19, ఏప్రిల్ 2019, శుక్రవారం
ఆవకాయ - అమరావతి
ఆవకాయ - అమరావతి
-----------------------------
భక్ష్య లేహ్య చోష్య బహువిథ భోజ్యాల
రుచులు చూచి చూచి రోత పుట్టి
నాల్క తుప్పు డుల్చు నవవిథ రుచి గూర్చి
తపము జేసె నొక్క ధార్మికుండు .
మంగళ గిరి ప్రాంతమునకు
చెంగట దిగి యతడు తపము జేయుచు నుండన్
రంగారు విపిన తలములు
క్రుంగంగా బారె నతని ఘోర తపమునన్ .
తపము బలము నింద్రు తాకెను , తనకేదొ
మూడె ననుచు నతడు ముగ్ధలైన
అప్సరోవనితల నంపె తపము గూల్చ
తలిరు బోడు లటకు తరలి రంత .
ఆమని యరుదెంచె నామ్ర తరువులన్ని
పూప పిందె బట్టి పొలుపు దాల్చె
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .
మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
పప్పునూనె బోసె పరువాల యూర్వశి
రుచికి పడి ఘృతాచి లొట్ట లేసె .
అల్లంత దూరమందున
నుల్లము రంజిల్ల ' ఘాటు ' నోరూరించన్
కళ్లు దెరిచి వెళ్లి తబిసి
యల్లన రుచి చూచి తన్మయత్వము నందెన్ .
కొత్తావకాయ రుచి గని
తత్తర పడి తబిసి తపము ధన్యత గాంచన్
బిత్తరు లందరను గూడి
చిత్తము రంజిల్ల విడిది చేసెను వనిలోన్ .
పోయిన భామలు రాలే
దేమయినదొ యంచు నింద్ర దేవుడు వెదుకన్
ధీ మహితులు సురలందరు
భూమికి దిగి వచ్చి చూడ ' బొమ్మ ' కనబడెన్ .
తబిసి తలిరు బోళ్లు తనివార కొత్తావ
కాయ రుచులు గొనుచు కన బడి రట
దేవ గణము గూడి దేవాధిపతి గూడ
వచ్చి చేరి రుచికి మెచ్చి నారు .
ఆవ కాయ రుచికి యమరులు పరవశం
బంది స్వర్గ సీమ మరచి నారు
అచటె యుండి పోయి ' రమరావతి ' యనంగ
' నాంధ్ర రాజధాని ' యయ్యె నేడు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మాస్టారు,అ(మరావతి)ఆ(వకాయ)లు అద్భుతః.
రిప్లయితొలగించండిసార్ , ధన్యవాదాలు .
తొలగించండిబతికించారు, మరో అప్సరస చేత వెల్లుల్లిపాయలు కలిపించలేదు ఆవకాయలో 🙏 😀. మొత్తానికి గురజాడ అప్పారావు గారి “ఖగపతి యమృతము తేగా....” లెవెల్లో చెప్పారండి దివ్యావకాయ గురించి. మీ బ్లాగ్ పేరులోని రెండవ పదానికి తగినట్లుగా ఉంది ఈ టపా👌.
రిప్లయితొలగించండిఐతే , నరసింహరావు గారూ ,
తొలగించండిఆవకాయలో వెల్లుల్లి కలపాలన్నమాట .
ధన్యవాదాలు .
వద్దు బాబో వద్దు , కలపద్దు 👐 .
రిప్లయితొలగించండి"..... వెల్లుల్లిన్ దిలపిష్టమున్ విసివితిన్ విశ్వస్త వడ్డింపగా ....." అంటూ శ్రీనాథుడు తిన్నాడేమో గానీ నేను మాత్రం వెల్లుల్లి తినలేను ... విశ్వస్త వడ్డించినా, అప్సరస వడ్డించినా 😑.
విసివితిన్ ? , ఓహో , తిని తని విసిగిపోవడమా ?
తొలగించండిమెసవితిన్ అనే పాఠాంతరముందేమో ! నేను విన్నాను లెండి .
సార్ , విశ్వస్థ అంటే అర్థం తెలుసు గాని , పరమార్థ మెఱుగను ,
తెలుపగలరు .
తొలగించండిబుచ్చమ్మ
రిప్లయితొలగించండిఆవకాయ పోయె నౌర వెల్లుల్లియె
కాస్త పుంజుకొనెను కతని చూడ
విసివి కొనెడు కైపు విశ్వస్త వేంచేసె
విశ్వదాభి రమణి విను జిలేబి :)
జిలేబి
అసలు విస్వస్థ తేలక చస్తుంటే ,
తొలగించండిమళ్ళీ మీరు విశ్వద ను తీసుకొచ్చేరే .
విశ్వద వేమారెడ్డి గారి బాపతు - అని
విమర్శకులంటారు . మీరు మకుటాన్ని
విశ్వ వినుత గా మార్చండి , లెస్సగా
ఉంటుంది .
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
రిప్లయితొలగించండిఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .
మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
---------
వావ్
Rao S Lakkaraju గారూ ,
రిప్లయితొలగించండినమస్సులతో కూడిన ధన్యవాదాలు .
మీరు నేర్పిన కొత్త అచ్చులు అ(మరావతి)-ఆ(వకాయ) బహు బాగా నచ్చాయండి, మాష్టారు!
రిప్లయితొలగించండిలలితా TS ,
తొలగించండిధన్యవాదాలు .