సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

3, జులై 2012, మంగళవారం

గురు పూర్ణిమ సందర్భంగా - శ్రీసాయినాధుని ఏకాదశ సూత్రాలు


శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము

సర్వ దు:ఖ హరము సర్వ శుభము

నీదు దర్శనమ్ము నిత్య కళ్యాణమ్ము

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


 తనర నెవరి కైన ద్వారకా మాయిని

జేరి నంత శాంతి చేరు వగును

అరయ నార్తు డైన నిరుపేద కైనను

శ్రీని వాస సాయి !శిరిడ రాజ !పరమ పురుష ! నీవు భౌతిక దేహమ్ము

వీడి వర సమాధి కూడి ఉన్న

నాడు సైత మవని నప్రమత్తుండవే

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


నీదు భక్త జనుల నిత్య రక్షణ భార

మొనసి వర సమాధి ముఖమునుండె

మోయు చుంటి వెంత మోదమ్ము రా నీకు

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !


శ్రీ సమాధి జేరి చేయెత్తి పిలిచిన

పలికి మాటలాడు ప్రభుడ వీవు

శ్రీ సమాధినుండి చేయెత్తి దీవించు

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


 నిన్నాశ్ర యించు వారిని

పన్నుగ నిను శరణు జొచ్చు భక్తజనుల నా

పన్నుడి వై రక్షించు ట

నెన్నగ నీ బాధ్యత యని యెంతువు సాయీ !


 నీయందు దృష్టి నిలుపుచు

పాయక నినుకొలుచు నట్టి భక్త జనుల పై

శ్రీయుత నీకటాక్ష శ్రీ ల

మేయము గా బరపుచుందు మేలుర సాయీ !


సత్య మెరుగ లేక సంసార బంధాల

జిక్కి బాధలొందు జీవజనుల

బరువు మోయ నీవు ప్ర త్య క్ష మౌదువు

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


ఎవరు గాని నిన్ను నెద నిండ భావించి

నీసహాయము కొర కాస పడిన

తక్షణాన నీవు తగ నాదు కొందువు

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

 శ్రీ భాగ్య నిధులు గూడుచు

నీ భక్తుల గృహములెల్ల నిండారును నీ

యే భక్తుని గృహ మైనను

శోభనమే లేమి చొరదు శుభకర సాయీ !సర్వ కార్య ధర్మ నిర్వహణ లన్నియు

శ్రీసమాధినుండె జేతు ననుచు

మాట ఇచ్చి మమ్ము మన్నించినావురా

శ్రీ నివాస సాయి ! శిరిడి రాజ !


6 వ్యాఖ్యలు:

 1. ఓం సాయి రాం.
  సాయిబాబ అందరినీ ఎప్పుడూ చల్లగానే చూస్తారు.ఆయన మహిమలు అనిర్వచనీయం.
  సాయీ అంటే ఒయీ అని పలికే ఒకే ఒక్క దైవం.
  ఇవి పంచుకున్నందుకు బోలేడు ధన్యవాదాలండీ..!!
  గురుపౌర్ణమి శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నడుస్తున్న కాలంలో పిలిస్తే పలికే దైవంగా , గురువుగా కీర్తింప బడుచున్న శిరిడీ సాయినాధుడు బోధించిన ఏకాదశ సూత్రాలు నివేదన పద్యరూపంగా వ్రాసిన టపాకు సభక్తికంగా స్పందించి నందుకు ధన్యవాదములు సీతగారూ ,
  గురుపౌర్ణమి శుభాకాంక్షలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాజారావు గారూ!
  చాలా బాగున్నాయి పద్య సౌరభాలు...
  ఆలస్యమైనా...
  గురుతుల్యులైన మీకు గురుపూర్ణిమ శుభాభినందనలు....
  మీ ఆశీస్సులు కోరుతూ...
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్రీనివాస్ గారూ ,
  సంతోషం . సదా శ్రీ సాయి నాధుని ఆశీస్సులు . ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శ్రీనివాస సాయి అని ఎందుకు అంటారండి? చెప్పగలరా?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. జలతారు వెన్నెల గారూ ,
  ఇందులో ప్రత్యేకించి ఏమీ లేదండి . మా యిల వేల్పు శ్రీనివాసుడు . సాయిబాబా బోధనలు , ప్రేమతత్త్వం . జీవనవిధానం - అంటే చాలా యిష్టం . నేను వ్రాసి ప్రచురించిన 'శ్రీనివాస సాయి! శిరిడి రాజ !'అనే నివేదన రూప శతకం లోని వీ పద్యాలు . శతకం లోని ప్రతి పద్యం చివరిపాదాన్ని మకుటం అంటారు . మకుటంలో రచయిత తన పేరును కూడా ఒక ముద్రగా సూచిస్తాడు . అన్నీ కలగలపి సదరు శతకంలో మకుటంగా' శ్రీనివాస సాయి !శిరిడి రాజ ! 'అని పేర్కొనడం జరిగింది . ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు