సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, మే 2015, ఆదివారం

అమ్మా , నీవీబిడ్డలకు బరువిప్పుడు !?


                కూతురికి అమ్మంటే ఇష్టం . కొడుక్కీ అమ్మంటే ఇష్టమే .

                కొడలికీ అమ్మంటే ఇష్టం . అత్తమ్మంటేనే అయిష్టం . 

                అత్తమ్మకూ కూతురంటేనే ఇష్టం .  కోడలంటేనే కష్టం .

                కొడుక్కి అమ్మంటే ఇష్టమే . ఐనా తనిష్టం ఇక్కడ మార్చుకొంటాడు .

                అల్లుడికీ అమ్మంటే ఇష్టమే . కానీ తనిష్టాన్ని ఏమార్చుకొంటాడు .

                లోపమెక్కడుందో అమ్మకీ తెలుసు , అమ్మలైన కూతుర్లకీ , కోడళ్ల కీ తెలుసు . అందరికీ తెలుసు .

                ఐనా చదరంగం ఆగడం లేదు .

                అందుకే అమ్మ తనింట్లోనే పనిమనిషిగా మారి పోయింది .  

  

    ఆహా ఈరోజు ఎంత సుదినం !  అంతర్జాతీయ మాతృపూజాదినోత్సవం .అమ్మప్రేమను పొగిడి పొగిడి  అలిసి పోయిన దినం . అమ్మప్రేమనంతా కళ్లకద్దుకొని కలాల్లోనూ , గళాల్లోనూ జార్చుకొని  , పేర్చుకొని  - టీవీ చానల్లూ , పేపర్లూ , బ్లాగుల నిండా చేర్చుకొని

అమ్మనూ , అమ్మప్రేమనూ ఆకాశాని కెత్తేశాం .అమ్మతనం  అజరామరమై అలరారుతోంది . ఇంకేం కావాలి అమ్మకు  ?



                అమ్మలందరూ యశోదమ్మలే . ప్రతి అమ్మకూ తన బిడ్డడు బంగారమే . బిడ్డల పొరపాట్లు నిరంతరం సమర్థిస్తూనే  ఉంటుంది అమ్మప్రేమ . తన బిడ్డ అమాయకుడనీ , ఇతరులు చెడగొడుతున్నారనీ ఆమె భావన . బిడ్డల చేత అతి సులభంగా మోసగించబడే ఈ అభాగ్యజీవిని - అదే – అమ్మ ను  బిడ్డలు అవలీలగా నమ్మించేస్తుంటారు .                



                ఫాపం ! అమ్మ !

                కొడుక్కూ , కోడలికీ , వాళ్ల పిల్లలకీ – ఊడిగం చేసే అమ్మ .

                తిట్లతో పాటు వాళ్లు పడేసే పట్టెడన్నంకోసం బ్రతుకీడుస్తోంది అమ్మ .

                ఒక్కడే కొడు కైతే   చావో రేవో వాడింట్లోనే .

                నలుగురైతే! ఆ యమ్మకు అగచాట్లే .

                ఆస్తి పంచుకున్నట్లు అమ్మనూ భాగాలేసుకొంటారు

                పట్టెడన్నం కోసం నలుగురింటా చాకిరీ తప్పదు .

                 

       కని పెంచిన  బిడ్డల కోసం అష్టకష్టాలు పడిన అమ్మకు ప్రతిఫలం ? మలిసంధ్య మనుగడ దుర్భరం .