సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రజా సేవ కోసం .....



రాష్ట్రాలు రెండైనై
తెలుగు నేతల వెలుగు
రెండింతలైంది
రెండు చోట్లా మొదులైంది
నేతల హడావుడి -
అబ్బే ,
పదవుల కోసం కాదు
ప్రజా సేవ కోసం
నిఝ్ఝంగా నిజం
ఇద్దరు ముఖ్య మంత్రులొస్తారు
ఇద్దరు పీసీసీ ప్రెసిడెంట్లొస్తారు
డజన్లకొద్దీ
మంత్రులొస్తారు -
రెన్నెళ్ళల్లో ఎలక్షన్లు
ఆగలేరా అందాకా -
అబ్బే ,
పదవుల కోసం కాదు
ప్రజా సేవ కోసం .
ఆగరు గాక ఆగరు
ఆగితే ,
ఆగబాగమై పోతాము
ప్రజా సేవ లేక -
రైతు వ్యవసాయం చెయ్యలేడు
రైతు కూలీకి పని దొరకదు
తాపీ మేస్త్రీ తటపటాయిస్తాడు
కార్యాలయాలు కకావికలై పోతాయి
గుమాస్తాల గుడ్లు తేలిపోతాయి
బళ్ళు బజారున పడతాయి
రవాణా రహదారి తప్పుతుంది
అందరూ అన్నం తినడం మానేస్తారు
అంతా అస్త వ్యస్త మౌతుంది
ప్రజా సేవ లేక -
అబ్బే ,
పదవుల కోసం కానే కాదు
ప్రజా సేవ కోసం .




20, ఫిబ్రవరి 2014, గురువారం

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

పరగు విశ్వ మనంతము , భ్రమణ రూప

చలన చాలన సంవృత్త శక్తి మయము

అందుగల కోట్ల గ్రహ తారకాది చయము

కడు నసంఖ్యాక మయ్యును కక్ష్య విడవు


                                                                                
తాను నివ సించు విశ్వమే , తనకు సుంత

యైన బోధ పడుట లేదు , తాను శక్తి

మంతు డెట్లగు? విశ్వనియంత కన్న

నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడు



భార్య బిడ్డలు తాను – ఈమాత్ర మైన

చిన్న సంసార బాధ్యతే చేత గాని

మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని

విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?



ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,

పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు

బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన

తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?




ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు

దాతనే మరచు కృతఘ్నతా విధాన

భావనలు గల్గు మానవా! పతన మవకు

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము