సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

నవ వసంతోదయము .....ఎండలకు తెల్గు నేలంత మండుచుండె ,
నీళ్ళు దొరకక పల్లె కన్నీళ్ళు బెట్టె ,
ప్రాణి కోటికి బ్రతుకు దుర్భరము గాగ ,
నవ వసంతోదయమును వర్ణణలు జేయ ,

ప్రకృతి యాహ్లాదకత కనుపట్టె వీర్కి ,
గండు కోయిల కూతలు , ఘన మయూర
నాట్య హేలలు దప్ప జనాల బ్రతుకు
దుర్భరతలు కన్పట్టవు దుర్ముఖులకు .

సాంప్రదాయ బధ్ధ సద్గుణ సంపన్న
కవులకు కనులెదుట కాన రాదు ,
ఆకసమ్ము కెగిరి అందాల మబ్బుల
ఊహ లందు మనుదు రుర్వి వీడి .

చూతు రంట కవులు  సూరీడు కననట్టి
చోటు కూడ జ్ఞాన సూర్యు లగుట ,
ఎట్ట యెదుట గల్గు ఘట్టాలు కష్టాలు
కనరు కళ్లు లేని ఘనులు వీరు .

సాంప్రదాయమ్ము వీడరీ సచ్చరితులు  
పండితులు తలలూచుటే పనిగ వ్రాయు
దారులను వీడి ప్రజల చైతన్య పరచు
మార్గ మెంచుకొను టెపుడొ? మారుటెపుడొ ?

  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి