సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, మే 2019, మంగళవారం

తాటి ముంజలు


పాటించి తినరండు తాటిముంజ లివిగొ
తాతలు తినిరి ప్రతాప ఘనులు
శ్రీరామ చంద్రుడున్ సీతమ్మ లక్ష్మణుల్
తిని వనవాస దీక్షను గడిపిరి
మేటి యా కన్నయ్య తాటిచెట్టెక్కి
తా దిని చెలులకు తనియ బెట్టె
భువినుండి నారదు డివి దివి గొంపోయి
దేవేంద్ర ప్రభునికి దినగ బెట్టె

బ్లాగు బందుగులార ! తాళఫల చికుర
మృదు సుధామల మధుజల మిళిత వినుత
రుచిర ప్రచుర పదార్థము ప్రోది చేసి
తి , తిన రండు , సమయ మిదె , తృప్తి దీర .

13, మే 2019, సోమవారం

మామిడి పండు


అందాని కతివలు కుందేరు నినుజూచి
రూపున పొంకమ్ము రోలు చుండ
రంగున కప్సరో రామలు నినుజూచి
యనిమిషులై వెర గందు చుండ
కొమ్మకు వ్రేలు నీ  కుల విలాసము జూచి
బొమ్మలై కొమ్మలు బొగులు చుండ
నిలువెల్ల రసమొల్కు చెలువంపు సిరి జూచి
సరసిజాననలు నీరస పడంగ

రసపిపాసు లింతుల యధరామృత రస
విరసులై ,తమ యధరముల్ వెలయ నీ ప
యిన లయింతురింక రసాల ఘన ఫలమ్మ !
మధుర ఫల మని యవనిపై మన గదమ్మ !