సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

26, ఆగస్టు 2018, ఆదివారం

ఒక్క ధర్మజుడే బొందితో ..... ఏల ?


తనకన్న తెలివిడి తనమున్న వారలు
లేరను యహముచే చేర డొకడు
తనకన్న సొగసైన ఘనులు లేరను నహం
కారము కనుగ్రప్పి చేర డొకడు
మగ లైదుగురి లోన మగువ ' కింద్ర సుతుడె '
' మక్కువ ' లోపమై చిక్కె నొకతె
విలు విద్యలో తన చెలువమ్ముపై నున్న
అతిశయ మొకనికి అడ్డు నిల్చె

మరణ వేదన పడుచున్న మనుజు జూచి
పరగ నానంద పడుటచే పడియె నొకడు
తుదకు ధర్మజుం డొక్కడే ముదము తోడ
బొందితో స్వర్గమును జేరె పూజ్యు డగుచు .

8 వ్యాఖ్యలు:

 1. శ్యామలీయం అన్నారు...
  సీ. ఘోషయాత్రలోన దోషావనతుడైన
  . . . కురురాజుపై జాలి గొనిన వాడు
  బలమేది మడుగులో పడియున్న వానిని
  . . . కరుణతో జూచు నిష్కలుష మూర్తి
  పరమాపకారియౌ వానితండ్రికి సేవ
  . . . చేసి మురిసినట్టి శీలయుతుడు
  వెన్నంటి వచ్చిన బేపిని దివ్యవి
  . . . మాన మెక్కించిన మంచివాడు
  దర్మజుడా వాని దయకు మేరయె లేదు
  . . . వాని సోదరు లట్టి వారు కారు
  ఆ.వె. కనుక నొక్క ధర్మతనయుడే బొందితో
  స్వర్గసీమ జేరజాలు వాడు
  ధర్మబుధ్ధిచేత తద్దయు దయచేత
  మర్త్యుడయ్యు నత డమర్త్యుడయ్యె

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ధర్మజుని కీర్తిని పతాక స్థాయికి చేర్చిన ఈపద్యం మీవిశేషజ్ఞతని
  సంతరించుకున్నది . ధన్యవాదాలు .
  కాని ,
  ధర్మజుని వెంట వచ్చిన కుక్కనుకూడా విమానంలోకి అనుమతించవలసిందిగా కోరడం , ఇంద్రుడనుమతించక
  పోవడం , తుదకు యమధర్మరాజే ఆ కుక్కరూపంలో
  ధర్మజుని పరీక్షించుటకు వచ్చినట్లు విదితమవ్వడం
  పెద్దల వలూల విన్నాను . వివరించండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీరన్నది నిజమే రాజారావు గారూ. ఆ ధర్మరాజు-కుక్క ఉదంతం వివరాలు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు పరిష్కరించిన తిక్కన గారి ఆంధ్ర మహాభారతము లో మహాప్రస్థానిక పర్వం లో 327వ పేజ్ నుండి కనబడతాయి (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి ప్రచురణ).
  (టి.టి.డి వారి e-books లోని కవిత్రయ సంపుటాల్లో ఈ పర్వం ఉన్న సంపుటం వారి వెబ్-సైట్ లో నాకు దొరకలేదు 😕)

  పాండవుల మహాప్రస్థానం : ధర్మరాజు - కుక్క ఉదంతం

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వెన్నంటి వచ్చిన బేపిని దివ్యవి
  . . . మాన మెక్కించిన మంచివాడు

  శ్యామలరావుగారి పద్యంలో పైపాదం సందేహం
  రేకెత్తించింది . తమరి వివరణకు ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు