2, మే 2026, శనివారం

శ్రీ శ్రీనివాసా శ్రీవెంకటేశా


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల


శ్రీ శ్రీనివాసా  శ్రీవేంకటేశా

ఇలవేల్పు నీవయ్య  ఇందిరారమణా


కలియుగ దైవమై ఘనవైభవముతోడ

తిరుమల గిరులపై తిరముగా నిలిచావు 

నిన్ను దర్శించుటే నిజమైన భాగ్యము


శ్రీ శ్రీనివాసా  శ్రీవేంకటేశా

ఇలవేల్పు నీవయ్య  ఇందిరారమణా


దివ్య మంగళ మూర్తి దేదీప్యమానమై

భక్త కోటికి కనుల పండుగై వెలిశావు 

నిగమాలు కీర్తించె నీలమోహనరూప


శ్రీ శ్రీనివాసా  శ్రీవేంకటేశా

ఇలవేల్పు నీవయ్య  ఇందిరారమణా


నిత్య కళ్యాణాలు పచ్చతోరణ ప్రభలు

అనుదినోత్సవములు అరుదైన సేవలు

కనులు చాలవు రెండు కమలాయతాక్ష


శ్రీ శ్రీనివాసా  శ్రీవేంకటేశా

ఇలవేల్పు నీవయ్య  ఇందిరారమణా


కోరిన జనులకు కొంగు బంగారమై

వరముల గుప్పించు వరదాన గుణశీల

మమ్ము రక్షింపరా మహనీయ మూర్తి


శ్రీ శ్రీనివాసా  శ్రీవేంకటేశా

ఇలవేల్పు నీవయ్య  ఇందిరారమణా


1, మే 2026, శుక్రవారం

రాముడే రాజుగా రక్షగా


 గీత రచయిత :వెంకట రాజారావు లక్కాకుల




రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా

ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్కసీతయెసతిగ యుగపురుషుడైనిలిచె 
దండ్రి కిచ్చిన మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడియునూ విడువని

రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా

అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలుపొంది యీమనుజులందరకు రావణుని చావుతో రామబాణము శక్తి రామనామము శక్తి రాజిల్లె లోకాన 

రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా

తొలుత శ్రీరామయని పలుకులో రాతలో
పలుకక రాయక వెలయింప రేదియు 
పల్లెలా పట్నాల ప్రతి మందిరాలలో
కడగి సీతారామ కళ్యాణములు సేయ

రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా

కుల్లూరు నేలతల్లికి వందనం


 

గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

నేల తల్లికి వందనం
కుల్లూరు నేలతల్లికి వందనం
దేశ దేశాలందు దేదీప్య మానమై
పేరైన నా తల్లి  నేలతల్లికి వందనం (నేల తల్లికి)

గల గలా పెన్నమ్మ కదలి వచ్చే నేల
తెలుగు గంగా జలం తిరిగి పారేనేల
ఊరి నల్దిక్కుల పారజూచిన గాని
శ్రీసస్య శ్యామల సిరులు గన్పడు నేల ( నేల తల్లికి )

కోటలో వైభవం కూడిమాడిన మహా
రాచరిక శౌర్యాల రాయలేలిన నేల
నిలువు పటాకత్తి సుళువుగా పనిబూని
చెలగి గుర్రపురౌతు చేయి తొడిగిన నేల ( నేల తల్లికి)

పసుపు కుంకాలతో పట్టు పుట్టములతో
తర తరాలుగ నిల్చి తగ మమ్ముకాపాడు
బంగారు నా తల్లి పరమ పారంజ్యోతి
పోలేరు రక్షగా రాణ కెక్కిన నేల  ( నేల తల్లికి )

ఇల నాల్గు చెరగులా వెలుగులను వెదజల్లి
పేరు ప్రఖ్యాతులను బిరుదులను పొందిన
పరగ విద్యాధికులతో పరవశంబున దిగి
వర సరస్వతి తల్లి వచ్చి నిల్చిన నేల  ( నేల తల్లికి )
 


చూచితి నిజరూపమును


 

గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
కటివస్త్రమొక్కటి గరిమ పైపంచె వలెవాటు
ఒండు రెండాభరణాలు వలనొప్ప నొప్పుగా
నీల మేఘమురీతి నిలువొప్ప తనువొప్పగా
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
తీరుగా తిరుచూర్ణము తిరుమణి నుదుటిపై గల
ఓర కన్నుల స్వామిని ఓహోహో యేమి రూపు
తిరుమల గిరి వాసుని  దేవకీ దేవి సుతుని
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
పునుగు జవ్వాదియును పచ్చకప్పురము విరుల
పరిమళములు దశదిశలను పరిపరి వ్యాపింపగా
రత్నఖచితమకుటముధారిని
రాజీవసుమలోచనుని
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
త్రిభువన సేవిత పదకంజ దేవదేవు తిరునాధుని
ముక్కోటి దేవదేవీజన మ్రొక్కులుబడయు స్వామిని 
మునిజన హృదయ సంస్థిత మురళీ మోహనుని
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు


30, ఏప్రిల్ 2026, గురువారం

జై భజరంగ బలీ


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల


జై భజరంగ బలీ
—---------------
జయ సంజీవిని పర్వత హస్తా
జయ భయ విదూర మహితా
జయ రామ నామ హృదయ స్థితా
జయ సీతాలక్ష్మణసమేత హనుమా నమోస్తుతే
బల అతిబల సువిధ ఘన శక్తి సహితా
అమృత హస్తా అణిమాద్యష్టసిధ్ధి సందీప్తా
భజరంగ బలీ  దయ మము పాలింపు తండ్రీ
జయ సంజీవిని పర్వత హస్తా
జయ భయ విదూర మహితా
జయ రామ నామ హృదయ స్థితా
జయ సీతాలక్ష్మణసమేత హనుమా నమోస్తుతే
శివ రుద్రాంశ జనన చరిత యుత శ్రిత మూర్తీ
భవ తారక మంత్ర సతత భజిత శ్రీరామ భక్తా
భజరంగ బలీ   దయ మము పాలింపు తండ్రీ
జయ సంజీవిని పర్వత హస్తా
జయ భయ విదూర మహితా
జయ రామ నామ హృదయ స్థితా
జయ సీతాలక్ష్మణసమేత హనుమా నమోస్తుతే
ప్రాతస్మరణీయ ప్రవిమల మహాభక్త శిఖామణీ
సీతాలక్ష్మణసమేత శ్రీరామచంద్ర సేవనాఘనా
భజరంగ బలీ    దయ మము పాలింపు తండ్రీ
జయ సంజీవిని పర్వత హస్తా
జయ భయ విదూర మహితా
జయ రామ నామ హృదయ స్థితా
జయ సీతాలక్ష్మణసమేత హనుమా నమోస్తుతే
అతి బలశాలీ వాయుపుత్ర హనుమా  వినుమా
జిత రాక్షస సమూహ శివా చిరంజీవ కనుమా
భజరంగ బలీ    దయ మము పాలింపు తండ్రీ
జయ సంజీవిని పర్వత హస్తా
జయ భయ విదూర మహితా
జయ రామ నామ హృదయ స్థితా
జయ సీతాలక్ష్మణసమేత హనుమా నమోస్తుతే


ఆడుకుందాం రారా


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల


ఆడుకుందాంరారా
------------------------
ఆడుకుందాం రారా గోపాలకృష్ణా , ఆ
టాడు కుందాం రారా గోవిందకృష్ణా !

నింగిలో నిండు చందమామ నిలిచి వెలుగె చూడు
నేలపై  పండువెన్నె లల్లుకొనుచు పరవశించె
నేడు

ఆడుకుందాం రారా గోపాలకృష్ణా , ఆ
టాడు కుందాం రారా గోవిందకృష్ణా

చెట్లన్నీ వాసంతపు చెలువాలతొ మురుసెను
రేయంతా రుతు రాగపు శ్రీలు విరిసి తనిసెను

ఆడుకుందాం రారా గోపాలకృష్ణా , ఆ
టాడు కుందాం రారా గోవిందకృష్ణా

గోవులు లేగలు వెన్నెల కోవెలలకు తరలి వచ్చె
కోవెలలో నాట్యమాడ గోపెమ్మల కోర్కె హెచ్చె

ఆడుకుందాం రారా గోపాలకృష్ణా , ఆ
టాడు కుందాం రారా గోవిందకృష్ణా

బృందావన మధుబనిలో అందాలను రాశివోసె
సుందర సురుచిర సుమధుర శోభాన విలాస వేష 
ఆడుకుందాం రారా గోపాలకృష్ణా , ఆ
టాడు కుందాం రారా గోవిందకృష్ణా !