సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, జనవరి 2019, శనివారం

మల్లెలపై పద్యాలు .....మల్లెలోయమ్మ మల్లెలు , మల్లె విరులు ,
మనసు దోచేటి మల్లెలు , మగువలకును
మగలకును , మనోల్లాస సమాగమంపు
సరసగుళికలు , రమణీయ విరి కళికలు .

మల్లెలపై పద్యావళు
లల్లుడు భాషా మతల్లి కాహ్లాదముగా
నెల్లెడల తెన్గు పరిమళ
మల్లన తగ వెల్లి విరియ నాంధ్ర కవి వరుల్ .

మల్లె పూల బుట్ట  తెల్లని పరిమళ
ముల్లసిల్ల మీకు ముందు గలదు
అల్లి తెలుగు పద్య మల్లె దండలు గ్రుచ్చి
తల్లి మెడను జేర్చ దన్యత గద !

మల్లియలార ! మీకు ప్రతిమానముగా సరివచ్చు పూలు లే
వల్ల ధరాతలంబునను , నా త్రిదివంబునగాని , పార్వతీ
వల్లభుడే వరించు మిము వాసిగ పూజకు , మల్లికార్జునుం
డుల్లము మెచ్చి వేడ్క కురియున్ వరముల్ మిము దాల్చినంతనే .

నల్లని వాల్జడన్ తురిమి , నాణ్యముగా దిగజార్చ , పోడుముల్
మొల్లములై యెసంగు కడు ,  ముగ్ధ మనోహర రూపలాలస
త్సల్లలితోరు రోచిషులు సాధ్యమ , నీ సయిదోడులేక , యీ
ఫుల్ల సరోజ నేత్రలకు ,  పూవన నీవె మనోఙ్ఞ మల్లికా !