మా కుల్లూరు
***********
ఇందు నందున రాముని మందిరాలు
ఊరి కుత్తర దక్షిణ పూరు లందు
రెండు గల వెందుకో ? వితర్కించి చూడ
తెలిసె నొక గుట్టు , చెప్పెద తెలిసి నంత .
కొండొక సైన్య పటాలం
బుండిన కోటున్న దిచట , పూర్వము బలిజల్
దండి మగలు రౌతులుగా
నుండి రని మొదట వచించి యుంటిని దెలియన్ .
యుధ్ధ విద్యల నేర్పించ నుధ్ధతులను
గురువులను దెచ్చి విద్యల గరపు వారు
సాము గరిడీలు నేర్పగా సగము సగము
పంచుకొనిరిట్లు పురమును పట్టు కొరకు .
నల్లంగు వాళ్ళ బడియని
అల్లాగునె వెంకయబడి యని పేర్లరయన్
యెల్లన్ విద్యల నేర్చిరి
కుల్లూరున పిల్ల లెల్ల కోవిదు లవగా .
బడులు గుడులౌను దశరాకు , ప్రభలు గట్టి
రామ లక్ష్మణ సీత విగ్రహము లొనర
దీర్చి , పురవీథులందున జేర్చి , యచట
సాము గరిడీలు ద్రిప్పుట నీమ మిచట .
పిల్లలకు తాము నేర్పిన విద్యలెల్ల
సాము గరిడీలతోటి విస్మయము గదుర
తనరి జేయంగ విద్యా ప్రదర్శనముల
ఊరు ఊరంత ఉర్రూత లూగు చుండు .
యుధ్ధ విద్యలు కొలువైన యూరు గనుక
సైన్యమున రౌతులై యున్న చదురు గనుక
సాము గరిడీల పోటీలు సాగు చుండు
ముచ్చ టొకనాడు కుల్లూరు పురము గనెను .
రాజ్యములు కోటలును సైన్య రావడులును
పోయె , నిరుగడ బడులు రూపులను మాసి
రామ మందిరా లయ్యెను , రామణీయ
కముగ దశరా మహోత్సవ కాంతు లొనరె .
నాకు దెలిసియు దశరాకు నవమి నాడు
కత్తి కర్రల పోటీలు గలవు , విజయ
మందిన వారికి తగు బహుమతులు గూడ
ఇచ్చు ముచ్చట జూచితి నిచట నేను .
దశరా యుత్సవము లనిన
దశ దిశలకు పేరు గాంచి తా కుల్లూరిన్
విశదంబుగ నేనుగుపై
ప్రశస్తముగ రామచంద్ర ప్రభు డూరేగున్ .
కుల్లూరి బలిజ వంశము
విల్లమ్ములు దాల్చి యుధ్ధ విద్యల నేర్చెన్ ,
బల్లేలు పటాకత్తులు
మొల్లమ్ముగ నింట నింట మూల్గుచు నుండెన్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి