సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

కందానికి కూడ దురద .....కందకు దురదందు , రరెరె !
కందానికి కూడ దురద గట్టిగ కలదా ?              మందే లేదా ? మానుటె
మందా ? మరి కంద ప్రియుల మతులే మౌనో ?

శ్రీ ' సుసర్ల ' గారికి కృతఙ్ఞతలతో .....

20, ఫిబ్రవరి 2020, గురువారం

మహా శివరాత్రి శుభాకాంక్షలు


తన్వర్థభాగంబు తన్వికొసగి , భార్య
అర్థాంగి మనలోన యని తెలిపెను ,
నిరత నిశ్చల తత్త్వ నియమాన్ని పాటించి
కుదురుగా నుండుట కూడ నేర్పె ,
ఆనంద తాండవ మాడి , యాడుట నేర్పి
నందించుటే శక్తి కింధన మనె ,
తన జటా జూటంబు తగ భిగియగ గట్టి
బుధ్దిని తనువును ప్రోది బెట్టె ,

గళములో దాచు , నీలోని గరళ ముమిసి
లోకమును నాశ మొందించ బోకు మనెను ,
ఎన్ని నేర్పించె నీశ్వరు డీ జగతికి !
మాట వినకున్న ,  'లయమె' ప్రామాణికమ్ము .

17, ఫిబ్రవరి 2020, సోమవారం

శాక్యమౌనికరుణయే రూపమై కన్పించు తాపసి
త్యాగమే దేహమై తిరుగు మౌని
దుఃఖంపు విరుగుడు దొరక బట్టిన దొర
సత్య  మహింసల  సంగ కాడు
సిధ్ధార్థుడన్ పేర జీర నన్వర్థమై
బుధ్ధుడై వెలిగిన బోధకుండు
గాలిలో దీపాల కరణి మతము లున్న
తరుణాన  నిలిచె బౌధ్ద ప్రదాత

భరత మాతృ గర్భాన సంభవము చెంది
జగతి  నేలిన  దేవుడు శాక్యమౌని
ఏమిరా ! భారతీయుడ  ! యే మదృష్ట
మిది ? మన మిచట బుట్ట , కామితము గాదె !

కృష్ణం వందే .....

ముత్యాల జలతారు ముందుకు దిగజార్చి
తలమీద నెమలీక  వెలయ నిలిపి
పీతాంబరము గట్టి ప్రియమార కటివస్త్ర
మును ,  పైన మొలనూలు మురియ దీర్చి
పచ్చని పటము పైపంచగా వైచి
పొగడ దండలు మెడను దిగ నొనర్చి
నుదిటిపై కస్తూరి నును తిలకము దిద్ది
మురిసి బుగ్గలపైన ముద్దు లిచ్చి

కూలి యాతల్లి నేలపై కొంత యలసి
ఎంత  కైసేసినను నితడి కేదొ కొదువ
యౌ , నిదె ! మురళి , మరచితి , నను యశోద
దెంతదృష్టమొ కృష్ణ ! నీ దెంత కృపయొ !

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

మాటలా ? చేతలా ?


మాటలను కూర్చి రచనల మాయజేయు
కవులు ! , పండొలిచి ప్రసంగ విథ వివిధ
భాగవత సంవిధ ప్రవచనాగమములు
సేయు బుధులు ! , మీ తీరులు చిత్త మలరు .

వృక్షో రక్షతి యందురె !
అక్షయముగ నొక్క మొక్క నల నాటి కడున్
రక్షించి పెంచి యటుపై
వీక్షింపుడు చెట్టు శోభ  విభవము దెలియున్ .

మాటలకే పరిమితమై
పాటింపరు చేతలు , పరిపాటి యిదే , యీ
నోటి పసగాళ్ళ తీరని ,
మోటుగ మాటాడ , పడుట , మోమాటేలా ?

ధర్మకార్య నిరతి మర్మమ్ము దెలిసిన
మాట కంటె చేత మహిత మెపుడు ,
శుష్కవాక్య ఝరులు శూన్య హస్త చయము
గాని ,  యిలను , పనికి రాని వెపుడు .

ఒక్క చేతి మీద నోలి రెండొందలు
మొక్కలు తగ నాటి నిక్కువముగ
రక్షణ నొనగూర్చి  రమణమై కడుపెంచి
పెద్ద జేసినాడ తద్దయు కడు .

నేడవి యిరవై యడుగులు
శోడష కళ లూని పెరిగి శుంభద్యశమై
కూడి నన పూప పిందెల
పోడిమితో కాపుకొచ్చె  మోదము గూర్చెన్ .

అమ్మ గుడికి శోభ లలరారె పచ్చంగ
దర్శనీయ మగుచు తరులు లతలు ,
జన్మ ధన్యమయ్యె ,  జనని పోలేరమ్మ
కృపలు కూడ నాకు సఫలమగుట .

31, డిసెంబర్ 2019, మంగళవారం

క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు 2020

కృతఙ్ఞతలు
********
కిరణ పుంజము లద్ది ధరణికి శక్తి ప్ర
సాదించు తరణికి సాగి ప్రణతి
నిలువ నీడ నొసంగి నిలువెల్ల పొదివి సం
రక్షించు పుడమికి  ప్రణతి శతము
జీవమ్ము విరియాడ జేయు పావనమైన
గాలికి మనసా ప్రగాఢ ప్రణతి
త్రాగుట ,  కాహార సాగుకు దాతయౌ
నీటికి ఘనముగా మేటి  ప్రణతి

అక్షయముగా వనరు లిచ్చి , యడు గడుగున
మమ్ము గాచెడి పరమాత్మ కెమ్ములింతు ,
కడు కృతఙ్ఞత జూపించి ,  ఘనత వొగిడి ,
క్రొత్త వత్సర శుభవేళ చిత్త మరసి .

25, డిసెంబర్ 2019, బుధవారం

ఈ వీడియో చూడండి ..... అద్భుతం


ఇది స్పెయిన్ లో ఆ దేశస్తురాలు గానం చేసిన శ్లోకం , వేదం లోది .
మనం ప్రపంచం వైపు చూస్తున్నాం .
ప్రపంచం మనవైపు చూస్తోంది .

అన్నం దేహధారులకవశ్యం .
అన్నం సమకూర్చే దాతను ప్రార్థిస్తూ ..
తండ్రీ ! నాకు ఆరోగ్య ప్రదమైన ,
పుష్టివర్ధనమైన అన్నాన్ని ప్రసాదించు ..
అంటూ , నీవు నాకు సమకూర్చే ప్రసాదాన్ని
కేవలం నేనొక్కణ్ణే కాకుండా
అందరకూ పంచి భుజిస్తాను ..
అని దీక్షబూనడం దీనర్థం .
       ~~~~~
అన్నమె దేహ ధారులకు సాంత మవశ్యము , శక్తినిచ్చుచున్
మిన్నగ దీవెనల్ నొసగు , మేలొనగూర్చెడు నన్నదాత   ! మా
కెన్నగ నిమ్ము భోజనము నింపగు నట్లుగ , నేను మందితో
మన్నన బొంది పంచుకొను మాడ్కి భుజింతును మేల్ దలంచుచున్ .

17, నవంబర్ 2019, ఆదివారం

తెలుగు భాష పుడమి యున్నంతదాకా జీవిస్తుంది .


బాష  నుధ్ద రించ  ప్రజలెల్ల రున్నారు ,
జనుల భాష కెందు చావు లేదు ,
వాగు బుధుల మాట వట్టిది , పుడమిపై
తెలుగు యశము సతము తేజరిల్లు .

తెలుగు మాటలాడి తీరక జరుగదు
యుగ యుగాల దాక   ,  రగడ కెక్కి
తెలుగు వోవు ననుచు తిక్క తిక్కగ వాగు
బుధులకు పిసరైన బుధ్ధి  గలద ?


ఫేసు బుక్కు మొదలు సోసలు మీడియా
లన్నిట మన తెలుగు రాణ కెక్కి
మునుపు కంటె నేడు ముచ్చటల్ మురియంగ
తెలుగు పలు విధాల తేజరిల్లు .

ఏదేశమేగినా  ఈ
మాధుర్యము వీడినార ? మరువక తెలుగున్
సోదరులెంతోముదముగ
ప్రోదిగ నెన్నేని వ్రాయ బోవుట లేదా ?

రాజకీయ బుధ్ధి రచ్చకీడ్చును గాక
పోడిమ చెడుగాక బుధుల బుధ్ధి
జనము నోళ్లయందు ఘనముగా వృధ్ధియై
నాదు తెలుగు బ్రతుకు నరనరాన .

12, నవంబర్ 2019, మంగళవారం

మావూరి శివాలయంలో నేను .....


మట్టి ప్రమిద దెచ్చి మహదేవు నర్చించి
ఆవు నెయ్యి వోసి అభవు నెదుట
వత్తి వేసి శివుని వాకిట నీ రోజు
దీప మిడుడు , జన్మ తేజరిల్లు .

10, నవంబర్ 2019, ఆదివారం

బుడుతడే ఆదర్శమైతే .....అడెడెడె ! యెంత నేర్చె ! నహహా ! యిది చూచి మతుల్ చనంగ , నీ
బుడుతని యెత్తి , ముద్దులిడ , పూనిక పుట్టు తలంపులోన , యీ
త డిని గనంగ నెంత ఘనతల్ చవి చూచిరొ తల్లిదండ్రు ! లి
క్కడ గద ! బంధముల్ విరిసి , కండ్లకు గట్టె , మనోఙ్ఞమూర్తులై .

5, నవంబర్ 2019, మంగళవారం

అందాల రేలు


సంజె కెంజాయ పుడమిపై చాటు కొఱిగి
చిమ్మ చీకట్లు పరచి రంజిల్లు వేళ
మినుకు మినుకంచు చుక్కలు మినుకు వేళ
రాత్రి యందాల కనుకెంపు రగులు వేళ .....

లీల సుమగంధముల చిరుగాలి వీచి
చేరి ప్రేయసీ ప్రియు దేహ చిరు చెమటల
సోలులు దిగార్చి , కేళుల హాలి గూర్చు
హాయి,  రాత్రులుగాక  ,  ఈ యహములిడున ?

మంచి మనసున్న మారాజు మత్తు గొలుపు
వెన్నెలల సుధలు చినుకు  వేళ యిదియె
జవ్వనుల మనసు పరవశమయి ప్రేమ
విరిసి కౌగిళ్ళు గదియు నవ్వేళ యిదియె

స్వచ్చమైన తెలుపు వర్ణాల పూవులు
విరిసి పరిమళించు వేళ యిదియె
వాటి పరిమళాల వావిరి మత్తులో
తనిసి పుడమి యంత పెనయు టిపుడె

రమణి రాధికా ప్రేమవారాశి మునిగి
మాధవుడు యమునా నదీ మహిత సైక
త మహిని విహరించి యలరు సమయ మిదియె
ప్రేమ మయ మీ రజని , శుభవేళ  చాల .

2, నవంబర్ 2019, శనివారం

మాయురే ! .....మాయురే !  శిల్పి చేతుల మాయ గనుడు
కడు మనోఙ్ఞ మీ సృష్టి , ప్రాకటము గాగ
నిద్ర వోయెడి కన్నయ్య ముద్ర దాల్చె ,
సృష్టి కర్తను కన్న  ఈ   శ్రీహరి  తను .

1, నవంబర్ 2019, శుక్రవారం

మోడరన్ సరస్వతీ కైమోడ్పు

క్షణములో ఙ్ఞానాబ్ధి గడియించు నగణిత
వాట్సాప్ శారదా వందనములు
పలు పోకడలు వోవు భాషా సుభాకార
వర  ఫేసుబుక్ వాణి వందనములు
సారస్వతస్సర్వ సంగ్రామ రంగమా
బ్లాగుల భారతీ  వందనములు
విఙ్ఞాన భాండమై విలసిల్లు భగవతీ
వరలు ఈ బుక్ రూప  వందనములు

వ్రాయ పెన్నులు కాగితాల్  వనరు లేల
అక్షరాల్ కూర్చి వ్రాయంగ ననవసరము
టచ్చి స్క్రీనున నొత్తిన వచ్చు విథము
వరలు చదువుల తల్లికి వందవములు .

23, ఆగస్టు 2019, శుక్రవారం

కుల్లూరు సీమ ~ చరిత్ర

                       
కుల్లూరి సీమకు విజయనగరసామ్రాజ్యానికీ విడదీయరాని
సంబంధం ఉంది .శ్రీకృష్ణదేవరాయల హయాంనుండీ ఆరవీటి రాజుల హయాం వరకూ  ఈ సంబంధం కొనసాగింది . విజయనగర రాజులు పరిపాలనా సౌలభ్యం
కొఱకు  సామ్రాజ్యాన్ని కొన్ని రాజకీయ విభాగాలుగా మలచుకున్నారు . ' సీమ ' అనే విభాగం అందులో ఒకటి .
నెల్లూరు సీమ , ఆత్మకూరు సీమ , వెంకటగిరి సీమ , రాపూరు సీమ , కుల్లూరు సీమ  అనేవి మన ప్రాంతానికి
చెందిన ' సీమ ' విభాగాలు .
          విజయనగర సామ్రాజ్యాన్ని  ఏలిన  సంగమ సాలువ   వంశాల తదుపరి  తుళువ వంశం అధికారాన్ని
చేజిక్కించుకుంది . తుళువ నరసనాయకుడు  నాగలాంబల కుమారుడు శ్రీకృష్ణదేవరాయడు   తిమ్మరసయ్య తంత్రాంగంతో 1509 లో ఆగష్టు 8 న
శ్రీజయంతి పర్వదినాన విజయనగర సామ్రాజ్య పట్టాభి
షిక్తుడైనాడు . దిగ్విజయ యాత్రలు సాగించి , సామ్రాజ్యాన్ని బహుదా విస్తరించి , అవిఛ్ఛిన్నంగా 1529
వరకూ రాజ్యపాలన చేసాడు . ఉదయగిరి , కొండవీడు ,
కొండపల్లి , సంహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు .
ఉదయగిరి దుర్గాధిపతి తిరుమల రాహత్తరాయని ఓడించి ,  తన సేనాపతి  రాయసం కొండమరుసయ్యను
దుర్గాధిపతిగా నియమించాడు . దుర్గంలోని బాలకృష్ణ
విగ్రహాన్ని రాజధాని హంపికి తరలించి , కృష్ణాలయం
నిర్మించాడు .
           1512 లో ఉదయగిరి దుర్గాధిపతిగా నియమించబడ్డ కొండమరుసయ్య మహామంత్రి తిమ్మరు
సయ్య సమకాలికుడు , బంధువు , సేనానులలో ఒకడు .
          నాటి కుల్లూరు సీమలో నేటి కలువాయ , అనంతసాగరం  మండలాలూ , తెగచెర్ల వరకూ రాపూరు మండలంలో కొంతభాగం గ్రామాలు ఏలుబడిలో ఉండేవి .
ఈ ప్రాంతాలు నీటి యెద్దడితో పంటలు పండక కరువు కాటకాలతో సతమతమవుతూ ఉండుటను తెలుసుకుని
రాయలవారు సేద్యపరంగా చెఱువులు నిర్మించడానికీ ,
సైనికపరంగా వటిష్టం చేయడానికీ పూనుకుని , ఉదయగిరి
దుర్గంనుండి కుల్లూరుసీమకు అధిపతిగా నియమించి నాడు . కొండమరుసయ్య 1514 ~ 15 ప్రాంతంలో
కుల్లూరు పట్టణంలో మట్టికోటను నిర్మించి , కోటకు ప్రక్కనే
నల్లచెఱువును , శివాలయాన్నీ నిర్మించాడు . కోట చుట్టూ
శత్రు దుర్భేద్యంగా అగడ్తను ఏర్పరచినాడు . తంజనగరం నుండి గుఱ్ఱాలను కొని తెచ్చి , కోటలో ఆశ్విక దళాన్ని
ఏర్పాటు చేసి , కుల్లూరును సైనిక పట్టణంగా తీర్చిదిద్దినాడు .
            అరోజుల్లో , కుల్లూరు పట్టణం  యుధ్ధ విద్యలలో నిరంతర శిక్షణ శిబిరాలతో సందడిగా ఉండేది . కొండమరుసయ్య ఆధిపత్యంలోనే అనంతసాగరం , కలు
వాయ చెఱువులు కూడా నిర్మింప బడ్డవి .
            విజయనగర రాజుల హయాంలో  ఒక సంవత్సర
కాలం అంటే _ ఆశ్వజయ శుధ్ధ దశమి మొదలు మహర్ణవమి వరకు . ఈ సాంప్రదాయం కుల్లూరు పట్టణంలో కూడా ఉండేది . ఆశ్వజయ మాసారంభం నుండి మహర్ణవమి వరకూ తొమ్మిది రోజులు పట్టణంలోని సైనిక శిబిరాలలో యుధ్థవిన్యాసాల పోటీలు జరిగేవి .
గెలుపొందిన వీరులకు విజయదశమి రోజున బహుమతి
ప్రదానం జరిగేది . విజయదశమి నుండి జైత్రయాత్రలు
సాగించేవారు .
             చంద్రగిరి రాజధానిగా పాలించిన సాళువ నరసిం
హరాయల వద్ద కొలువు చేసిన ఆరవీటి తిమ్మరాజు రాజుగా విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీటి వంశం చేజిక్కించుకుంది . తిమ్మరాజు కొడుకు తిరుమలరాయ
లు . అతని కొడుకులలో వీర వెంకటపతి రాయలు చం
ద్రగిరి రాజధానిగా తమిళప్రాంతాన్ని 1612 వరకూ పాలించినాడు .
           వీర వేంకటపతి రాయలపై తమిళప్రాంతం లోని
పాండ్యులు తిరుగుబాటు చేసినారు . ఈ తిరుగుబాటును రాయల సామంతరాజు రేచర్లపద్మనాయక ప్రభువైన  రాజా వెలుగోటి వెంకటపతినాయనింగారు సమర్ధంగా
అణచివేసినారు . అందుకు బహుమానంగా వీరవేంకటపతిరాయలు నెల్లూరు ప్రాంతాన్ని అమరానకు
పాలించుకొనుటకిచ్చి , పంచపాండియధరావిభాళుం
డు , సంగ్రామపార్ధుండు , పద్మనాయక వంశాంభోది  చంద్రుండు అను బిరిదులతో నాయనింగారిని
సత్కరించినారు .
          నాయనింగారి ఏలుబడి లోకి కుల్లూరిసీమ కూడా
చేరింది . అటుపై రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని
కుల్లూరిసీమ కధిపతిగా నియమించుకొనిరి .
           విజయనగర రాజుల మార్గంలోనే  ,  వెలుగోటి
వెంకటపతి నాయనింగారు కుడా ప్రజోపయోగ కార్యాలలో
ప్రసిధ్ధి చెందిరి . అనేక చెరువులు వీరి హయాంలోనే మరమ్మత్తులకు నోచుకున్నవి . కుల్లూరుసీమలో భాగమైన
అనంతసాగరం చెఱువు గట్టు కేతామన్నేరు ఉరవడికి
ప్రతియేటా తెగి , నీళ్ళు ఊళ్ళను ముంచుతుండేవి .  వెంక
టవతి నాయనింగారు రుద్రప్పనాయనింగారిచే కట్టను పటిష్టపరచి , తూము నిర్మింపజేసి శాశ్వత పరిష్కారం
చూపినారు . అనంతరం కలువాయ చెఱువుకు అలుగు
నిర్మించినారు .
             1612లో రాజా వెలుగోటి వెంకటపతి నాయనిం
గారు  కుల్లురుసీమ అధివతి రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని తన కొలువుకు రావించి ,
సబహుమానంగా గౌరవించి ,  తన తండ్రి రాజా కుమార తిమ్మానాయనిగారికి పుణ్యం కలనగననట్లుగా కుల్లూరు
నల్ల చెఱువుకు తూర్పలుగు నిర్మించవలసందిగా కోరిరి .
వారికోరిక మేరకు రుద్రప్పనాయనింగారు ముప్పదిమూ
డు శిలాస్ధంభాలతో నల్లచెఱువుకు అలుగు నిర్మాణం
చేపట్టినారు . సాక్ష్యంగా ఇప్పటికీ మా చెఱువు గట్టున ఒక
శిలా శాసనం ఉంది .

15, ఆగస్టు 2019, గురువారం

నేనిచ్చిన నగదు పురస్కారాలుSSC 2019 మార్చి టాపర్స్ కు
నగదు పురస్కారాలు .
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ,
కుల్లూరు .

5, ఆగస్టు 2019, సోమవారం

మా అమ్మవారు .....

 1. రేగి రక్కసిపిండు రెక్కలు తెగగొట్టి
  కుత్తుకల్ మెలిద్రిప్పి కోయు చుండ
  కుడిచేత ఖడ్గంపు కొననుండి కారుచు
  నెత్తుటి ధారలు నెగడు చుండ
  డాచేత మూకుడు సాచి రౌద్రమ్ముగా
  రుధిరమ్ము వట్టి తా గ్రోలుచుండ
  ఆపలేక శివుం డడ్డదిడ్డము దూరి
  కాళ్ళ క్రిందుగ పడి కనలు చుండ

  దుర్నిరీక్ష్య తేజోమూర్తి దురితదూర
  దుర్గ మాయమ్మ కలదు ప్రాదుర్భవించి
  మమ్ము కాపాడు చున్న మా మాతృమూర్తి
  దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .
 2. భూమి తత్త్వాత్మిక పోలేరుతల్లికి
  పసుపు కుంకుమ గంధ ప్రతతు లిడుదు
  ఆకాశ తత్త్వాన నలరు మా యమ్మకు
  నలరుల దండల నలర నిడుదు
  వాయు తత్త్వాత్మికై వరలు మా తల్లికి
  అగరు ధూపముతోడ హారతిడుదు
  వహ్ని తత్త్వముతోడ వసియించు మాతకు
  దేదీప్య సందీప్త దీప మిడుదు

  అమృత తత్త్వాన వెలుగు మా అమ్మవార్కి
  ప్రీతి పొంగళ్లు నైవేద్య మిడుదు
  సర్వ తత్త్వాత్మికై వెల్గు సకలజనని
  కొనర తాంబూల తదితర ప్రణతు లిడుదు .

22, జులై 2019, సోమవారం

సంకల్పం రూపుదాల్చింది


ఈరోజునుండి ఇరవైమందికిపైగా అన్నంపెట్టే మహత్కార్యం ప్రారంభించాను .
ప్రతిదినం ఈమహత్కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని పెద్దలు , మిత్రులు ఆశీస్సులందించండి .

5, జులై 2019, శుక్రవారం

అన్నం పెట్టే మహత్ సంకల్పం

కుటుంబం లేదు ,
ఒంటరితనం ,
వయసుడిగింది ,
ఏ దిక్కూలేదు _
 ఇలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో కొందరుంటారు .
కేవలం అలాంటివాళ్ళకు 20 మందికి అన్నం పెట్టే పని సంకల్పించాను . పెద్దలు ఆశీర్వదించండి .

ప్రతిరోజూ పదిమందికి
సతతము భోజనము పెట్టు సత్కార్యమనే
వ్రత మాచరించ బూనితి ,
హితులాశీస్సుల నిడుడు , మహిత గతి సాగన్ .

దైవకార్యమేని ధర్మకార్యంబేని
చేయబూని నపుడు స్థిరము గాగ
పరుల యర్థమేని పరసేవలను గాని
తీసుకొనమి నాకు తృప్తి నిడును .

పొసగ నా కడ కడు వసతియున్నంతలో
పూని పనులు సేయ బోలుదు , మతి
మంతులైన హితుల మన్ననల్ , దీవెనల్
వలయు , నితర మేమి వలవ దనఘ !

14, జూన్ 2019, శుక్రవారం

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము


పరగ విశ్వ మనంతము , భ్రమణ రూప

చలన చాలన సంవృత్త శక్తి మయము

అందుగల కోట్ల గ్రహ తారకాది చయము

కడు నసంఖ్యాక మయ్యును కక్ష్య విడవు


                                                                           
తాను నివ సించు విశ్వమే , తనకు సుంత

యైన బోధ పడుట లేదు , తాను శక్తి

మంతు డెట్లగు? విశ్వనియంత కన్న

నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడుభార్య బిడ్డలు తాను ‘ – ఈమాత్ర మైన

చిన్న సంసార బాధ్యతే చేత గాని

మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని

విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,

పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు

బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన

తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?
ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు

దాతనే మరచు కృతఘ్నతా విధాన

భావనలు గల్గు మానవా! పతన మవకు

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

10, జూన్ 2019, సోమవారం

ఏది సత్యం ? ఏదసత్యం ?


ప్రియమైన విద్యార్థులారా !

సైన్సులో మీకు ‘ సూర్యుడు – శక్తి ‘ పాఠం ఉంది కదా ! మీ సైన్సు టీచరు సూర్య గోళాన్ని గురించి ఏమి చెబుతాడు ? వాయువుల తో మండే గోళమని కదా ! మరి తెలుగు పాఠాన్ని బోధిస్తూ మీ తెలుగు టీచర్ ఏమి చెబుతాడుసూర్యనారాయణుడనీ , దేవుడనీ కదా !

అంటే మీ పాఠశాలలో ఒకే అంశానికి రెండు విరుధ్ధ భావనలు బోధించి మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తున్నారన్నమాట ! ఇందులో ఏది నిజమో పరిశీలించండి . శాస్త్రీయంగా నిరూపింప బడేదే సత్యం . శాస్త్రీయంగా నిరూపించ లేనిది అసత్యమే కదా మరి ! పాఠశాలలో అసత్యాలు బోధించడం సముచితమేనా ?

సూర్యుడు కేవలం వాయువులతో నిండి నిరంతరం మండే వాయుగోళం . ఇది శాస్త్రీయంగా నిరూపించ బడింది. ఇది సత్యం . సూర్యున్ని భగవంతుడుగా చిత్రీకరించే కథలన్నీ అసత్యాలు..... 

--- ఇలా అనర్గళంగా సాగిపోతూ ఉంది ఆనాటి పాఠశాల సమావేశంలో ఒక మేథావి ఉపన్యాసం .ఆ మేథావి ఆనాటి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసిన విశిష్ట ఉపన్యాసకులు . మీదు మిక్కిలి హేతువాది . సదరు ఉపన్యాసకులు మంచి స్ఫురద్రూపి . మంచి వాగ్ధాటితో ,చతురోక్తులతో విద్యార్థులను ఆకట్టుకొని మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు .

ఇంతలో ఆపాఠశాల తెలుగు టీచర్ వేదిక మీదకు వచ్చి , తనకూ సదరు అంశం మీద మాటాడ్డానికి అవకాశం ఇవ్వవలసినదిగా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్మాష్టరు గారిని కోరినాడు .

ప్రధానోపాధ్యాయుని సంశయాన్ని గమనించిన హేతువాది తన ఉపన్యాసాన్ని అర్థాంతరంగా ఆపి , తెలుగు టీచర్ను మాటాడ వలసినదిగా కోరినాడు . సమావేశ వేదిక కాస్తా చర్చావేదికగా మారింది .

వేదిక మీదకు వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల లో కొంత మందిని లేపి వారి తల్లి దండ్రుల పేర్లు చెప్పవలసినదిగా కోరినాడు . వారు చెప్పినారు. మీరు మీ తల్లిదండ్రులను ఏమని పిలుస్తారు? “ టీచరు ప్రశ్న

అమ్మా – అనీ , నానా – అనీ  పిల్లల సమాధానం

“ పేర్లతో పిలవరా ?  టీచరు

“ తప్పుకదండీ ! “ పిల్లలు

ప్రియమైన విద్యార్థులారా! తల్లిదండ్రుల మీదా , గురువుల మీదా , పెద్దల మీదా మనకుండే గౌరవం వల్ల మనం వాళ్లను పేర్లతో సంబోధించడం తప్పుగా భావిస్తున్నాము .

సూర్యుడు మండే గోళం మాత్రమే కాదు . సూర్యుడు భూమిమీది సర్వజీవ రాశికీ శక్తి ప్రదాత . సూర్యగోళం నుండి వెలువడే అనంతమైన శక్తి వల్లనే ఈ భూమిమీది సర్వ జీవ రాశీ మనుగడ సాగిస్తోంది . సూర్యకిరణాలు భూమికి చేరని నాడు భూమిపై జీవరాశి నశిస్తుంది . ఇది కూడా శాస్త్రీయ మైన అంశమే .

మన మనుగడ కు నిరంతరం శక్తిని ప్రసాదించే సూర్యుణ్ణి గౌరవించి , దైవంగా భావించి ఆరాధించడం ఎంత మాత్రమూ తప్పు కాదు . మానవ జాతి మనుగడకు దోహద కారులైన ఏ అంశాలనైనా గౌరవించి దైవంగా భావించి, ఆరాధించడం అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతీ –సంప్రదాయాల లో ఉన్న గొప్పదనం .భారతీయ సంస్కృతి మానవజాతి ఉన్నతికి ప్రతీక .

ఇలాగే నేల . నేలంటే మన్నేకదా !  నేలే మనకు ఆధారం . ఇందులోనే మనం ఆహారాన్ని పండించు కొంటున్నాం . అందరికీ అన్నం పెట్టే నేలను తల్లీ అనడం తప్పా? అనక పోవడం తప్పా ?

నీరు , గాలి . ప్రకృతి – ఇలా మన మనుగడకు ప్రత్యక్షంగా గానీ , పరోక్షంగా గానీ దోహదకారులయ్యే ప్రతి అంశాన్నీ విథిగా గౌరవించాలి .

అందుకే సూర్యణ్ణి సూర్యభగవానుడనీ , నేలను నేలతల్లిగా , ప్రకృతిని ప్రకృతి మాతగా మనం గౌరవించడం –ఆరాధించడం నేర్చుకున్నాము . గౌరవించక పోవడం తప్పు . ఆరాధించక పోవడం నేరం . అనాదిగా మనకు సంక్రమించిన ఈ సంప్రదాయాన్ని వదులుకోవద్దు .  అని ముగించినాడు . కరతాళ ధ్వనులతో సమావేశ మందిరం మారు మ్రోగింది . పాపం హేతువాది ముఖం చూడాలి మరి !

4, జూన్ 2019, మంగళవారం

ఇచ్చోట సర్వఙ్ఞు లెవరు ?

పిడివాదమను రోగ పీడితుల్ కొందరు
సహనమ్ము కోల్పోయి సంచరింత్రు
జ్వలిత హింసానంద సైకోలు కొందరు
అఙ్ఞాన దుగ్ధతో యరచు చుంద్రు
పాండిత్య బురదలో పడి దొర్లు కొందరు
తప్పులెంచుటె తమ గొప్ప యంద్రు
చెత్త రాతల కొంగుశ్రీల భూషించుచు
కొందరు పరవశంబందు చుంద్రు

కూటముల్ గట్టి కొందరు కూడి మాడి
పూని తమలోన తారు మెప్పులు వహింత్రు
సంయమనము పాటించరు చాల మంది
తెలుగు బ్లాగుల బుధజన తీరు దెలియ .

అన్నియును తమకె తెలియునన్న యహమె ,
యతిశయమె మూలమింతకు _ స్వాతి శయము
వీడి , యితరులు చెప్పేది కూడ వినుటె
విఙ్ఞత కద ! , యిచ్చోట సర్వఙ్ఞు లెవరు ?

2, జూన్ 2019, ఆదివారం

వైద్యో నారాయణో " హరీ " !


        గురువునూ , వైద్యుణ్ణీ దైవంగా భావించే కర్మభూమి మనది . వైద్యో నారాయణో హరి :   అని కదా ఆర్యోక్తి . అందువల్ల డాక్టర్లందరికీ పాదాభి వందనాలు .

          పూర్వం విద్యా- వైద్యం రెండూ సామాజిక అత్యావశ్యకాలుగా గుర్తించి సంస్థలూ , దాతలూ , ప్రభువులూ ఉదారంగా అవసరమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసి ఉచితంగా అందించేవారు . నేడు మన కర్మ కొద్దీ మనచేత ఎన్నుకొన్న మన ప్రజా ప్రభుత్వాలు మాత్రం విద్యనూ , వైద్యాన్నీ వ్యాపార వస్తువులుగా మార్చి ఖరీదయిన అవసరాలుగా చేశారు .

           ఇక అసలు విషయాని కొస్తే -----

నాకు చాలా రోజులుగా ఎడమవైపున కడుపులో మంటగా ఉంటుండేది . ఒకటి రెండు సార్లు డాక్టర్లు ఎండోస్కోప్ చేయించి అల్సర్లేవీ లేవన్నారు . ఒక డాక్టరు మాత్రం ఎండోస్కోప్ లో కనిపించక పోయినా పెప్టిక్ అల్సర్ ఉంది

మీకు అని ఒక కోర్సు మందులు రాయడం , వాడడం , ఉపశమించడం జరిగింది .

            మళ్ళీ ఈమధ్య కని పించే సరికి  - హైదరాబాదులో ఉన్నాంకదా అని – మహానగరంలో పేరొందిన

ఏకైక పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో చూపించి బాధనుండి పూర్తిగా విముక్తి పొందాలని ఆశ పడ్డాను .

            ఖాళీ కడుపుతో ఒకరోజు ఉదయాన్నే ఆరింటికి హాస్పిటల్ చేరుకున్నాను . అప్పటికే రిజిష్ట్రేషన్ కౌంటర్

వద్ద చాలా మంది గుమి గూడి ఉన్నారు . ఫీజు చెల్లించి నేనూ రిజిష్టర్ చేయించు కున్నాను . హాల్లో వెయిట్ చేయమన్నారు . తొమ్మిది కావస్తోంది . హాస్పిటలంతా హడావిడి మొదులైంది . సందర్శకులతో , సిబ్బందితో క్రిక్కిరిసి

సికిందరాబాదు రైల్వే ష్టేషన్ లా కనువిందు చేస్తోంది .

           ఈలోగా హాల్లో ఉన్న మైక్ లోంచి చెకింగ్ బ్లాకు లోకి ఆహ్వానిస్తూ కొన్నిపేర్లు ఎనౌన్స్ చేశారు . నాపేరు కూడా ఉండడం గమనించి వెళ్ళాను . ఒక్కో చిన్న చిన్న కేబిన్ లోకి ఒక్కొక్కర్ని పంపించారు . చెకప్ డాక్టర్ రావడంతో

నేను నా గోడు వెళ్ళబోసుకోవడం మొదలెట్టాను . ఆయన విటున్నాడో లేదో నాకయితే అర్థం కాలేదు . చిట్టీ మీద

రాసుకుంటూ పోతున్నాడు . అంతా ఒక్కనిమిషంలో అయిపోయింది . ఆ చీటీ నాకిచ్చి క్యాష్ కౌంటర్ కెళ్లమన్నాడు .

            కౌంటర్లో బిల్ వేసి రు.7900 – కట్టమన్నారు . నేనంత పైకం తీసుకెళ్ళ లేదు . కార్డుంది . తీసిచ్చాను .

పైకం జమ చేసుకుని , ఎండోస్కోపీ యూనిట్ కెళ్ళమన్నారు . ఎండోస్కోపీ తదుపరి , బ్లడ్ శాంపిల్ యూనిట్ ,

అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు దాటింది . ఇంకా కొలనో స్కోప్ మిగిలే ఉంది . అప్పటి వరకూ

ఏమీ తిన లేదు , తాగలేదు . ఖాళీ కడుపే . ఓరి దేవుడా ఏమిటీ ఖర్మ అనుకుంటూ కొలనోస్కోప్ కోసం విచారించాను .

             హాస్పిటల్ మందుల షాపు చూపించి కొలనోస్కోప్ కిట్ కొని తెమ్మన్నారు . మంచినీళ్లు లీటర్ బాటిళ్ళు

రెండు కొనమన్నారు . కిట్ లోని టాబ్లెట్ మింగించినారు . ఒక్కొ లీటర్ లో రెండు పొట్లాల పౌడర్ కలిపి అరగంటకోసారి

తాగమన్నారు . అరగంట తర్వాత మోషన్స్ మొదులౌతాయి . పది పన్నెడు సార్లు మోషన్స్ తరువాత రండి . సెకండ్ ఫ్లోర్ లో కెళ్లండి . అంతా అర్థమౌతుంది . సాయంత్రం ఐదు తర్వాత కిందికి రండి అన్నారు .

            అన్నీ సిధ్ధం చేసుకుని సెకండ్ ఫ్లోర్ చేరే సరికి మిత్రులు ఆడా మగా చాలా మందే ఉన్నారు . నేనూ వారితో చేరి నరకంలో విహరించాల్సి వచ్చింది ఐదు వరకూ .

            కొలనో స్కోపీ యూనిట్ లోకి వెళ్లి టెస్ట్ పూర్తి చేసుకుని బయట పడే టప్పటికి ఏడయ్యింది .

రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకునే సరికి ఎనిమిదయ్యింది . అన్నీ నార్మల్ రిపోర్ట్స్ .

            పది పన్నెండు మందిని ఒక్కో డాక్టర్ కేబిన్ కు తీసుకెళ్ళారు . డాక్టర్ సహాయకుడు మాఫైళ్ళు

తీసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఒక్కొక్కర్నీ డాక్టర్ వద్దకు పంపిస్తున్నాడు .

            నేను వెళ్ళే సరికి డాక్టర్ ఫోనులో మాట్లాడు తున్నాడు . నేను వెళ్ళి నిలబడ్డా . ఉలుకూ పలుకూ లేదు .

నిలబడే ఓపికలేదు . వయసా అరవై మూడు . రోజంతా ఉపవాసం . పైగా కొలనోస్కోప్ ప్రిపరేషన్ కోసం పది పన్నెండు సార్లు .......

            ఫోను సంభాషణ పూర్తయినట్లుంది . ఫైలందుకుని డాక్టర్ ఏదో రాస్తున్నట్లనిపించి , నేను నాగోడు

వెళ్ళబోసుకుంటున్నాను . వింటున్నట్లు లేదు . విన్నట్లు లేదని మళ్ళా మొదలెట్టేను . మందులు రాశాను కదా  అన్నాడు , ఇక వెళ్లమన్నట్లు చూచి . బెల్ కొట్టేడు , ఇంకొకర్ని పంపమని .

           తీరా ఏమి రాశాడా అని చూస్తే , పది మందుల పేర్లు టైప్ చేసిన ఒక స్లిప్ నా ఫైల్లో అంటించి ఉంది .

పేర్లకు ముందున్న బాక్స్ లలో ఈయన గారు సింపుల్ గా టిక్కులు కొట్టేడు . నాకేమనిపించిందంటే అసిస్టెంట్

మందుల స్లిప్పంటించడం , డాక్టర్ టిక్కులు కొట్టడం తప్ప వీళ్లకే అధికారాలూ లేవేమో అని .

           అంటే ఈ పేరు మోసిన హాస్పిటల్లోకి అడుగిడితే మనంచెప్పేది అస్సలు వినరు . అక్కడున్న దాదాపు

అన్ని టెస్టులూ వాయించేస్తారు . మందుల చీటీలు ముందే అంటించి మందులు అమ్మేసుకుంటారన్నమాట .

           ఏమిటో అంతా మాయాజాలం . మరి రోగం కుదిరిందా అంటే , కుదిరితే ఈ సోదంతా ఎందుకూ .

జాలంలో చిక్కుకుంటే గాని తత్త్వం బోధపడదు కదా !

                          వైద్యో నారాయణో ‘ హరీ ‘   -  అని సరిపుచ్చుకుందాం . 

28, మే 2019, మంగళవారం

ఆంధ్రా జనా స్సుఖినో భవంతు


విభజించి ఆంధ్రకు  విద్రోహ మొనరించి
ఘనశత్రువై నిల్చె కాంగిరేసు ,
విభజన తోడుగా విద్రోహ మొహరించి
తదుపరి బీజేపి తాను నిలిచె ,
పాలనా రతుడని  బాబు నెంపిక చేయ
సొంత మనుజుల చేత చింతదీర్చె ,
రాజధానీ లేదు  ప్రజల బాగూ లేదు
నాయకుల్ దోపిడీ చేయ బట్టి ,

మొదటి శత్రువు కాంగ్రెసు , మది దలంప
రెండు బీజేపి , మూడు సారించి చూడ
తెలుగు దేశము శత్రువుల్ , తెలియ నొకటి
మించి యింకోటి ,  మన పుట్టి ముంచినారు .

అతి సమర్థుడనుచు మితిమీరి వోట్లేసి
ముఖ్యమంత్రి జేయ ముదురు గనక
రాజధాని యనుచు రంగులు చూపించె
బైర్లు క్రమ్మె తెలుగు ప్రజకు కళ్ళు .

జిమ్మిక్కుల కోట్లు పడవు
తిమ్మిని బమ్మినిగ జేయు ధిషణుల నికపై
నమ్మరు జను , లెవరు తమకు
కమ్మని పాలన నొసగిన , గణుతింత్రు సదా .

వైసీపీ పాలనలో
వాసింగనుగాక ! ఆంధ్ర , వరణీయంబై ,
మోసాలకు , వేషాలకు ,
కాసుల దందాకు తొలగుగాక ! వినుతమై .

21, మే 2019, మంగళవారం

వట్టిమాటలు కట్టిపెట్టోయ్ .....

నేను మా కుల్లూరు పోలేరు తల్లి ఆలయప్రాంగణంలో నాటి పెంచుతున్న
అనేక ఫలవృక్షాలలో కాపుకొచ్చిన జామఫలాలు .
స్ఫూర్తి : వట్టిమాటలు కట్టి పెట్టోయ్
             గట్టిమేల్ తలపెట్టవోయ్ .....