సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

3, నవంబర్ 2011, గురువారం

నివేదన

                         నివేదన

ఆ.వె: రార గోప బాల! రాజిత జయ శీల !
        రార వేణు లోల !రాగ హేల !
        రార విశ్వ పాల !రమణీయ శుభ వేళ
        శ్రీనివాస సాయి! షిరిడి రాజ!

ఆ.వె: కాళ్ల కడ్డము పడి కరుణించ వేడితి
        కనుల జూడు నన్ను గన్న తండ్రి !
        కన్న బిడ్డ నయ్య కనికరించగ లేవ ?
        శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

కం:   నీ పాదాంబుజ ధ్యానము ,
       నీ పాద నితాంత దృష్టి నీమము ,సతత                                                                                   
       శ్రీ పాదసేవ భాగ్యము
       మాపాలిటి వరము లయ్య మారుతి సాయీ !

కం:  శశి కరములు తాకగ నే
      పసి హృదయము విచ్చి కలువ పరవశ మందున్
      వెస నీ కటాక్ష రుచిరము
      ప్రసరించుట తోనె మాకు భాగ్యము సాయీ!

కం  మధురము నీ నామ జపము ,
       మధుర తరము దర్శనమ్ము, మధు మాస సుధా
      మధురము నీ తోటి చెలిమి ,
      పద సేవన భాగ్య మెంత మధురమొ సాయీ !

ఆ.వె  అరయ ప్రణవ నాద మాకాశ మంతట
         నిండి మారు మ్రోగి నిన్ను జేరి
         యొనర నొక్కటగుచు నోంకార మయ్యెరా
        శ్రీనివాస సాయి! షిరిడి రాజ !

ఆ.వె  గగన సీమ విరిసి కను విందు చేయు నా
        తార లెల్ల భువికి తరలి వచ్చి
        తనర నిన్ను గొల్వ ద్వారాన నిల్చెరా
        శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

ఆ.వె  నాడు పట్టు చేల వీడని కన్నయా !
         నేడు చిరుగు బొంత వీడ వైతి
         నిన్ను దెలియ లేము నిర్గుణ బ్రహ్మమా !
         శ్రీనివాస సాయి! షిరిడి రాజ !

కం  నీ కరుణాపాంగ రుచులు
      ప్రాకటముగ బొంది నట్టి భాగ్యము కతనన్
      చేకొని యేపని జేసిన
      నీకు సమర్పణము జేతు నిరతము సాయీ !

ఆ.వె  మాకు రక్ష నీవు మమ్ముల బోషించు
         భార మరయ నీదె పరమ పురుష !
         జగతి నిండి నీవు జాగృతి నిచ్చేవు
         శ్రీనివాస సాయి ! షిరిడి రాజ !

ఆ.వె  శ్రీ సమస్త విశ్వ శ్రేయోభి లాషి !నా
         యాత్మ నందు నీవు నాకతీత
         యోగి రూప మందు దాగి యున్నావురా
        శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

ఆ.వె  నిన్ను గూర్చి తెలిసి నీతోటి మాటాడి
         నిన్ను బొందు నాశ నన్ను విడదు
         వెలయు జ్ఞాన మిచ్చి వివరించరా తండ్రి !
         శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

                                  --- వెంకట రాజారావు . లక్కాకుల


                      




      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి