సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, జనవరి 2018, ఆదివారం

నిన్న శనివారం యాదాద్రి నరసింహుని దర్శన భాగ్యం లభించింది

చేరి భీకరమైన సింహ ముఖమ్మున
దంష్ట్రల కోరలు దడలు పుట్ట
గట్టు గట్టంతయు గడడగడ వణకంగ
అరుపుల రౌద్రంబు లురులు చుండ
రక్కసు నుఱము చీల్చ నురికిన నల్ల
పారి చారలు గట్టి జారుచుండ
ఉగ్రత తగ్గించ నుదధి కన్యక చేరి
తొడమీది కెక్కి చేతులు మొగిడ్చ

కాస్త శాంతించి  యాదాద్రి గట్టు మీద
రక్షగా నిల్చి  జగములు గ్రాల  కాచు
లక్ష్మి నరసింహు దర్శించి ప్రణతు లిడితి
నిన్న శనివార మనుభూతి యెన్న తరమె !

6 వ్యాఖ్యలు:

 1. నరసన్న దరిసెనము నానాశుభదాయకము
  పరమభక్తులకు దివ్యవరదాయకము

  అరనరుడైన హరి యల్లడిగో వాడె
  పరమోదారుడై పంచనారసింహుడై
  పరమశాంతరూపుడై జ్వాలాభేరుండ
  వరనందయోగరూపభాసమానుడై

  కొత్తపాతగుడులమధ్య గుఱ్ఱమెక్కి తిరిగే
  చిత్తజని తండ్రిని శ్రీనారసింహుని
  చిత్తములో తలచువారి జీవితములలో
  నెత్తరిల్లు శుభముల నేమని వర్ణింతుము

  హనుమన్న క్షేత్రపాలుడై తన్ను కొలువగ
  మునిజనసంసేవ్యుడై మొనసి నరసింహుడు
  జనులార యాదాద్రి సంస్థితుడైనాడు
  కనులార గాంచరే కరువుతీర పొగడరే

  - మిత్రులు రాజారావు గారికి అభినందనలతో -
  శ్యామలరావు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అర నరు డైన ఆ ' హరిని ' అల్లడుగో , యని , కళ్ళముందు శ్రీ
  హరి నరసింహ మూర్తిని మహాద్భుత రీతిని పాటగట్టి చె
  ప్పిరి - కనిపించె కట్టెదుట , పెద్దనృసింహుడు , లక్ష్మితో సహా ,
  మరి మరి కళ్ళు చెమ్మగిలె , మాన్యుడ ! శ్యామలరావు మిత్రమా !

  ప్రత్యుత్తరంతొలగించు
 3. దుష్టసంహార నరసింహ దురిత దూర!
  నృసింహ క్షేత్రాలన్నీ తెనుగునాటనే ఉండడం మన భాగ్యం.
  నృసింహ దర్శనం సర్వ భయహరం

  ప్రత్యుత్తరంతొలగించు
 4. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వైభవంతో సర్వ శుభకరంగా ఉందండీ .
  ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మకరసంక్రాంతి శుభకామనలు, మాష్టరుగారు !

  ప్రత్యుత్తరంతొలగించు