సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, జులై 2016, మంగళవారం

గురు పూర్ణిమ శుభ దినమున. ....

గురు పూర్ణిమ శుభ దినమున
గురు పీఠమునందు నిలిచి  గురు మార్గమునన్
వరలు గురుల పాదములకు
మరి మరి మ్రొక్కెద పడిపడి మది శాంతింపన్  .

మత్సరాలు వదలి  మనుజ కళ్యాణంబు
గోరు వారె గురులు  ,  కోరి కోరి
తగవులందు జక్కి  తన్నుకు జచ్చెడి
గురులు గురులు గారు  కూళ లరయ  .

కాషాయ వస్త్రాలు  గట్టిన మాత్రాన
వక్ర బుధ్ధి గలుగు వాడు గురుడె  ?
వేదాది విజ్ఞాన  వేద్యుడయ్యును  తాను
మోసాన చరియించ  బుధుడు గురుడె  ?
భాగవతాది ప్రవచనాలు జెప్పినా
సమభావనలు లేని జనుడు  గురుడె  ?
తగ హిమాలయముల  తపమాచరించినా
మనసు కట్టడి లేని  మనిషి గురుడె ?

వస్త్ర  , ఙ్ఞాన , తప  , ప్రవచనాది గొప్పలు
గురుతు లగున  పరమ గురువునకును ?
సకల మనుజులందు  సమభావమును జూపి
తీర్చి దిద్దు వాడె  దివ్య గురుడు  .

కృష్ణ పరమాత్మ  విశ్వానికే  గురుండు  ,
గురువుల గురువు వ్యాసుండు  పరమ గురుడు  ,
సాయినాధుండు  భక్తుల  సద్గురుండు
చేతులారంగ వీరికి  జోత లిడుదు  .