సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

4, డిసెంబర్ 2015, శుక్రవారం

ఓరిమి లేదు కాస్తయిన .....

ఓరిమి లేదు కాస్తయిన  ,  ఒఠ్ఠి యహంకృత వాక్స్రవంతిలో
తీరిక లేదు వేరొకరు తెల్పిన దేమొ వినంగ  ,  విన్ననూ
వారిది యెంతమాత్రమును వాదన కెక్కదు ,  తామె యింతకున్
నేరిచినట్టి వారమను నిక్కు _ కనంగ వివేకులందరున్ .

బుధ్ధిమయ సాహితీ లోక మిద్ది , కాని
వెకిలి బుధ్ధుల వికృత వివేకములకు
బుధ్ధి మాలినదయపోయె ,  యొద్దిక కొర
వడిన దీతెల్గు బ్లాగు ప్రపంచమిపుడు .

చిన్న ' అప్రిషియేషను ' చేర్చి , తగిన
వ్యాఖ్య రాయుట మంచిదా ? పాండితీ ప్ర
కర్ష చూపించు నట్లు వ్యాఖ్యలను పెట్టి
పరిహసించుట మంచిదా పండితులకు ?

ప్రాత  _ లో  దురాచారాల బాట వదిలి
క్రొత్త విజ్ఞాన రోచిస్సు కూర్చి పేర్చి
మానవత్వ  విలువలే ప్రమాణములుగ
వైరములు వీడి  రచనలు వరలు గాత

2, డిసెంబర్ 2015, బుధవారం

ఎవడురా మేథావి ? .....




ఎవడురా మేథావి ?  భువన మోహను గూడ
తనదు మోసానికి తార్చు వాడ ?
ఎవడురా మేథావి ?  తవిలి జ్యోతిష్యాది
దుర్మార్గ విద్యల దొర్లు వాడ  ?
ఎవడురా మేథావి ? ఏకష్టమెరుగక
పరుల కష్టము మీద బ్రతుకు వాడ  ?
ఎవడురా మేథావి ?  ఇల మనుజుల మధ్య
కుల భేదములు జూపు కుటిల తముడ  ?


కాదు..... తిండి బట్టలు , సౌఖ్యాలు  భువికి
నిచ్చు కొరకు  తర తరాలు నిచ్చలు శ్రమ
జీవియై వెల్గు వాడె మేథావి  _  ఎవడి
' బుధ్ధి ' దుర్మార్గ పథమున పోదొ వాడు .












29, నవంబర్ 2015, ఆదివారం

వెక్కిరింతలు కొన్ని వెటకారములు కొన్ని .....

వెక్కిరింతలు కొన్ని వెటకారములు కొన్ని
పేర్చి నోటి దురద తీర్చు వారు
వదరు కూతలు కొన్ని వాచాలతలు కొన్ని
వార్చి  అహంభావ మేర్చు వారు
కించ పరుచ కొన్ని  కించ పడగ కొన్ని
తలకెత్తుకొని మోసి తనియు వారు
పాండిత్యములు కొన్ని  పరిహాసములు కొన్ని
కవ్వించి వెకిలిగా నవ్వు వారు

ప్రాత సంప్రదాయపు వర్గ పండితులును
క్రొత్త విజ్ఞానమయ వర్గ కోవిదులును
లంకె కుదరక తిట్ల పురాణములకు
దిగుట యిదియేమి కర్మరా తెలుగువాడ .