సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, ఆగస్టు 2018, శనివారం

అర్జునుడు ' కర్రి 'యా ? .....


కౌరవ్య రాజన్య గౌరవంబులు తెల్పు
కుంతియు , శక్రుండు గూడ తెలుపు
తెల్లని తనుచాయ తెఱగెఱిగించు నా
అర్జున నామథేయమ్ము తెలుపు
అరదంబు తెలుపట , హయములున్ తెలుపట
విల్లును శంఖంబు విథము తెలుపు
కపట మొల్లని యుధ్ధ కౌశలమ్ములు తెల్పు
విజయ పరంపరా వితతి తెలుపు

ఓజ నింతటి తెలుపు మారాజు తాను
' కర్రి ' యయి గాను పించును , కాదొ ? యవునొ ?
కాద ? అర్జున నామంబు ఘనత యేమి ?
అవున ! కర్రియై గన్పించు ఖర్మ యేల ?


14 వ్యాఖ్యలు:

 1. భారతం లో నలుగురున్నారట కఱ్ఱివాళ్ళు. కృష్ణుడు,కృష్ణ ద్వైపాయనుడు(వ్యాసుడు), కృష్ణ (ద్రౌపది), కృష్ణ (అర్జునుడు)

  నలుపు నాణ్యమని నానుడి కదండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవును ,
  కానీ , వాసుదేవ కృష్ణుడి విషయంలోనూ , కృష్ణద్వైపాయన ముని విషయంలోనూ సందేహం లేదు .
  ఇక ద్రౌపది అసలు పేరు కృష్ణ . ఆమె భానుమతి లాంటి సౌందర్య
  రాశులను కూడా నివ్వెర పరచే ' లావణ్య 'వతి . ఇక్కడే సంశయం . ఇక , అర్జున శబ్దానికి స్వచ్చమైన తెలుపని అర్థం .
  ఇక్కడా సందేహమే . సవ్యసాచి కెన్ని పేర్లున్నా అర్జున నామధేయమే
  రూఢి . కదా ..... మరి , పెద్దలు లోతుగా వివరించ వలసి ఉంటుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నలుపు అంటారుగాని అది నీలమేఘఛ్ఛాయ. నలుపే అందం,అందానికి మారుపేరు నలుపు.ద్రుపదరాజతనయ అపురూప లావణ్యవతి,తెలుపు,ఎరుపు, అందమని ఈ మధ్య కాలం వారి మాటనుకుంటా :)

   ద్రౌపది,అర్జునుడు నల్లనివారేనని భారతం మాట, ఎక్కడా? అనడిగితే మాత్రం ఋజువు వెంఠనే చూపలేను సుమా :)

   తొలగించు
 3. 'లావణ్య'మనే మాటకు స్పటిక స్వచ్చమైన తెలుపని భావం .
  ద్రౌపది లోకోత్తర లావణ్య రాశి . అందుకేనేమో అన్ని ఇబ్బందులు .
  భారతంలో ఆమె ఒక సందర్భంలో అర్జునుణ్ణి గూర్చి 'కఱ్ఱి విక్రమంబు
  కాల్చనే ? ' అంటుంది . ఏతావత్ , అర్జునుడు నలుపే . కానీ ,
  ఆపేరెందుకు రూఢి అయ్యిందో మరి .....అక్కడే సందేహం .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లోకోత్తర సౌందర్యరాశి ద్రౌపది నల్లనిదే! అన్ని ఇడుములబడింది. ఆమె అందానికి సైంధువుడు,కీచకుడు ప్రత్యక్షంగానూ, దుర్యోధనుడు,కర్ణుడు పరోక్షంగానూ అగ్నిలో పడ్డ శలభాల్లా మాడి చచ్చారు.

   కఱ్ఱి అంటే అర్జునుడు అని, బలశాలి అని కూడా అర్ధం ఉందనుకుంటానండి. ద్రౌపది పాండవులను సమావేశాల్లో తూర్పారబట్టింది, అవసరాన్ని బట్టి,వదిలెయ్యలేదు. :)
   నల్లనివాడైన అర్జునినికి ఆ పేరెందుకు నిలిచిపోయిందో మీరే చెప్పాలి. :)

   విగ్రహం మాత్రం తెల్లగా ఉన్నట్టుంది కదండీ, మన దేశంది కాదేమోగా :) మన దేశంలో అర్జునిడికి విగ్రహమా?

   తొలగించు
  2. ఈ విషయమైన విశ్వనాథవారు వ్రాసారండీ. నాకు గుర్తు ఉన్నంతలో వ్రాస్తాను. లవణం అంటే ఉప్పు. ఇక్కడ ఉప్పు స్పటికం తీసుకోవలి. ఉప్పు crystalline రూపంలో ఉంటుంది కదా. లావణ్యం అన్న మాటకు అర్థం లవణం అన్న మాట నుండి ఉత్పన్నం అవుతుంది. ఒక స్ఫటికం (crystal)కు ఉండే సౌష్ఠవమూ దానికారణంగా కగిగిన సౌందర్యమూ అన్నవి లావణ్యం అన్నమాటకు అర్థాన్ని అంటే (యౌగికమైన అర్థాన్ని మించి) ఒక రూఢార్థాన్ని ఇస్తున్నాయి. అందుచేత ఒక స్త్రీని లావణ్యవతి అన్నారంటే మనం ఆమెయందు చక్కని అవయవ సౌష్ఠవం (అంటే శాస్త్రంలో చెప్పబడుతున్న విధంగా మంచి సాముద్రికమైన లక్షణాలతో) ఆపాదించబడుతున్న దని అర్థం చేసుకోవాలని. స్ఫాటికత సౌందర్యం సూచకం కాబట్టి లావణ్యవతి అన్నపుడు సామాన్య (అస్ఫాటిక) వస్తువుల/మానవులవలె కాక అద్వితీయమైన సౌందర్యం అని కూడా గ్రహించాలి.

   లావణ్యం అనే గుణం మనం శారీరక వర్ణానికి అతీతంగా అన్వయించటం సంప్రదాయం కాబట్టి లవణం (ఉప్పు) తెలుపు కాబట్టి లావణ్యం అంటే మంచి తెలుపు అని చెప్పకూడదని అనుకుంటాను. ముఖ్యంగా యౌగికార్థాన్ని యోగరూఢం మించినప్పుడు యోగరూఢాన్నే మనం తీసుకోవాలి.

   తొలగించు
  3. ద్రౌపది నల్లగలువని తెలిసి పోయిందిగా .
   అయినా , చాలా కాలం క్రితం చదివిన
   ఒక వార్త ...
   సూదిమందు వేసేప్పుడు విరిగిన నీడిల్ కొన
   ముక్క వెయిన్ లో వెళ్ళడం కనిపిస్తూ ఉండిం
   దట . వెంటనే బెల్ట్ కట్టి ఆపి ముక్కను తొలి
   గించేరుట . క్రిష్టల్ క్లియర్ అంటే ఇదేనేమో !
   నాకేమో , నమ్మ శక్యంగా లేదను కోండి .
   చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండీ .

   తొలగించు
 4. విగ్రహం 'బాలి' ద్వీపం లోది .
  సందేహం వల్లనే టపా పెట్టేను . ప్రాజ్ఞులుండక పోతారా అని .
  చూద్దాం . విశేషజ్ఞులు ముందుకొచ్చి , నివృత్తి చేస్తారేమో!
  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈ విషయం గురించి గుంజాటన అనవసరమని నా అభిప్రాయం సర్. కుతూహలం కొద్దీ
  బాలీయుల గురించి గూగులించాను. బాలీయులకు కృష్ణుడు కూడా తెలుపులాగే ఉంది ... వారి ద్వీపంలోని ఒక కృష్ణార్జుల శిల్పం లో ఇద్దరూ తెల్లగానే ఉన్నారు. ఈ క్రింది లింక్ చూడండి.

  బాలి ద్వీపంలో కృష్ణార్జునుల శిల్పం

  పైన శర్మ గారన్నట్లు తెలుపు, ఎరుపు అందమని బాలీయుల భావనేమో ☺? వారి శిల్పాలు చూసి మనం సందిగ్ధంలో పడనవసరం లేదేమో?

  అర్జునుడు నల్లనివాడేనని భారతంలో స్పష్టంగా ఉంది కదా. కవిత్రయంలోని ఆదిపర్వం షష్ఠాశ్వాసంలో నెం.17 లో "మిసమిసలాడే నల్లకలువ వన్నెవాడు పాండవులలో నడిమివాడు అయిన అర్జునుడు ... అంటారు "కుమారాస్త్రవిద్యాసందర్శనము" లో.
  అలాగే ఆదిపర్వం సప్తమాశ్వాసం నెం.23 లో ("ద్రౌపదీవివాహప్రయత్నము") "ఇంద్రునితో సమానుడు, నల్లకలువ వలె నల్లని అందమైన శరీరం కలవాడు, ఇంద్రుడికి కుమారుడు అయిన అర్జునునికి ...." అంటాడు ద్రుపదుడు.
  కాబట్టి "కఱ్ఱి" అనే విశేషణం నలుపు అనే అర్థంలోనూ, బలవంతుడు అనే అర్థంలోనూ కూడా అర్జునుడికి సరిపోతుందిగా మరి?

  సరే, ద్రౌపది నల్లరాణి అని భారతంలో ఉన్నదేగా. ఆదిపర్వం సప్తమాశ్వాసం లో నెం.20 "నల్లకలువ వంటి శరీరవర్ణం కలది" అంటుంది కదా ద్రౌపది జననం గురించి. ఇక "లావణ్యము" అంటే "ముఖకాంతివిశేషము" అంటోంది ఆంధ్రభారతి. ఆ అర్థం తీసుకుంటే సరిపోతుందిగా? నల్లటివారిలో కొంతమంది ముఖంలో చక్కటి కళ, కాంతి గల వారుంటారు కదా, ఏమంటారు. తెలుగుభాషా పరిజ్ఞానం గల మీలాంటివారు చెప్పాలి.

  శర్మ గారన్నట్లు నలుపు అందమే .. నిస్సందేహంగా. ప్రధానంగా తెల్లవాళ్ళ దేశమైన అమెరికాలో 1960ల దశాబ్దంలో Black is beautiful అని ఒక నినాదం తలెత్తి చాలాకాలమే ప్రాచుర్యంలో ఉండింది కూడా.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నా సందేహం శిల్పం తెల్లదనం గురించి కాదు . బొమ్మ
  నచ్చి టపాలో వేసుకున్నా నంతే . అర్జైనుడు నిస్సందేహంగా
  నలుపే . సందేహ మెక్కడంటే , అర్జున అనే పేరు విషయంలోనే .
  అందునా , ఆయనకు ఇష్టమైన రథ - గజాదుల వర్ణాలు కూడా
  తెలుపేనాయె . గుంజాటన యేమీ లేదు , తెలుసు కుందామనే .

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఒక క్లూ దొరికిందండి.
  కవిత్రయ భారతం ఆదిపర్వం పంచమాశ్వాసం నెం.123లో ... అర్జునుడు జన్మించిన సందర్భంగా ఆకాశవాణి “ఇతడు కార్తవీర్యునికన్నా వీరుడు కావటంచేత అర్జునుడు అనే పేరు వహిస్తాడు” అని పలుకుతుంది. వేయిచేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు రావణుడి సమకాలీనుడు, మహా పరాక్రమవంతుడైన చక్రవర్తి అన్న సంగతి తెలిసినదేగా.

  దీన్నిబట్టి చూస్తే .. పాండవ అర్జునుడి పేరు ఒక వీరుడుకి సంబంధించినదనీ, శరీరపురంగుకు సంబంధం లేదనీ .. తెలుస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నిజమే ,
  నరసింహరావుగారూ ,
  ఇప్పుడు సందేహం తొలగింది . అందుకే అన్నారు .
  పెద్దల సాహచర్యం ప్రయోజనకరమని .
  ఎంతసేపూ అర్జున నామకరణ సందర్భం తెలుసుకోకుండా
  తల పగులకొట్టుకున్నాను . ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు