సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, ఏప్రిల్ 2017, ఆదివారం

వెంకయ్య స్వామి శతకం -- 5

కోరి శిష్యు డయ్యె నారాయణ స్వామి
నీదు తోడు దిరిగి నీడ యగుచు
ఘనత దాల్చె నీవు కరుణించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .  -- 31

చనవు మీర  నిన్ను చలమయ్య నాయుడు
కొలిచి నిలిచినాడు కూడి మాడి
అతడిదే యదృష్ట మన నొప్పు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 32

దయకు పాత్రు డయ్యె జయరామ రాజు తా
వచ్చి నీదు తోడ వాస మందు
వరము బొంది నాడు , వరదుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 33

రోజు కూలి యర్థ రూపాయి కొరగాని
కఱ్ఱి దేవుడయ్య ఘనత గాంచె
నీ కటాక్ష సిధ్ధి యే కదా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 34

పిలుపు వచ్చి రాగ  వెంటనే పెద్దయ్య
చేరి నీతొ దిరుగు చేరువయ్యె
నింత పుణ్య ఫలము సొంతమై , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 35

వెలయ చివర దాక  తులశమ్మ నిను గొల్చి
పుణ్య ఫలము బొందె  ,  ఫూజనీయ
సుకృత ఫలిత మిదియె ,  సులభుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 36

నీకు  సహచరించి నిన్గొల్చి తిరిగిరి
యెంద రెందరొ జను లంద రెంత
పూర్వ జన్మ లందు పుణ్యులో ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 37

తండ్రి పెంచలయ్య  తల్లియై పిచ్చమ్మ
కన్న కడుపు లెన్ని పున్నెములకు
ప్రోవులైరొ కొలువ బోలునా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 38

నతులు నిన్ను గన్న నాగులేటూరుకు
ధన్య యయ్యె తాను ధరణి తల్లి
తల్లి పేరు నిలిచె స్థాయిగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 39

నీవు పాద మిడిన నేలలు , నీళ్లును
కొండ లడవు లున్ను కోన లున్ను
పావన మయి యొప్పు , భగవాను వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 40

2 వ్యాఖ్యలు: 1. వలయునా స్వామి తిరుపతి వలెను గొలగ
  మూరు ! కొండదేవర తాను మూగ బోవ
  కోరికల దీర్చుగొనుచుండె కొంకిగాను
  బేర సారము లాడెడు బింకు బంట్లు !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మలగ మొగమంత నిండు నామాలు బెట్టి
  చూడనీయరు శ్రీనివాసుని తిరముగ ,
  గొలగ మూడిలో స్వామి కీ కొదువ లేదు
  తాట తీయును వేషాలు తనకు పడవు .

  ప్రత్యుత్తరంతొలగించు