సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఆవకాయ - అమరావతి


ఆవకాయ - అమరావతి
-----------------------------
భక్ష్య లేహ్య చోష్య బహువిథ భోజ్యాల
రుచులు చూచి చూచి రోత పుట్టి
నాల్క తుప్పు డుల్చు నవవిథ రుచి గూర్చి
తపము జేసె నొక్క ధార్మికుండు .

మంగళ గిరి ప్రాంతమునకు
చెంగట దిగి యతడు తపము జేయుచు నుండన్
రంగారు విపిన తలములు
క్రుంగంగా బారె నతని ఘోర తపమునన్ .

తపము బలము నింద్రు తాకెను , తనకేదొ
మూడె ననుచు నతడు ముగ్ధలైన
అప్సరోవనితల నంపె తపము గూల్చ
తలిరు బోడు లటకు తరలి రంత .

ఆమని యరుదెంచె నామ్ర తరువులన్ని
పూప పిందె బట్టి పొలుపు దాల్చె
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .

మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
పప్పునూనె బోసె పరువాల యూర్వశి
రుచికి పడి ఘృతాచి లొట్ట లేసె .

అల్లంత దూరమందున
నుల్లము రంజిల్ల ' ఘాటు ' నోరూరించన్
కళ్లు దెరిచి వెళ్లి తబిసి
యల్లన రుచి చూచి తన్మయత్వము నందెన్ .

కొత్తావకాయ రుచి గని
తత్తర పడి తబిసి తపము ధన్యత గాంచన్
బిత్తరు లందరను గూడి
చిత్తము రంజిల్ల విడిది చేసెను వనిలోన్ .

పోయిన భామలు రాలే
దేమయినదొ యంచు నింద్ర దేవుడు వెదుకన్
ధీ మహితులు సురలందరు
భూమికి దిగి వచ్చి చూడ ' బొమ్మ ' కనబడెన్ .

తబిసి తలిరు బోళ్లు తనివార కొత్తావ
కాయ రుచులు గొనుచు కన బడి రట
దేవ గణము గూడి దేవాధిపతి గూడ
వచ్చి చేరి రుచికి మెచ్చి నారు .

ఆవ కాయ రుచికి యమరులు పరవశం
బంది స్వర్గ సీమ మరచి నారు
అచటె యుండి పోయి ' రమరావతి ' యనంగ
' నాంధ్ర రాజధాని ' యయ్యె  నేడు .

13 వ్యాఖ్యలు:

 1. మాస్టారు,అ(మరావతి)ఆ(వకాయ)లు అద్భుతః.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బతికించారు, మరో అప్సరస చేత వెల్లుల్లిపాయలు కలిపించలేదు ఆవకాయలో 🙏 😀. మొత్తానికి గురజాడ అప్పారావు గారి “ఖగపతి యమృతము తేగా....” లెవెల్లో చెప్పారండి దివ్యావకాయ గురించి. మీ బ్లాగ్ పేరులోని రెండవ పదానికి తగినట్లుగా ఉంది ఈ టపా👌.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వద్దు బాబో వద్దు , కలపద్దు 👐 .

  "..... వెల్లుల్లిన్ దిలపిష్టమున్ విసివితిన్ విశ్వస్త వడ్డింపగా ....." అంటూ శ్రీనాథుడు తిన్నాడేమో గానీ నేను మాత్రం వెల్లుల్లి తినలేను ... విశ్వస్త వడ్డించినా, అప్సరస వడ్డించినా 😑.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విసివితిన్ ? , ఓహో , తిని తని విసిగిపోవడమా ?
   మెసవితిన్ అనే పాఠాంతరముందేమో ! నేను విన్నాను లెండి .
   సార్ , విశ్వస్థ అంటే అర్థం తెలుసు గాని , పరమార్థ మెఱుగను ,
   తెలుపగలరు .

   తొలగించు


 4. ఆవకాయ పోయె నౌర వెల్లుల్లియె
  కాస్త పుంజుకొనెను కతని చూడ
  విసివి కొనెడు కైపు విశ్వస్త వేంచేసె
  విశ్వదాభి రమణి విను జిలేబి :)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అసలు విస్వస్థ తేలక చస్తుంటే ,
   మళ్ళీ మీరు విశ్వద ను తీసుకొచ్చేరే .
   విశ్వద వేమారెడ్డి గారి బాపతు - అని
   విమర్శకులంటారు . మీరు మకుటాన్ని
   విశ్వ వినుత గా మార్చండి , లెస్సగా
   ఉంటుంది .

   తొలగించు
 5. రంభ కాయ గోసి రాగాల కారమ్ము
  ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .

  మేనక ప్రియపడి మృదువుగా నందులో
  నావ పిండి గలిపి చేవ గూర్చె
  ---------
  వావ్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీరు నేర్పిన కొత్త అచ్చులు అ(మరావతి)-ఆ(వకాయ) బహు బాగా నచ్చాయండి, మాష్టారు!

  ప్రత్యుత్తరంతొలగించు