సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

20, నవంబర్ 2020, శుక్రవారం

కైమోడ్పులు

 


పదపడి కళ్ళెముంభిగిచి పళ్ళకు మధ్యన , రెండుచేతులన్

బొదివి మహోగ్ర ఖడ్గములు , మూపుకు బిడ్డడి గట్టి , స్వారియై

పది పదునైదు రక్షకులు ప్రక్కగమించగ  , రౌద్రమూర్తియై

కదిలెను ఝాన్సిలక్ష్మి యలుకన్ దునుమాడగ నాంగ్లసేనలన్ .


కత్తుల రెండుచేతులను కంఠములన్ తెగగోసె శత్రులన్

బిత్తరచూపులన్ రిపులు భీతిలి రాయమ వీరవిక్రమో

న్మత్తత జూచి , మోసపు సమాయతనంబున నొంటె సైన్యమున్

క్రొత్తగ దింపి వెన్క కడ కూడి తటాలున దాడిసేయగా


కలవరపాటునంద , వెనుకన్ ఛురకత్తియ వీపులోదిగెన్

నెలతకు , వెంటవెంటనె ఘణిల్లున గుండుదిగెన్ , హయమ్ము వె

ల్వెలవడె , నింతలో గదిసి పెల్లుగ శత్రులు కత్తివ్రేటులన్

దలగిరి శీర్షమున్, చివరిదాకను పోరెను నెత్తురోడుచున్ .


ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామ యోధురాలు

రాణి ఝాన్సిలక్ష్మీయె , చిరస్మరణగ

భరత భూమి దలచు దేశభక్తురాలు

భక్తి  కైమోడ్చి ప్రణమిల్లి  🙏 ప్రణతు లిడుదు .

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి