సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, ఆగస్టు 2016, శనివారం

నీరే ప్రాణాధారము .....

నీరే ప్రాణాధారము
నీరేజ భవుండు గాని  , నిర్జరులైనన్
నీరొదవెడు పుడమి విడిచి
వేరొక దెస కేగరు గద!  విను వీధులలో  .

వారి కంటె మనము  పరి పరి విథముల
పుణ్య తముల  మిచట బుట్టి నాము  ,
పుణ్య నదుల నీళ్లు  పోషించు భాగ్యాలు
బడసి నాము  ,  ముక్తి బడసినాము  .

నేల మీద దప్ప  నిర్మల జలరాశి
లేదు  చూడ  విశ్వ వీధు లరసి  ,
నీరు గలుగు నేల  నిజమైన స్వర్గమ్ము
ప్రాణికోటి కిదియె  భాగ్య సీమ  .

బీడు భూమి నైన  చౌడు భూముల నైన
నదుల నీళ్లు పారి నందు వల్ల
సస్య శ్యామల మయి చక్కగా పంటలు
పండి  జీవకోటి  తిండి నొసగు  .

పుష్కరాల వేళ  పుణ్యాహ వచనాలు
పలుక వచ్చు  పూజ లొలుక వచ్చు
మునుగ వచ్చు  గాని  మూర్ఖత్వ మొలికించి
మురికి సేయ రాదు  , ముక్తి రాదు  .

తినుటకు త్రాగుట కీనీ
రనుదిన మమృతమ్ము  మనకు ప్రాణ ప్రదముల్
విను  !  స్వఛ్ఛత పాటించిన
ఘనముగ కృష్ణమ్మ పూజ గావించుటయే  .

11, ఆగస్టు 2016, గురువారం

కూతురే తల్లి దండ్రుల కొంగు పసిడి

పుట్టి పుట్టంగనే పుణ్యాల ప్రోవయి
        కన్న వారికి గూర్చు కామ్యఫలము
బుడి బుడి నడకల బుజ్జాయి నవ్వులు
         నట్టింట ముత్యాల నగలు పేర్చు
పరికిణీ గట్టిన పాపాయి సొబగులు
           మురిపాల ముద్దులు మూట గట్టు
పెళ్ళీడు దరిసిన ప్రియ తనయ దిరుగు
            నాయింట లక్ష్మీ విహార మొనరు

ఘనులు కడుపార కూతురిన్ గన్న వారు
తల్లి దండ్రులు తనివార తమకు దాము
మురియు ననుభూతు లేమని బొగడ వచ్చు !
ఆడ పిల్లయే ఇంటికి అమృత ఫలము .

పండుగల నాడు కన్నుల పండు వగుచు
ఆడి పాడుచు దిరుగాడు ఆడ పిల్ల
ల కళ ఆయింటి నిండ వరాలు గురియు
కూతురే తల్లి దండ్రుల కొంగు పసిడి  .

అమ్మాయి నాన్న కూచీ ,
అమ్మకు గడు తోడు నీడ , అన్నయ్యకు ప్రా
ణ మ్మపురూప మ్మీ బం
ధమ్ములు గద ! ఆడ పిల్ల తనరిన యింటన్ .