సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, అక్టోబర్ 2018, శుక్రవారం

అమ్మ ఋణం తీరదు .....

గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ
నొప్పిని ప్రియముగా నోర్చుకొనును
అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో
నొదుగంగ గుండెల కదుము కొనును
ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక
మురిపాన చన్నిచ్చి పరవశించు
బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ
బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

అలుపెరుంగక రాత్రింబవలు భరించి
బిడ్డలే లోకముగ జీవించు" అమ్మ " _
బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,
బిడ్డలకు గూడ అంతటి ప్రేమ గలద ?

తనువిచ్చి కన్నట్టి తల్లిని కాదని
రాతి బొమ్మకు మ్రొక్కు ఖ్యాతి మనది
చన్నిచ్చి కడుపార చాకిన తల్లికి
వెన్నిచ్చి వదిలించు విద్య మనది
తొలి యొజ్జయి  యెరుక దెలిపిన తల్లిని
మోస పుచ్చెడు గొప్ప బుధ్ధి మనది
సంతానమే తన సర్వస్వ మను తల్లి
తమకు భారమ్మను తలపు మనది

బిడ్డలకు  వాండ్ల పెండ్లాలు బిడ్డలకును
ఊడిగము చేసి  యోపిక లూడి కూడ
బ్రతికినన్నాళ్ళు చాకిరీ బ్రతుకు బ్రతుకు
తల్లి కాదరణ కరువు ధరణి మీద  .

వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి
పూని చాకిరి చేయలేని నాడు
బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు
చేరి సహాయము కోరు నాడు
ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు
వైద్యావసరము కావలయునాడు
మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో
కలగుండు పడు కష్ట మొలుకు నాడు

అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి
కాచి కడతేర్చు బిడ్డలు గలర ?  అంత
గాక పోయిన బాధ్యతగా దలంచి
జాలి చూపించ గలర ?  కాస్తంత యైన

" మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర
ఋణము తీరదు  _  ముదిమి పైకొనిన నాడు
కాచి కడతేర్చ   తీరు  _   నీ ఘనత  మరచి 
ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?

21 వ్యాఖ్యలు:

 1. తల్లిని తలచిన తొలగును నెల్లర కష్టములు కదా !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మలిసంధ్య యందు తల్లిని
  తలచి కొలిచి సేవ జేయు తనయులు తనయల్
  ఇలలో ధన్యత గల వా
  రలు , వారికి వందనమ్ము లమ్మా ! విబుధా !

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కాపు కులాబ్ధి చంద్రుడు , నిగర్వి , వివేకవిభూషి , భాషణా
  రూప చతుర్వచో విభవలోలుడు , బేంకరు , షష్టిదాటినా
  పాపడి వోలె ఫోజు , బెజవాడ నివాసి , హితైషి , బండి సార్
  సూపరు , మాకు మిత్రుడు , విశుధ్ధిగ వారికి పద్య మిచ్చితిన్ .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రంభా హో పాటల పైపై కెలుకుచు
   గుంభనగా బ్రతికెడు చిన్ని పాపడి
   డంబముల నీ విధముల ఎండవేయుట మీకు
   సంబరమాయెనా విహితా, జిలే'BEE' సహితా !

   తొలగించు


  2. రంభాహో యను పాటలన్, సరసమై రాణించు గీతమ్ములన్
   భంభంబంచు జిలేబులన్ కవివరా బారాన చారానగా
   సంభారమ్మున వేయు చుంటి నయ మాస్టారూ నిదానంబుగా
   భంభీరీ భళి నేడు రీటయిరవన్ వర్రోడె వేగంబుగా :)

   జిలేబి

   తొలగించు
  3. మాకు హితులు మీరు , మామికి సిసువులు
   హితుల తలల నాల్క , స్తుతికి తగిరి
   మాకు తెలియ నట్టి మరికొన్ని గుణ గణాల్
   తెలిసి వొగడు వాడ , మలి విడత ను .

   తొలగించు
  4. "తెలియ నట్టి మరికొన్ని గుణ గణాల్ ..."

   నే జెప్ప, నే దొరక ...
   గోయింగ్ అండర్గ్రౌండ్ ... :)

   తొలగించు
  5. @ Zilebi ...

   घराना का तराना अब बनगया चार आना बारा आना ...
   क्या हाल होगया ... कैसे जमाना आगया ...
   चुप नहीं रझूंगा ... मैं इन्तेक़ाम लूंगा ...

   दोस्तों को प्यार किया ... दुश्मनों से बदलालिया ...
   शान से ... गान से ...
   इंतज़ार रहना ... हाहाहा ... :)

   తొలగించు


 4. పాపడి వలె ఫోజులటా!
  రూప విభవలోలుడంట ! రుబ్బును కరవో
  కే పాటల బండినటా
  సూపరు మిత్రులట వారు సుదతి జిలేబీ :)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వాకే ! వాకే !మీకే
   నా కన్నా తెలియునండి , ఙ్ఞానాంభసి !మీ
   రాకకు ధన్యతలండీ !
   రాకాశశి వదన ! తమకు ప్రణతులు విహితా !

   తొలగించు


 5. కదనపు రాజ కవివరుం
  డ! దిక్తటోద్దీపకుడ! నడదివియలము సూ
  వె!దిశాగజములు మీర
  య్య! దుంకుడు జిలేబులమ్మయా మేము సఖా:)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ప్రత్యుత్తరాలు
  1. విన్నకోట వారు వ్యాఖ్య నెందుకు తీసేసేరో ? కినుక కాదుగదా ! అందుకే
   వారికొక పద్య ప్రసూనం సమర్పయామి .

   శ్రీయుత విన్నకోట నరసింగ బుధేంద్రులు పాండితీ ప్రకాం
   డేయులు , వారిగూర్చి వివరించె రిసెర్చి , యదేమి సిత్రమో !
   వ్రాయరు పోష్టు , వ్యాఖ్యలతొ వాయగ గొట్టుటె కిక్కు వారికిన్ ,
   మాయురె ! యేమి తంత్రమిది ! , మైత్రికి వారు మనోఙ్ఞ మానసుల్ .
   Jk
   తొలగించు  2. పేరగు నంటన్ మైత్రికి
   పేరగు నరసింగమంట పేర్మికి పేరై
   జోరగు వ్యాఖ్యలకున్ కిం
   గై రీసెర్చులకు పేరు గాంచి వెలిగిరే !   జాల్రా
   జిలేబి

   తొలగించు
 7. పద్యకుసుమం ఇచ్చినందుకు ధన్యవాదాలు, రాజారావు మాస్టారూ 🙏.

  “కినుక” కాదండి నాలిక్కరుచుకోవడం వలన నేను నా వ్యాఖ్యను తీసివేయడం జరిగింది. ఆ క్రమం బెట్టిదనిన ... మీరు చేసిన ‘బండి ప్రశస్తి’ చూసి ఉన్నట్లుండి ఇదేమిటీ అనుకుని, కారణం తెలుపమని అడుగుతూ నా వ్యాఖ్య వ్రాసాను. అయితే బండి నాకు కూడా మిత్రుడే కాబట్టి మరోసారి పరికించి చూద్దామని చదివితే మీ పద్యాన్ని / పోస్టుని బండివారికి అంకితమిస్తూ మీరు చెప్పిన పద్యమని అర్థమైంది. అందుమూలాన నా వ్యాఖ్యని తొలగించాను. అయ్యా అదీ సంగతి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీ ఈ (అ)కారణంగా గురువు గారు మీక్కూడా
   ఓ పద్యం అంకితమిచ్చుకోవలసి వచ్చింది.
   ఆ-కారణంగా మీకో పద్యం అప్పనంగా ముట్టేసింది.

   అప్పనా తనమన్నా అప్పనంగ పప్పన్నమన్నా ...
   మీరా జాతకరత్న మిడతంబొట్లు గారి చుట్టంలా ఉన్నారే ... :)

   తొలగించు
  2. అప్పన్నా తన్నామన్నా అప్పనంగ పప్పన్నమన్నా
   రాసి వేసి తీసి వేస్తే తన్ను(తరుము)కొచ్చె ఓ పద్యమన్నా ... :)

   తొలగించు
 8. అప్పనా తన్నామనా ఓరోరీ బ్లాగన్నా
  అప్పనమెప్పుడూ రుచే గదా బండన్నా 😀
  (jk)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఇదేదో అవధాన కార్యక్రమముల ఉంది. భలే ఉన్నాయి చతురోక్తులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అన్యగామి గారు ! అవధానమేనండి ,
  దొరకలే దవధాని , తరలి రండి ,
  ప్రముఖు లందరున్ను ప్రశ్నించువారలే ,
  చోటు గలదు , అగ్రపీఠ మెక్క

  ప్రత్యుత్తరంతొలగించు