సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, జనవరి 2014, సోమవారం

ఏది సంక్రాంతి ? పల్లెల నెచట కలదు ?



కదలి రావమ్మ! మకర సంక్రమణ లక్ష్మి! 
నేల తల్లి నోదార్చి కన్నీరు తుడువ
చూడ రావమ్మ పుట్టింటి వాడ వాడ
గోడు గోడున నేడ్చు మా గోడు వినగ 


ఎట్టు లెటులో పంట పండించి , నూర్చు
పట్టున - నురిమి వానలు వరద లగుచు
నోటికాడి కూడు నెగదన్ను కొని పోవ
నేది సంక్రాంతి ? పల్లెల నెచట కలదు ?

 
పల్లె వీడి ప్రజలు బ్రతుకు భారము మ్రోయ
పట్టణాల బాట పట్టిరి, మరి
పల్లె పట్లు వీడి బయలెల్లె సంక్రాంతి
వచ్చి చూడు నీదు వైభవమ్ము

 
పిలిచి పిలిచి పెట్టు పిండి వంటల యూసు
లేవి? యెటకు బోయె నీవి గుణము ?
ఆకసమ్ము నెక్కె నవనికి దిగి రావు 
ధరలు ,  తమకు లేని ధర్మ మేల ?

 
గంగి రెడ్లు లేవు , పొంగళ్ళ పస లేదు
చెంగట హరిదాసు చిందు లేదు
సాంప్ర దాయ కవుల జాడ్యమందున దప్ప
సంకు రాత్రి చిన్నె సడులు లేవు .

 
పిలుపు లేకనె పెద్దలు , పేరటాండ్రు
అదిగొ వచ్చిరి యవనికి ,  నిదిగొ! మీకు
ఆశ దీరదు, మీబిడ్డ లరువు లంది
కరవు దీర బెట్టంగలే  రరుగు డింక