సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

28, డిసెంబర్ 2025, ఆదివారం

నేటి మా కుల్లూరు


ఒక నాటి కుల్లూరి యున్నతుల్ స్మరియింప

గర్వ ముప్పొంగు సాగరము రీతి

సు విశాలమై , కళల్ శోభించు పెంకుటిళ్ళు

ఇంటి ముంగట నొప్పు   జంటరుగులు

ఎత్తుగా ప్రహరీలు ఇంపుగా ముంగిళ్ళు

ఏపుగా పెరిగిన వేప చెట్లు

ప్రతి యింటి వెనుకల బావియు , వంటిల్లు

మధ్యన హాలు ధీమమ్ము గదుర


అన్ని వసతులు గల్గి సంపన్న మై , యొ

నర్చు వైభవోపేత ఘనతలు , కళలు

కటకటా ! కనంగ , నిటు నా కళ్ళ ముందె

రూపు గోల్పోయె , నేమిటీ లోప మకట !


ఏరీ మా పెద్ద తలలు

ఏరీ మా చెలిమికాండ్రు , ఏమై పోయెన్

ఊరి మహోన్నత శోభలు ?

ఊరంతా ఘన నిశీధి  , ఊరా కాడా ?


పటుతర గృహాలు కూలెన్

ఎటు చూచిన శిధిల కుడ్య హేలె కనబడున్

మటు మాయ మాయె వెలుగులు

పటిమలు గోల్పోయె ఊరి ప్రాభవమెల్లన్ 


రూపాయి కనగ నోచని

మా పల్లెల లోన ' నాడు ' మా ఊరి గృహాల్

ప్రాపుగ వందలు వేలుగ

రూపాయిలు గలిగి వెలిగె రుణదాతలుగా .


చుట్టు పక్క లూళ్ళ సొరిది రైతులు గూడ

రుణము కొఱకు రాని రోజు లేదు

పార జూడ నొక్క నూరు రూపాయలు

పుట్టు ఊరు లేదు చుట్టు పట్ల .


ధన ధాన్య రమా విలసిత

ఘనతలు తలదాల్చి బలిజ ధార్మిక గృహముల్

మొనసి తదితర కులాలకు

దిన వెచ్చము లొసగి , బతుకు తెరవు లొసంగెన్ .


ప్రతి యింట యినప్పెట్టెలు

అతిశయముగ పసిడి నిండి అలరారె , ధన

స్తితి , భూ స్తితి శ్రుతి మించుడు

నతులిత వైభవము తోడ నందల మెక్కెన్ .

 

క్రిక్కిరిసిన జనములతో

పెక్కగు అంగళ్ళు నాడు పెంపు వహించెన్

అక్కజ మవి యెటు వోయెనొ ?

పక్కూళ్ళ జనాలు రారు పదిమందైనన్ .


వందలాది బలిజవాళ్ళ కుటుంబాలు

వలస వోయె నగర బాట బట్టి

ఊరు వదలినారు ఉద్యోగములబట్టి

కూలె యిళ్ళు , మొలిచె కుటజ తతులు .


అసలూరు నిర్ మనుష్యము

మసలిన పాళేల జన సమర్థత పెరిగెన్

పసగల వారు గతించిరి

కసుమాలపు జాతి హెచ్చి కళదప్పె కడున్ .



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి