సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, జులై 2017, శనివారం

గురు పౌర్ణమి .....

' వందే కృష్ణ జగద్గురుమ్ ' విమల విశ్వజ్ఞాన గీతార్యుకున్
వందే వ్యాసునికిన్ మహద్గురునికిన్ వందే చతుర్వేదకున్
వందే సాయికి సద్గురూత్తమునికిన్ వందే జగత్రాతకున్
వందే వెంకయ సామికిన్ మము సదా వర్దిల్లగా జూడగాన్

7, జులై 2017, శుక్రవారం

చొక్కిన యొకజంట .....

తెలుగు పద్యం
-----------------
చొక్కిన యొకజంట చూచుకుంటున్నట్లు
పలుమార్లు చదివించు భ్రాంతి ముంచి
ప్రియమార నొకజంట పిలుచుకుంటున్నట్లు
చెవులలో నింపైన చవులు నింప
శ్రుతి మించి యొకజంట చుంబించు కొన్నట్లు
పెదవుల మాటల మధువు లద్ద
కసిదీర నొకజంట కౌగిలించుచు పొందు
నానంద రస మగ్న మనుభ వింప

ముద్దు మాటలు దొర్లించి ముదము గూర్చ
సొగసు టూహల భావ మంజూష నింపి
తియ్య మామిళ్ళు తేనెలో దిగిచి నట్లు
తెలుగు పద్యపు సౌరు వర్థిల్ల వలయు .

6, జులై 2017, గురువారం

ఊహింపంబడె .....

ఊహింపంబడె నల్లనయ్య నలుపొక్కొక్కర్కియొక్కోటిగా
సాహిత్యానలతప్తులై యొకరు తా సారించి నల్పే తనన్
తా హీనంబుగనెంచి శ్యామలుని యొద్దంజేరెనం , చొక్క రా
శ్రీ హర్షుండు విముక్త కీర్తి సితుడై శ్రీ దేహుడైనట్లుగాన్ .

మరియు నొకరు విశ్వంబు మాడ్కి విశ్వ
విభుడును నలుపనె , జలద విభవ మొంది
శ్యామలుండయ్యె ననె నొక్క రా మదన జ
నకుని  నైన సంశయము మానదు మనంబు .

వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని

యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .

నల్లనివాడైన నమ్మినారు .....




జయ కృపారసము పైజల్లంగనే నీవు
నల్లనివాడైన నమ్మినారు
పద్మ నయనములు బరుపంగనే నీవు
నల్లనివాడైన నమ్మినారు
తలకట్టు పింఛంపు వలలు వేయంగనే
నల్లనివాడైన నమ్మినారు
నవ్వురాజిల్లు మో మివ్వటిల్లెడు నీవు
నల్లనివాడైన నమ్మినారు

నమ్మి చెల్వలు మానధనంబు లివ్వ
దోచుకొనిపోయి యెక్కడో దూరినావు
మల్లియల నడిగెద రాయమాయకులు , క
నియు కనుపడ వేమిర ! కమనీయ రూప !


4, జులై 2017, మంగళవారం

నీ కెలా గంటు కొనె నల్పు నీరజాక్ష !

దేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు

బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !





3, జులై 2017, సోమవారం

ఎవరు చెప్పిరి నలుపని .....

వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని

యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .