సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

30, సెప్టెంబర్ 2017, శనివారం

విజయదశిమి - నేడు - విజయోస్తు జగతికి .....


చెడుపై కడదాకా యీ
పుడమిని పోరాడి దుర్గ  పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .


చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .


ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని  దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .


మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్


అమ్మ చెప్పినదిది , నమ్మి  తనంతగా
నెవడు పూని  సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి  చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు  వచ్చి దుర్గ .28, సెప్టెంబర్ 2017, గురువారం

తల్లీ ! దుర్గమ్మా ! వందనాలు .

దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .

తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .

అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .

27, సెప్టెంబర్ 2017, బుధవారం

మాతా సరస్వతీ .....

నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .

పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
హంస నెక్కి తిరుగు నజుని రాణి !
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మమ్ము గావు మమ్మ ! మంజు వాణి .

విన్నపాలు వినవలె ....

పలు భాషల పరిచయములు
పలు గ్రంథాంతర పరిచయ ప్రావీణ్యములున్
పలు దేశ విశేషానుభ
వ  లసద్బుధులుగ 'జిలేబి'వారిని దలతున్

అందరము పెద్దవయసులో కడుగిడితిమి
ఆట విడుపుగ నిట నొక చోట చేరి
కదిసి మచ్చటించు తరిని  కాస్తటు నిటు
మాట లొలుకుట సహజమ్ము  మాన్యచరిత !

వారం రోజులు మీమీ
తీరులు తెన్నులు దెలియక  తికమక పడి  యే
తీరున నుండిరొ యని  హితు
లారయ వెదుకాడిరి హితురాలని కాదా ?

పెద్దవారు శర్మ పేరిమి విడువరు
కూరిమి మనసార కోరుచుంద్రు
క్లేశ మొంది కూడ  క్షీరధవళశోభ
తరుగదు మనసున గురు విభవులు .

హాస్య భాషణమ్ము లపహాస్య మవనీక
కట్టడించు కొనగ కష్ట మేమి ?
చతుర భాషణమున చాతుర్య మబ్బిన
తమకు సాధ్య మవని దారి గలదె !

పల్లాయి బల్కు 'సుగుణము'
పల్లికిలించుటలకంటె 'పరమ ఘనం'బౌ
నెల్లెడల పనికిరా దది
తల్లీ!విడువంగ నగును తమరికనైన్ .

26, సెప్టెంబర్ 2017, మంగళవారం

అన్నవరం సత్యదేవుని సందర్శనం.


రత్నగిరీశ్వరున్ గొలువ రమ్మని బిల్చిన బిడ్డవెంట నే
న్నూత్న మనో విభూతి వలనొప్పగ వెళ్ళితి , నెంత వేడుకో !
యత్నము సాంతమున్ మదికి హాయి నొసంగెను ,  జన్మ పుణ్యముల్
నూత్నములై యదృష్టముల నొక్కెడ గూర్చిన భాగ్య మొప్పగా -

కను విందుగా క్రింది గర్భాలయమ్ములో
శ్రీచక్రయుతముగా చెలువు మెరయ
బ్రహ్మాది దేవతల్ పడి పడి మ్రొక్కిన
పాదాలు గంటిని పరవశమున
కడు శోభనము పైన గర్భాలయమ్ములో
శివ , రమా మూర్తులు చేరి కొలువ
మధ్యలో కొలువైన మహనీయ మూర్తి  ము
ఖమును గంటిని నాదు కర్మ తొలగె

అన్నవరము యాత్ర మిన్నయై మదిదోచె
కన్నుల కొక పుణ్య మున్న కతన
జన్మ ధన్య మయ్యె , సత్యదేవు మహా ప్ర
సాదము దొరికినది , సకల శుభము .

సత్య దేవు నెదుట సాగిలి మ్రొక్కితి
వ్రతము సేయు భక్త వరుల గంటి
వెలయు కొండ మీది యిలను  వైకుంఠమ్ము
కన్నులార గంటి కరవు దీరె .


24, సెప్టెంబర్ 2017, ఆదివారం

పురుహూతికా దేవి దర్శన భాగ్యం లభించింది .

పిఠాపురం వెళ్ళేను ,
పురుహూతికా సతీదేవిని దర్శించుకున్నాను .
తన్మయత్వం చెందేను .
---------------------------