సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

4, జులై 2017, మంగళవారం

నీ కెలా గంటు కొనె నల్పు నీరజాక్ష !

దేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు

బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !

6 వ్యాఖ్యలు:

 1. రాజారావు గారు.
  మంచి ప్రశ్న.
  నా ఊహను శ్యామలీయం బ్లాగులో వివరంగా ఇప్పుడే వ్రాసాను చిత్తగించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తమ బ్లాగులో సంబంధిత టపా చూచాను . మీ యూహ పసందుగా
   ఉంది . ధన్యవాదములు . విష్ణునందనుల వారికి కూడా ధన్యవాదములు .

   తొలగించు
 2. నాకు ఛందస్సు అంతగా తెలీదు - కానీ మీ ఈ పద్యం చదవగానే నేనొక మమూలు కవిత ప్రయత్నించాను. తప్పులుంటె మన్నించండి, తెలుగు మాస్టారు!

  జలజదళమె నేత్రద్వయం
  జలధిజ కూరిమి నీకు ప్రియం
  జలదమె కూర్చె మేనిఛాయ
  జనమె వశులవు పరవశులవు నిను గని జనార్దన!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లలితగారి కవిత బాగుంది . కాస్త ప్రయత్నిస్తే
   మీకు పద్యం రాయడం ఏమంత కష్టం గాదు .
   ఆల్ ది బెస్ట్ .ధన్యవాదములు .

   తొలగించు
 3. "బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
  లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
  పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
  నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !"

  ఈభాగం ఎందువల్లో పోతన గారిని గుర్తుకుతెచ్చింది. పాలపుంతని చూస్తే అందరికి తెల్లని కాంతి కనిపిస్తే నాకేమో అనంతమైన నలుపులో ఆ ఒక్క భాగమే తెల్లగాఉందనిపిస్తుంది. అంటే అంతా వ్యాప్తి చెందిన నలుపు సర్వవ్యాపకుడైన విష్ణుభగవానునికి సంకేతమనిపిస్తుంది. అందువల్ల వెన్నుడు నల్లనివాఁడె, మనందరినీ ఆకర్షించి తన వైపు తిప్పుకొనేవాడే.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిజమే ,విశ్వం లో వెలుగు రేఖలు నామ మాత్రమే .
   విశ్వమే నలుపై నప్పుడు విశ్వ విభుడూ నలుపే .
   ధన్యవాదములు .

   తొలగించు