సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, జూన్ 2017, గురువారం

మనోఙ్ఞమైన పద్యం

మనోఙ్ఞమైన సీసపద్యము
-------------------------------
అవగాహనేహా సమాయత్త విభుదరా
ట్కమనీయ మణి శతాంగములనంగ
తాటాక సేతు సందర్శనేచ్ఛా గత
స్థిత సమున్నత మహా శిఖరులనగ
నేతదుజ్వల ధరానేతృ సంపాదిత
మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ
ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి
వరుణ రాజన్య గోపురములనగ

నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా కంబములు జెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్రశౌరి .

        పై పద్యం భావం
         -----------------
మా కుల్లూరి శీమ రాజ్యభార ధురంధరుండైన
చింతపట్ల రుద్రశౌరి మాయూరి నల్లచెరువుకు
ముప్పదిమూడు రాతిస్థంభాలతో అలుగు నిర్మిం
చెను . ఆ అలుగు వర్ణణ యిది .
క్రీ.శ. 1612లో
శిలాశాసనంలో వ్రాయబడి ఉంది .
సదరు చెరువులో మునగడానికి వచ్చి దేవతల
రాజు అచట నిలిపిన కమనీయ మణిమయ
రథము వలెనూ , తటాక సేతు సందర్శనేచ్చతో
వచ్చిన సందర్శకులకు శిఖరముల వలెనూ ,
ప్రకాశమానమైన కుల్లూరి శీమను పాలించిన
రాజులు సముపార్జించిన కీర్తి స్థంభాల వలెనూ ,
ముత్యములు మణులతో నిర్మితమై ఆకసము
నంటుచున్న వరుణదేవుని రాజమందిర గోపు
రముల వలెనూ అలుగు రాతిస్థంభములున్నవట .

ఈ శాసనం మాయూరి చెరువు అలుగు వద్ద ఇప్పటికీ నిలిచి ఉంది . శాలివాహనశకం 1534
పరీధావి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి సోమవారం అనగా క్రీ.శ.1612 న ఇది వ్రాయ
బడింది .
అప్పట్లో వీర వెంకట పతి రాయలు సామ్రాజ్య
మేలుతూ ఉండేవారు . వారి సామంతులుగా
ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశ ప్రభువు
వెలుగోటి వెంకటపతినాయనింగారు పాలించేవారు . రుద్రప్ప వీరి రాజ్యభార ధురందరుడు . అంటే సర్వ సైన్యాధ్యక్షులన్నమాట .
ఇదీ సంగతి .

ఈ శాసనంలో ఇంకో విశేషముంది .
శాలివాహన శకం 1534 అని వ్రాయడానకి
బదులుగా ---
' శాలివాహన శకే వార్ధిత్రిబాణేధరా సంఖ్యాకే '
అని వ్రాసి ఉంది . అనగా ----
వార్ధి = సముద్రాలు = 4
త్రి = 3
బాణ = 5
ధరా = 1
అంకానాం వామతో గతిః కాబట్టి
శాలివాహనశకం = 1534 అనుకోవాలి .
సంస్కృత శ్లోకం తర్వాత శాసనంలో
తెలుగు ప్రారంభించారు .
అక్కడ శాలివాహన శక వరుషంబులు 1534
అని తెలుగంకెలలో వ్రాయబడి ఉంది .


శ్రీ పంతుల గోపాల కృష్ణారావు గారు
ఒక టపాలో వివరించినట్లు
సున్న , అరసున్నలు తెలుపుటకు ---
సున్నతరువాత ద్విత్వం చేసి వ్రాసియున్నారు .
అలాంటి వాటిని నిండుసున్నగానూ ---
సున్న తరువాత ద్విత్వం వ్రాయని చోట్ల
అరసున్నగానూ చదువితే శాసనం సులభం
గా అర్థమయ్యింది . అనవసరమైన చోట్ల సున్నలెందుకు వ్రాస్తున్నారో , అవసరమైన చోట్ల సున్న తదుపరి ద్విత్వమెందుకు చేస్తున్నారో అర్థంగాక సతమత మయ్యేది . కాని , పంతులు గారి టపా సంశయాన్ని తొగించింది . వారికి కృతఙ్ఞతలు . ఇక రేఫను తదుపరి అక్షరానికి
ఆవల గిలకగా వ్రాయడం సరేసరి .

9 వ్యాఖ్యలు:

 1. మీ బ్లాగులో మళ్ళీ కుల్లూరి విశేషాలు చదవడం ఆనందంగా వుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ కుల్లూరు విశేషాలలో తరచు "అలుగు" అనే పదం వస్తుంటుంది. ఈ సందర్భంలో "అలుగు" అంటే ఏమిటి రాజారావు గారు?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సార్ , చెరువుకు పటిష్టమైన అలుగు నిర్మిస్తారు . చెరువు నిండిన తదుపరి వచ్చే
   ప్రవాహం సురక్షితంగా వెలుపలికి వెళ్ళిపోవడానికి . గట్టి కొండరాళ్ళు వాడుతారు ఈ నిర్మా
   ణానికి . దీన్ని మా ప్రాంతలో అలుగు అంటారు . మాయూరి చెరువుకు అలుగు నిర్మించి
   రుద్రప్ప శాసనం రాయించాడు . శాసన రచయిత అలుగును తటాక సేతువు అని సంస్కృ
   తీకరించి రాయడం మనం గమనించ వచ్చు .

   తొలగించు
 3. నెల్లూరు ప్రాంత మాండలిక పదం అనుకుంటాను, నేను ఇంతకుముందు వినలేదు, అందువల్ల అడిగాను. వివరణకు ధన్యవాదాలు రాజారావు గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మిత్రులు రాజారావు గారు,
  ముప్పది మూడు శిలాస్థంభాలతో అలుగు. బాగున్నది. దేవతల రాజు స్వయముగా నవగాహనేఛ్చతో వచ్చెననగా నాయన తానొక్కడై వచ్చునా. సపరివారముగనే వచ్చును కద. బంధుమిత్రసహితులై కదా శచీపురదరమహర్షి రాక యమరుచుండును. వారందరును కలసి ముప్పది ముగ్గురు. అనగా ద్వాదశాదిత్యులు నేకాదశరుద్రులును మన్వష్టకమును నాశ్వినులిద్దరును వెరసి ముప్పదిముగ్గురు ప్రధానదేవతలు. వీరి సంఖ్యామాన మిట్లని శ్రీమద్రామాయణము చెప్పుచున్నది. రాకంబములనగా రాతికంబములనియా రాచకంబములనియా? వట్టి రాతికంబములన్నచో గొప్పయేమున్నది కావున నవి రాచకంబములు. త్రిభువనములకు దేవతలు పాలకులు వారిలో విబుధాగ్రగణ్యుడు కశ్యపుని పెద్దకొడుకైన వాడగు నింద్రుడు. చక్కగా నున్నది. అట్టు యింద్రు డిట్టి ముప్పది మూడు బృహత్కంబముల వద్దకు వచ్చి జలకమాడుట యన్నది బాగున్నది. ఈ కంబములు శతాంగములవలె మరియు నింద్రుని శతాంగముల వలె నుండుట యనగా సపరివారముగా నింద్రుడు వచ్చుటను సూచించుట. పరివారము యొక్క వైభవము రాజుదే కావున నింద్రుడు తన ముప్పది మూడు రధములతో నీ చెరువులో స్నానమునకు వచ్చుట యని చెప్పుట. సముచితమైన ప్రయోగవైచిత్రి. గొప్పపద్యము.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిత్రులు శ్యామలరావు గార్కి
   నమస్సులు .
   ముప్పది మూడు రాతి స్థంభములతో ఆలుగు
   నిర్మించడంలోనూ , శాసన రచయిత ' అవగాహ
   నేహా .... శతాంగములనంగ ' నని బహువచనం
   చేసి వర్ణించడంలోనూ , అందులోని ఔచిత్యాన్ని
   మీరు పురాణేతిహాసోదాహరణాత్మక సవివరంగా
   వెలికితీయడంలోనూ ఎన్నెన్నో శాసనాంతర్గత
   గోప్యాంశాలు తెలిసి అబ్బుర పరుస్తున్నవి .
   రేచర్ల పద్మనాయక ప్రభువు వెలుగోటి
   వెంకటపతి నాయనింగారు తమ తండ్రి కుమార
   తిమ్మానాయనికి పుణ్యము కల్గునట్లుగా
   శాయించిన నిర్మాణానికి వేయించిన శాసన
   రచయిత జల్లిపల్లి నాగనార్యుడు ' సర్వేషాం
   విదుషాం ' కోసం వ్రాసితి నన్నారు . మీరు
   అతని మాటను నిజం చేశారు . ధన్యవాదములు .

   తొలగించు