1, మే 2026, శుక్రవారం

చూచితి నిజరూపమును


 

గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
కటివస్త్రమొక్కటి గరిమ పైపంచె వలెవాటు
ఒండు రెండాభరణాలు వలనొప్ప నొప్పుగా
నీల మేఘమురీతి నిలువొప్ప తనువొప్పగా
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
తీరుగా తిరుచూర్ణము తిరుమణి నుదుటిపై గల
ఓర కన్నుల స్వామిని ఓహోహో యేమి రూపు
తిరుమల గిరి వాసుని  దేవకీ దేవి సుతుని
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
పునుగు జవ్వాదియును పచ్చకప్పురము విరుల
పరిమళములు దశదిశలను పరిపరి వ్యాపింపగా
రత్నఖచితమకుటముధారిని
రాజీవసుమలోచనుని
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు
త్రిభువన సేవిత పదకంజ దేవదేవు తిరునాధుని
ముక్కోటి దేవదేవీజన మ్రొక్కులుబడయు స్వామిని 
మునిజన హృదయ సంస్థిత మురళీ మోహనుని
చూచితి నిజరూపమును శోభాయమానముగా
అరయ లక్ష్మీవారపు అరుదైన అందచందాలతో
దివ్యమంగళ శ్రీనివాస తిరు తేజో విభవములు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి