పిదప యతి గణాలు వెదుకు కొనుచు వచ్చి
పద్య మందు పడును వరుస గాను .

16, మార్చి 2026, సోమవారం

ఉగాది శుభాకాంక్షలు

 

' ఉగాది ' కాహ్వానం
-------------------------
చైత్ర శుధ్ధపాడ్యమిని , వసంతగమన
శుభదినముతో , మొద ' లుగాది ' శోభలొదవు
తెలుగు నేలకు , ఇదికదా , తెలివి గలుగు
తెలుగు కాలఙ్ఞుల మనోఙ్ఞ ధీ విభవము .

ధరణికి శుభప్రద ' రాక్షస
పరాభవోగాది ' నామ పర్వము వచ్చెన్ ,
అరయగ నా వెను వెంటనె
పరాత్పరుని ' రామనవమి ' పర్వము వచ్చెన్ .

దొంగలకు , మోసగాళ్ళకు
భంగ పరచి సకల జనుల భాగ్యము దోచే
పంగులకు పరాభవములు ,
బెంగేల , హరి పరమాత్మ పేర్మిడి కలుగన్ .

ధర్మము తప్పిన , తప్పదు
కర్మ , పరాభవం బెవడికైన గల్గు నను నిజం
బర్మిలి నినదించుటకే
మర్మముగ పరాభవమని మరి పేరిడిరో !

తెలుగు పూలతోట తేనెలు దిగగద్రావి
రమణ యెలకవి కోకిలల్ ' రామ కీర్త
నా రసాబ్ధిని ' శుభ యోగమందు మునిగె
రార మముజేర , జయము , భద్రాద్రి రామ !







2, జనవరి 2026, శుక్రవారం

ముంగురుల్ జారె .....

 


ముంగురుల్ జారె , జాజిపూల్ మూర దిగియె
మోముపై సిగ్గు దొంతర పోల్చి చూడ
ఇంతి యంగజు కేళికా హేల నుండి
లేచి వచ్చిన విశ్రాంతి లీల దెలియు .


కుల్లూరు పోలేరు తల్లి


 


మణికిరీట ప్రభామయ , మయూఖ రుచిర ,

దివ్యమంగళ రూపు తేజరిల్ల ,

వజ్రాలు పొదిగిన వడ్డాణము మెరయ ,

కాలి యందెలు ఘల్లు ఘల్లురనగ ,

పసుపు గంధపు పూతపై , కుంకుమంబద్ది

ఫాలభాగమ్ము శోభనము గూర్చ ,


లేచి , ననుజూచి , వచ్చి , పోలేరు తల్లి

బిడ్డడా ! రార , యని బిల్చు ప్రేమతోడ ,

బ్రమయొ , పిచ్చియొ గానిండు ,  ప్రతిదినంబు

అమ్మవాకిట జేరి ప్రణామ మిడగ .