సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, డిసెంబర్ 2015, గురువారం

లంకె .....

         "ఏజన్మలో ఏం పాపం చేశాడో ఇప్పుడనుభవిస్తున్నాడు , ఇలా గౌరవింప బడడం నా పూర్వ జన్మ సుకృతం . "
అనే మాటలు తరచుగా వింటుంటాం , మరి _
ఈజన్మలో సుకృతాలేవీ లేవా ,
దుష్కృతాలేవీ లేవా ?
ఉండే ఉండాలిగా !
మరి , వాటి ఫలితాలెవరనుభవిస్తారు ? మనమా , బిడ్డలా ?
               **********
" పూర్వ జన్మలలో చేసుకున్న కర్మలనుబట్టి జీవి పర జన్మలలో
మంచిగానీ , చెడుగానీ అనుభవించ వలసి ఉంటుంది "
ఇదొక జన్మ జన్మల సిధ్ధాంతం .
" కర్మల ఫలితాలను బట్టి జీవి మనిషిగా పుట్టాల్నా , కుక్కగా
పుట్టాల్నా , కోడిగా పుట్టాల్నా  _ ఏజీవిగా పుట్టాలనేది నిర్ణయింప
బడుతుంద " నే మరో అర్థం పర్థం లేని సిధ్ధాంతం కూడా ఉంది .
" సుకృతాలు చేసిన వారు దేవ యోనులలోనూ , దుష్కృతాలు
చేసినవారు రాక్షస యోనులలోనూ పుడతార " నే మరో రాధ్ధాంతం
కూడా ఉంది .
ఒక జీవి DNA తో మరో జీవిది విభేదిస్తుంది గనుక మనిషి
మనిషిగానూ , కుక్క కుక్కగానూ పుట్టాల్సిందే . ఒక జీవి
మరో జీవిగా పుట్టే పరిస్తితులెక్కడా తలెత్తవు .
ఇక దేవ , రాక్షస , యక్ష , కిన్నర , కింపురుష , గంధర్వాది
మానవాతీత గణాలన్నీ పురాణ గాథలు . వీళ్ళంతా మనుషులే .
మానవ జాతి గాక మరో జాతి బుధ్ధిజీవులున్న దాఖలాలు ఈ భూమ్మీద
గానీ మరో లోకంలోగానీ ఇంత వరకూ తెలియ రాలేదు .
             ************
సమస్త జీవరాశులలో మనుషులు మాత్రమే బుధ్ధి జీవులు .
తమ విచక్షణా ఙ్ఞానంతో మిగతా జీవులకంటే భిన్నమై ఉత్కృష్టమై
ఉన్నారు . జీవజాలమంతటా మానవులదే పైచేయి .
ప్రతి మనిషికీ
తల్లిదండ్రులతని పూర్వజన్మ . బిడ్డలతని తరువాతి జన్మ .
నిస్సందేహంగా
సుకృతాల వల్ల మంచి జన్మలూ , దుష్కృతాల వల్ల చెడు జన్మలూ
తప్పని సరిగా ఏర్పడతాయి .
మనిషి జీవన విథానం మంచి చెడుల సమ్మిశ్రితం .
                   *************
మనిషి  తాను మూటగట్టిన డబ్బూ దస్త్రమే కాదు ,
రూపు , రంగూ , ప్రవర్తించిన తీరు , భుజ బలం , బుధ్ధి బలం ,
ఆరోగ్యం , రోగాలూ , కళలూ , కౌశలాలూ , నైపుణ్యాలూ ,
దస్తూరీతో పాటు సర్వం మూట గట్టి తన బిడ్డలకూ _ తద్వారా
తర్వాతి తరాలకు _ అదే _ తన తర్వాతి జన్మల కందిస్తున్నాడు .
దీనినే మన పెద్దలు ప్రారబ్దమన్నా రు . అనుభవించక తప్పదన్నారు .
కానీ ,
ఈ విషయంమీద మంచి అవగాహన ఉంటే ఈ ప్రమాదాన్ని కూడా
అధిగమించ వచ్చు .
ఇందుకోసం మన పూర్వీకుల గురించిన సమగ్ర అవగాహన ఉండాలి .
కనీసం మన తల్లి దండ్రుల , తాత ముత్తాతల వరకైనా .
కేవలం వాళ్ళనుభవించిన రోగాల గురించయినా .
హాస్పిటల్ కెళ్ళితే ,
డాక్టర్ కూడా ఆరా తీస్తున్నారు కదా !
బుధ్ధి వికసించి తరుణ ప్రాయం వచ్చేటప్పటికే ,
అంటే వివాహానికి ముందే ,
తెలుసుకుని ఉంటే ,
ఆహార వ్యవహారాదిగా జీవనశైలిని  మార్చుకుని సదరు రోగాలు
మనకు రాకుండా చూచుకో వచ్చు . మనం సుఖజీవనం సాగించ
గలిగితే , మనం మన తర్వాతి తరాలకు కారణం కాము కదా !
 అంటే ప్రారబ్దాన్ననుభవించ వలసిన పనిలేదు .
            **********
ప్రతి మనిషి జీవితానికీ
 ' ఆజీవితంతో లంకె పడిన ముందు , వెనక జీవితాలున్నవి ' .
వైవాహిక జీవితానికి సన్నధ్ధం కావడమంటే ,
అదే _ బిడ్డల్ని కనడానికి ముందు ,
శారీరక మానసిక దారుఢ్యాలనూ ,
బుధ్ధి బలాలనూ ,
ఆరోగ్య సౌభాగ్యాన్నీ ,
కళాకౌశలాలనూ ,
వృత్తి నైపుణ్యా లనూ ,
తరువాతి తరాలకు అందించ గలిగే
 పటిష్ట జీవన శైలిని ముందుగా అలవరచుకోవాలి .
నాజీవితం నాయిష్టం అనుకుంటే .....
ఎలా పడితే అలా బతకడానికి అలవడితే .....
తరువాయి తరాలు కూడా
ఆ " భయంకర ఫలితాలు " అనుభవించవలసి ఉంటుంది .
తస్మాత్ జాగ్రత్త !

2 కామెంట్‌లు: