సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, అక్టోబర్ 2018, శనివారం

బ్లాగ్ వీక్షకులకూ , మిత్రులకూ దశరా శుభాకాంక్షలు


వందనాలు తల్లీ .....
-------------------
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు

ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి  తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .

దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .

తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .

అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .

12, అక్టోబర్ 2018, శుక్రవారం

కొల్హాపూర్ మహలక్ష్మీ అమ్మ వారి దర్శనం




పాదుగ భారతావనికి భద్ర మొసంగగ , నమ్మవారి ' య
ష్టాదశ శక్తి పీఠములు ' స్థాపిత మైనవి , యందు కొల్హపూర్
ప్రాదుర పట్టణాన మహలక్ష్మి యనన్ గల ' దమ్మ  ' , శక్తియై ,
నాదు పురాకృతమ్మనగ  నా యమ దర్శన భాగ్య మేర్పడెన్ .

భారతావని , ధరణిలో , బహు ముఖముల
శక్తి సంపన్న ,   మందు   నీ శక్తి పీఠ
ములు , హిమాలయము మొదలు పూజిత మయి
సేతువు వరకు వ్యాపించి చెలువు గాంచె

మూడు ముఖాలతో ముమ్మూర్తులా వెల్గు
మూలపు టమ్మణ్ణి మోము జూస్తి
కలహంస విలసిత కమలాసనము మీద
మిఱు మిట్లు గొలుపు  నా మించు జూస్తి
నాల్గు చేతుల యందు నారాయణుని వోలె
తగ గదా ఖడ్గాది ధరణ జూస్తి
ఐదు పడిగెల పాము పాదుగా తలమీద
గొడుగు పట్టిన తీరు తొడుగు జూస్తి

బ్రహ్మ విష్ణు శివులు పడి పడి మ్రొక్కెడు
తల్లి పరమ పాద తరణి జూస్తి
కొల్హ పూరు లోన కొలువైన మహలక్ష్మి
అమ్మవార్ని జూస్తి  నంజలించి .



9, అక్టోబర్ 2018, మంగళవారం

ఆనంద నందన వనం


అమ్మవారి గుడికి నటు నిటు నిరువైపు
రెండు నూర్ల మొక్క లిరువుగాగ
నాటి పెంచినాను , నేటి కేడాదయ్యె ,
పది యడుగులు పెరిగి ముదము గూర్చె .

కంటక కీకావరణము
నంటించి రగిల్చి నేలనంత చదునుగా
గుంటలు పూడ్చితి , దోలితి
పంటల కనువయిన మట్టి పలు విడతలుగా .

సిమ్మెంటు స్థంభాలు స్థిరముగా వోయించి
మెష్షుతో ఫెన్సింగు మించి తీర్చి
ఇనుప గేట్లు పెట్టి యిరుగడ గీలించి
నేలలో పైపులు నిగుడ జేసి
బావికి మోటారు పరిఢవింపగ జేసి
నీళ్ళు పట్టేందుకు నియతి జేసి
పాదులు తీయించి పశు యెరువులు వోసి
వివిధ మొక్కలు నాటు విథము నేర్చి

వేప , కానుగ , నేరేడు వృక్షములును
ఉసిరి , మారేడు , బాదము లున్ను , కొన్ని
నిమ్మ , మామిడి , కదళి , దానిమ్మ తరులు
పనసయు , తురాయి , జామయు ఘనత గలుగ .

ఎర్రచందన వృక్షాలు --- నింపు లొలుకు
పూల కస్తూరి , మందారముల రకాలు
పారిజాత , మల్లియ , నందివర్ధనాలు
పలు రకాలు నాటితిని నా భాగ్య మనగ .

బ్రతుకు టింకెన్ని నాళ్ళొ  ? యెవ్వ రెరుగుదురు ?
నేను నాటిన మొక్కలు  నిండుగా  ఫ
లాలు , నీడ లొసగును  హేరాళము గను ,
వంద లాదిగ భావి సంవత్సరములు .