సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

4, జులై 2020, శనివారం

వైద్యో నారాయణో 'హరీ'

గురువునూ , వైద్యుణ్ణీ దైవంగా భావించే కర్మభూమి మనది . వైద్యో నారాయణో హరి :   అని కదా ఆర్యోక్తి . అందువల్ల డాక్టర్లందరికీ పాదాభి వందనాలు .
ఈపోష్టు 2015 జులై 1న పబ్లిష్ చేసింది .
ఏరంగంలోనైనా దగా మోసం ఉంటే , ఎత్తి చూపడమే నా దృక్పథం . మిత్రుల కోసం మళ్ళీ
ప్రచురిస్తున్నాను .
        
  పూర్వం విద్యా- వైద్యం రెండూ సామాజిక అత్యావశ్యకాలుగా గుర్తించి సంస్థలూ , దాతలూ , ప్రభువులూ ఉదారంగా అవసరమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసి ఉచితంగా అందించేవారు . నేడు మన కర్మ కొద్దీ మనచేత ఎన్నుకొన్న మన ప్రజా ప్రభుత్వాలు మాత్రం విద్యనూ , వైద్యాన్నీ వ్యాపార వస్తువులుగా మార్చి ఖరీదయిన అవసరాలుగా చేశారు .

           ఇక అసలు విషయాని కొస్తే -----

నాకు చాలా రోజులుగా ఎడమవైపున కడుపులో మంటగా ఉంటుండేది . ఒకటి రెండు సార్లు డాక్టర్లు ఎండోస్కోప్ చేయించి అల్సర్లేవీ లేవన్నారు . ఒక డాక్టరు మాత్రం ఎండోస్కోప్ లో కనిపించక పోయినా పెప్టిక్ అల్సర్ ఉంది

మీకు అని ఒక కోర్సు మందులు రాయడం , వాడడం , ఉపశమించడం జరిగింది .

            మళ్ళీ ఈమధ్య కని పించే సరికి  - హైదరాబాదులో ఉన్నాంకదా అని – మహానగరంలో పేరొందిన

ఏకైక పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో చూపించి బాధనుండి పూర్తిగా విముక్తి పొందాలని ఆశ పడ్డాను .

            ఖాళీ కడుపుతో ఒకరోజు ఉదయాన్నే ఆరింటికి హాస్పిటల్ చేరుకున్నాను . అప్పటికే రిజిష్ట్రేషన్ కౌంటర్

వద్ద చాలా మంది గుమి గూడి ఉన్నారు . ఫీజు చెల్లించి నేనూ రిజిష్టర్ చేయించు కున్నాను . హాల్లో వెయిట్ చేయమన్నారు . తొమ్మిది కావస్తోంది . హాస్పిటలంతా హడావిడి మొదులైంది . సందర్శకులతో , సిబ్బందితో క్రిక్కిరిసి

సికిందరాబాదు రైల్వే ష్టేషన్ లా కనువిందు చేస్తోంది .

           ఈలోగా హాల్లో ఉన్న మైక్ లోంచి చెకింగ్ బ్లాకు లోకి ఆహ్వానిస్తూ కొన్నిపేర్లు ఎనౌన్స్ చేశారు . నాపేరు కూడా ఉండడం గమనించి వెళ్ళాను . ఒక్కో చిన్న చిన్న కేబిన్ లోకి ఒక్కొక్కర్ని పంపించారు . చెకప్ డాక్టర్ రావడంతో

నేను నా గోడు వెళ్ళబోసుకోవడం మొదలెట్టాను . ఆయన విటున్నాడో లేదో నాకయితే అర్థం కాలేదు . చిట్టీ మీద

రాసుకుంటూ పోతున్నాడు . అంతా ఒక్కనిమిషంలో అయిపోయింది . ఆ చీటీ నాకిచ్చి క్యాష్ కౌంటర్ కెళ్లమన్నాడు .

            కౌంటర్లో బిల్ వేసి రు.7900 – కట్టమన్నారు . నేనంత పైకం తీసుకెళ్ళ లేదు . కార్డుంది . తీసిచ్చాను .

పైకం జమ చేసుకుని , ఎండోస్కోపీ యూనిట్ కెళ్ళమన్నారు . ఎండోస్కోపీ తదుపరి , బ్లడ్ శాంపిల్ యూనిట్ ,

అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు దాటింది . ఇంకా కొలనో స్కోప్ మిగిలే ఉంది . అప్పటి వరకూ

ఏమీ తిన లేదు , తాగలేదు . ఖాళీ కడుపే . ఓరి దేవుడా ఏమిటీ ఖర్మ అనుకుంటూ కొలనోస్కోప్ కోసం విచారించాను .

             హాస్పిటల్ మందుల షాపు చూపించి కొలనోస్కోప్ కిట్ కొని తెమ్మన్నారు . మంచినీళ్లు లీటర్ బాటిళ్ళు

రెండు కొనమన్నారు . కిట్ లోని టాబ్లెట్ మింగించినారు . ఒక్కొ లీటర్ లో రెండు పొట్లాల పౌడర్ కలిపి అరగంటకోసారి

తాగమన్నారు . అరగంట తర్వాత మోషన్స్ మొదులౌతాయి . పది పన్నెడు సార్లు మోషన్స్ తరువాత రండి . సెకండ్ ఫ్లోర్ లో కెళ్లండి . అంతా అర్థమౌతుంది . సాయంత్రం ఐదు తర్వాత కిందికి రండి అన్నారు .

            అన్నీ సిధ్ధం చేసుకుని సెకండ్ ఫ్లోర్ చేరే సరికి మిత్రులు ఆడా మగా చాలా మందే ఉన్నారు . నేనూ వారితో చేరి నరకంలో విహరించాల్సి వచ్చింది ఐదు వరకూ .

            కొలనో స్కోపీ యూనిట్ లోకి వెళ్లి టెస్ట్ పూర్తి చేసుకుని బయట పడే టప్పటికి ఏడయ్యింది .

రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకునే సరికి ఎనిమిదయ్యింది . అన్నీ నార్మల్ రిపోర్ట్స్ .

            పది పన్నెండు మందిని ఒక్కో డాక్టర్ కేబిన్ కు తీసుకెళ్ళారు . డాక్టర్ సహాయకుడు మాఫైళ్ళు

తీసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఒక్కొక్కర్నీ డాక్టర్ వద్దకు పంపిస్తున్నాడు .

            నేను వెళ్ళే సరికి డాక్టర్ ఫోనులో మాట్లాడు తున్నాడు . నేను వెళ్ళి నిలబడ్డా . ఉలుకూ పలుకూ లేదు .

నిలబడే ఓపికలేదు . వయసా అరవై మూడు . రోజంతా ఉపవాసం . పైగా కొలనోస్కోప్ ప్రిపరేషన్ కోసం పది పన్నెండు సార్లు .......

            ఫోను సంభాషణ పూర్తయినట్లుంది . ఫైలందుకుని డాక్టర్ ఏదో రాస్తున్నట్లనిపించి , నేను నాగోడు

వెళ్ళబోసుకుంటున్నాను . వింటున్నట్లు లేదు . విన్నట్లు లేదని మళ్ళా మొదలెట్టేను . మందులు రాశాను కదా  అన్నాడు , ఇక వెళ్లమన్నట్లు చూచి . బెల్ కొట్టేడు , ఇంకొకర్ని పంపమని .

           తీరా ఏమి రాశాడా అని చూస్తే , పది మందుల పేర్లు టైప్ చేసిన ఒక స్లిప్ నా ఫైల్లో అంటించి ఉంది .

పేర్లకు ముందున్న బాక్స్ లలో ఈయన గారు సింపుల్ గా టిక్కులు కొట్టేడు . నాకేమనిపించిందంటే అసిస్టెంట్

మందుల స్లిప్పంటించడం , డాక్టర్ టిక్కులు కొట్టడం తప్ప వీళ్లకే అధికారాలూ లేవేమో అని .

           అంటే ఈ పేరు మోసిన హాస్పిటల్లోకి అడుగిడితే మనంచెప్పేది అస్సలు వినరు . అక్కడున్న దాదాపు

అన్ని టెస్టులూ వాయించేస్తారు . మందుల చీటీలు ముందే అంటించి మందులు అమ్మేసుకుంటారన్నమాట .

           ఏమిటో అంతా మాయాజాలం . మరి రోగం కుదిరిందా అంటే , కుదిరితే ఈ సోదంతా ఎందుకూ .

జాలంలో చిక్కుకుంటే గాని తత్త్వం బోధపడదు కదా !

                          వైద్యో నారాయణో ‘ హరీ ‘   -  అని సరిపుచ్చుకుందాం . 
ఇదీ _ కార్పొరేట్ హాస్పిటల్స్ దందా . దగా .
తస్మాత్ జాగ్రత్త .

7 కామెంట్‌లు:



  1. ఏరంగంలోనైనా దగా మోసం ఉంటే , ఎత్తి చూపడమే నా దృక్పథం.....


    ఈ కాలపు కార్పొరేటు ఉస్కూళ్ళు ట్యూషనయ్యవార్ల గదగా మోసం ఏదన్నా వుందాండీ ? దాని పై కూడా కొంత మీ దృక్పథం తెలుపగలరు



    ఇట్లు

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సర్కారు బడిజెప్పు సార్లకు పట్టదు
      చేతి నిండ రియలెస్టేటు వల్ల
      పర్యవేక్షకులకు పట్టదు పనితీరు
      విద్యానిధులు బొక్కు విధుల వల్ల
      పాఠశాలల బాగు పట్టదు నేతకు
      కార్పొరేటు బడుల కలిమి వల్ల
      బిడ్డల చదువులు పెద్దవారెరుగరు
      జీవన పోరాట స్థితుల వల్ల

      వెరసి - సర్కారు బడులలో వెలయు చదువు
      చిత్తశుధ్ధికి దూరమై చిత్రమైన
      తీరు తెన్నుల భాసించు తీరు చూడ
      చదువు మృగ్యము చదువుల సుదతి సాక్షి .

      కొడుకు జదివించు కొనుటకు కూలి చేయు
      తల్లికి తనయ చేదోడు తప్పదయ్యె
      చదువు సర్కారు బడులలో చక్కనైన
      కార్పొ’ రేటు ’ బడుల కేగు కర్మ తొలగు

      తొలగించండి
  2. మిత్రులు రాజారావు గారు,
    కార్పొరేట్ వైద్యలీలను కళ్ళకు కట్టినట్లు వివరించారు!

    రిప్లయితొలగించండి
  3. బాగా చెప్పేరు సార్
    అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అంతేలా ఉంది మాస్టారూ! మాస్టారు ఆస్పత్రి పేరు చెప్పడానికి మొహమాట పడ్డారో భయపడ్డారో :) మీరు చెప్పినలాటి డాక్టర్లంతా ఆ కార్పొరేట్ ఆస్పత్రికి డబ్బు సంపాదించే యంత్రాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హైదరబాదులో సదరు హాస్పిటల్ పేరు తెలియనివారుండరు . ధన్యవాదాలు సార్ .

      తొలగించండి
  4. మాస్టారూ,
    మీ లాటి మేధావులు కార్పొరేట్ విద్య,వైద్యం లాటి వాటిలో కుళ్ళును బయటపెట్టి కడిగేయాలి సార్, చాలా బాగా రశారు. విన్నకోటవారెక్కడా?

    రిప్లయితొలగించండి