సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, జూన్ 2019, ఆదివారం

వైద్యో నారాయణో " హరీ " !


        గురువునూ , వైద్యుణ్ణీ దైవంగా భావించే కర్మభూమి మనది . వైద్యో నారాయణో హరి :   అని కదా ఆర్యోక్తి . అందువల్ల డాక్టర్లందరికీ పాదాభి వందనాలు .

          పూర్వం విద్యా- వైద్యం రెండూ సామాజిక అత్యావశ్యకాలుగా గుర్తించి సంస్థలూ , దాతలూ , ప్రభువులూ ఉదారంగా అవసరమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసి ఉచితంగా అందించేవారు . నేడు మన కర్మ కొద్దీ మనచేత ఎన్నుకొన్న మన ప్రజా ప్రభుత్వాలు మాత్రం విద్యనూ , వైద్యాన్నీ వ్యాపార వస్తువులుగా మార్చి ఖరీదయిన అవసరాలుగా చేశారు .

           ఇక అసలు విషయాని కొస్తే -----

నాకు చాలా రోజులుగా ఎడమవైపున కడుపులో మంటగా ఉంటుండేది . ఒకటి రెండు సార్లు డాక్టర్లు ఎండోస్కోప్ చేయించి అల్సర్లేవీ లేవన్నారు . ఒక డాక్టరు మాత్రం ఎండోస్కోప్ లో కనిపించక పోయినా పెప్టిక్ అల్సర్ ఉంది

మీకు అని ఒక కోర్సు మందులు రాయడం , వాడడం , ఉపశమించడం జరిగింది .

            మళ్ళీ ఈమధ్య కని పించే సరికి  - హైదరాబాదులో ఉన్నాంకదా అని – మహానగరంలో పేరొందిన

ఏకైక పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో చూపించి బాధనుండి పూర్తిగా విముక్తి పొందాలని ఆశ పడ్డాను .

            ఖాళీ కడుపుతో ఒకరోజు ఉదయాన్నే ఆరింటికి హాస్పిటల్ చేరుకున్నాను . అప్పటికే రిజిష్ట్రేషన్ కౌంటర్

వద్ద చాలా మంది గుమి గూడి ఉన్నారు . ఫీజు చెల్లించి నేనూ రిజిష్టర్ చేయించు కున్నాను . హాల్లో వెయిట్ చేయమన్నారు . తొమ్మిది కావస్తోంది . హాస్పిటలంతా హడావిడి మొదులైంది . సందర్శకులతో , సిబ్బందితో క్రిక్కిరిసి

సికిందరాబాదు రైల్వే ష్టేషన్ లా కనువిందు చేస్తోంది .

           ఈలోగా హాల్లో ఉన్న మైక్ లోంచి చెకింగ్ బ్లాకు లోకి ఆహ్వానిస్తూ కొన్నిపేర్లు ఎనౌన్స్ చేశారు . నాపేరు కూడా ఉండడం గమనించి వెళ్ళాను . ఒక్కో చిన్న చిన్న కేబిన్ లోకి ఒక్కొక్కర్ని పంపించారు . చెకప్ డాక్టర్ రావడంతో

నేను నా గోడు వెళ్ళబోసుకోవడం మొదలెట్టాను . ఆయన విటున్నాడో లేదో నాకయితే అర్థం కాలేదు . చిట్టీ మీద

రాసుకుంటూ పోతున్నాడు . అంతా ఒక్కనిమిషంలో అయిపోయింది . ఆ చీటీ నాకిచ్చి క్యాష్ కౌంటర్ కెళ్లమన్నాడు .

            కౌంటర్లో బిల్ వేసి రు.7900 – కట్టమన్నారు . నేనంత పైకం తీసుకెళ్ళ లేదు . కార్డుంది . తీసిచ్చాను .

పైకం జమ చేసుకుని , ఎండోస్కోపీ యూనిట్ కెళ్ళమన్నారు . ఎండోస్కోపీ తదుపరి , బ్లడ్ శాంపిల్ యూనిట్ ,

అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు దాటింది . ఇంకా కొలనో స్కోప్ మిగిలే ఉంది . అప్పటి వరకూ

ఏమీ తిన లేదు , తాగలేదు . ఖాళీ కడుపే . ఓరి దేవుడా ఏమిటీ ఖర్మ అనుకుంటూ కొలనోస్కోప్ కోసం విచారించాను .

             హాస్పిటల్ మందుల షాపు చూపించి కొలనోస్కోప్ కిట్ కొని తెమ్మన్నారు . మంచినీళ్లు లీటర్ బాటిళ్ళు

రెండు కొనమన్నారు . కిట్ లోని టాబ్లెట్ మింగించినారు . ఒక్కొ లీటర్ లో రెండు పొట్లాల పౌడర్ కలిపి అరగంటకోసారి

తాగమన్నారు . అరగంట తర్వాత మోషన్స్ మొదులౌతాయి . పది పన్నెడు సార్లు మోషన్స్ తరువాత రండి . సెకండ్ ఫ్లోర్ లో కెళ్లండి . అంతా అర్థమౌతుంది . సాయంత్రం ఐదు తర్వాత కిందికి రండి అన్నారు .

            అన్నీ సిధ్ధం చేసుకుని సెకండ్ ఫ్లోర్ చేరే సరికి మిత్రులు ఆడా మగా చాలా మందే ఉన్నారు . నేనూ వారితో చేరి నరకంలో విహరించాల్సి వచ్చింది ఐదు వరకూ .

            కొలనో స్కోపీ యూనిట్ లోకి వెళ్లి టెస్ట్ పూర్తి చేసుకుని బయట పడే టప్పటికి ఏడయ్యింది .

రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకునే సరికి ఎనిమిదయ్యింది . అన్నీ నార్మల్ రిపోర్ట్స్ .

            పది పన్నెండు మందిని ఒక్కో డాక్టర్ కేబిన్ కు తీసుకెళ్ళారు . డాక్టర్ సహాయకుడు మాఫైళ్ళు

తీసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఒక్కొక్కర్నీ డాక్టర్ వద్దకు పంపిస్తున్నాడు .

            నేను వెళ్ళే సరికి డాక్టర్ ఫోనులో మాట్లాడు తున్నాడు . నేను వెళ్ళి నిలబడ్డా . ఉలుకూ పలుకూ లేదు .

నిలబడే ఓపికలేదు . వయసా అరవై మూడు . రోజంతా ఉపవాసం . పైగా కొలనోస్కోప్ ప్రిపరేషన్ కోసం పది పన్నెండు సార్లు .......

            ఫోను సంభాషణ పూర్తయినట్లుంది . ఫైలందుకుని డాక్టర్ ఏదో రాస్తున్నట్లనిపించి , నేను నాగోడు

వెళ్ళబోసుకుంటున్నాను . వింటున్నట్లు లేదు . విన్నట్లు లేదని మళ్ళా మొదలెట్టేను . మందులు రాశాను కదా  అన్నాడు , ఇక వెళ్లమన్నట్లు చూచి . బెల్ కొట్టేడు , ఇంకొకర్ని పంపమని .

           తీరా ఏమి రాశాడా అని చూస్తే , పది మందుల పేర్లు టైప్ చేసిన ఒక స్లిప్ నా ఫైల్లో అంటించి ఉంది .

పేర్లకు ముందున్న బాక్స్ లలో ఈయన గారు సింపుల్ గా టిక్కులు కొట్టేడు . నాకేమనిపించిందంటే అసిస్టెంట్

మందుల స్లిప్పంటించడం , డాక్టర్ టిక్కులు కొట్టడం తప్ప వీళ్లకే అధికారాలూ లేవేమో అని .

           అంటే ఈ పేరు మోసిన హాస్పిటల్లోకి అడుగిడితే మనంచెప్పేది అస్సలు వినరు . అక్కడున్న దాదాపు

అన్ని టెస్టులూ వాయించేస్తారు . మందుల చీటీలు ముందే అంటించి మందులు అమ్మేసుకుంటారన్నమాట .

           ఏమిటో అంతా మాయాజాలం . మరి రోగం కుదిరిందా అంటే , కుదిరితే ఈ సోదంతా ఎందుకూ .

జాలంలో చిక్కుకుంటే గాని తత్త్వం బోధపడదు కదా !

                          వైద్యో నారాయణో ‘ హరీ ‘   -  అని సరిపుచ్చుకుందాం . 

13 వ్యాఖ్యలు:

 1. మీరీ పోస్ట్ ఇదివరలో ఎప్పుడన్నా వ్రాశారా? చదివాననిపిస్తోంది 🤔. నేనే పొరబడుతున్నానేమో లెండి.

  హైదరాబాద్ లో మీరు దర్శించిన ఆ హాస్పిటల్ పేరు నేను ఊహించగలను (99%).
  చాలా వైద్యదుకాణాల్లో (వైద్యశాలలు అనడానికి నాకు మనస్కరించడం లేదు) ఇదే తంతు నడుస్తోంది. అన్ని పరీక్షలూ చేయిస్తారు (వేరే చోట చేయిస్తే ఆ రిపోర్టులను కన్నెత్తి కూడా చూడరు), చివరకు అంతా నార్మల్ గానే ఉందంటారు. ఆ తరువాత చాంతాడంత మందుల లిస్ట్ వ్రాస్తారు .... ఆ మందులు వారి దుకాణానికి అనుబంధంగా ఉన్న మందులషాపులో మాత్రమే దొరకడం మరో చిత్రం. ఎందుకిన్ని టెస్టులు అంటే నార్మల్ గానే ఉందో, ఏదన్నా సమస్య ఉందో తెలుసుకోవడానికే టెస్టులు అంటారు. పైగా నార్మల్ గా ఉంటే సంతోషించక సణుగుతారేమిటి అంటారు. మరి నార్మల్ గానే ఉంటే మళ్ళీ షాపింగ్ లిస్టంత ప్రిస్క్రిప్షన్ ఎందుకు వ్రాస్తారో? అసలు సమస్య ఏమిటో పేషెంట్ కు / కూడా వెళ్ళినవారికి వివరించరు. అంతా మాయ, వ్యాపార మాయ. రోగనిర్ధారణ చెయ్యడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడం తప్పు లేదు, కానీ దాన్ని వాడుకుని వ్యాపారం చెయ్యడం పేషెంట్ ని పీల్చి పిప్పి చెయ్యడం నీతిమాలిన పని. జనాల గోడు వినేదెవరు?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. VNR సార్ ,
   మీరూహించింది కరక్టే . ఈరోజు ఈటీవీలో సదరు నం.1 గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (వారు మా నెల్లూరీయులే లెండి)
   పరిచయ కార్యక్రమం వెలువడితేనూ , వారి సేవాదృక్పథం
   విని , తరించి , గత అనుభవం మళ్ళీ గుర్తు చేసుకోవ
   డమైసది .ధన్యవాదాలు .

   తొలగించు
  2. // "వారి సేవాదృక్పథం" //

   అయ్యో, కాదుటండీ మరి 🙄? అందునా పద్మ పురస్కార గ్రహీత కూడానయ్యే ☝️.
   వైద్యాన్ని అనవసరంగా వ్యాపారంగా మార్చే నిషా ఎక్కడానికి ఏ జిల్లావారైనా మరొకరికి తీసిపోరు కదా మాస్టారూ. అంతటా వ్యాపించిన జాడ్యం.

   తొలగించు
 2. ఆరోగ్యసమస్యేమీ లేకపోవడం / వైద్యుడు సరిగ్గా కనిపెట్టలేకపోవడం ... ఒక విదేశీ జోక్ గుర్తొచ్చింది. ఇక్కడ చెబుతాను, ఏమనుకోకండి. సరదాగా తీసుకోండి.
  ----------------------
  సూటూ బూటూ పెద్దమనిషి ఒకతను వైద్యుడిని కలిసి ... డాక్టరు గారూ, నాకు మెడ దగ్గర బిగదీసినట్లుంటోంది, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటోంది, చెవుల్లో గింగురుమన్నట్లుంటోంది ... అని చెప్పుకుంటాడు. డాక్టర్ చూసి, పరీక్షలెన్నో చేయించి, అయినా అంతుబట్టక, మీకు ఓ అరుదైన జబ్బు పట్టుకుంది, ఓ మూడు నాలుగు నెలల కన్నా బతకరు అని చేతులు దులిపేసుకుంటాడు. సరే ఎక్కువ కాలం బతకను కదా, మిగిలిన జీవితాన్ని పూర్తిగా జల్సాగా గడిపేద్దాం అనుకుంటాడా పెద్దమనిషి. వెంటనే తన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం డ్రా చేస్తాడు. ముందస్తుగా మంచి సూట్లు కుట్టించుకుంటాను అనుకుని టెయిలర్ వద్దకు వెడతాడు. చొక్కా కోసం కొలతలు తీసుకుంటూ కాలర్ 16 అని తన అసిస్టెంట్ తో అంటాడు టెయిలర్. ఈ పెద్దమనిషి .. నో నో, కాలర్ 15 చాలు ... అంటాడు. కాదు సర్, 16 అయితే బాగుంటుంది అంటాడు టెయిలర్. నో నో, నేనెప్పుడూ కాలర్ పదిహేనే వాడతాను అంటాడు ఇతను. అప్పుడు టెయిలర్ అంటాడు గదా ... మీ ఇష్టం, కానీ కాలర్ 15 వాడి దానిపై టై కట్టుకుంటే ... మెడ దగ్గర బిగదీసినట్లుంటుంది, ఊపిరి తీసుకోవడం ఇబ్బందనిపిస్తుంది, చెవుల్లో గింగురుమన్నట్లుంటుంది ... అంటాడు 😀😀.

  ప్రత్యుత్తరంతొలగించు


 3. లక్కాకుల వారు కార్పొ "రేటు" ఆస్పత్రి కెళ్ళి‌ జేబులు ఖాళీ చేసుకునేంత అమాయకులను కోలేదు నేను !!!


  కష్టేఫలి వారితో మాట్లాడండి . ఇంటి వైద్యం చిట్కాతో సరిపోయేటట్లు‌ చేస్తారు.


  కార్పొ రేటుమాయ కాటువేయు కవిరాట్
  వలదు వెళ్ళ వలదు వాటి కాడ
  ఇంటి వైద్య మేను నింతసుఖమ్మగు
  విశ్వదాభిరామ వినుర రాజ!


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. జరయు రుజయు జోడి జతగూడ మతిమాలి
  కార్పొరేటు కెళ్ళు కర్మ బట్టె
  లాగిరి పదివేలు రోగ మెట్టి దటులె
  రోదనమ్ము మిగిలె ఖేద మొదవె .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మాష్టారు! ఇప్పుడు మీకు కులాసాగా వుందని అనుకుంటూ, ఇంకెప్పుడూ బావుండాలని కోరుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. లలితా TS గారూ ,
  పర్లేదు , మీ ఆదరాభిమానాలకు కృతఙ్ఞతలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 7. గత అనుభవం గురించి వ్రాసారా. చదువుతున్నప్పుడు ఇప్పటిదే అనిపించింది. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
  కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళితే లేనివి ఉన్నాయమోనని అనుమానం వస్తుంది. వెళ్లకుండా ఉండలేము. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా వారు అక్కడికే రిఫర్ చేస్తున్నారు. ఇదో వలయం. .......... మహా

  ప్రత్యుత్తరంతొలగించు
 8. బులుసు సుబ్రహ్మణ్యంగారూ ,
  ధన్యవాదాలు మరియు నమస్సులు సార్ ,
  " కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళితే లేనివి ఉన్నాయమోనని అనుమానం వస్తుంది "
  ఇక్కడ రివర్సయ్యిందిసార్ ,
  పెప్టిక్ అల్సర్ నయంచేసుకోవడానికి వెళ్తే , పదివేల దాకా
  ఖర్చు పెట్టించి , నే చెప్పేది అస్సలు వినలేదు సరికదా , అంతా నార్మల్ అని పంపేశారు , మాయరోగం ఎప్పటి లాగే .

  ప్రత్యుత్తరంతొలగించు

 9. పెప్టిక్ అల్సర్ : కొంచెం అవగాహన

  Disclaimer / పాఠకులకు గమనిక :- పైనిచ్చిన లింక్ గూగుల్ లో దొరికిన సమాచారానికి లింక్.. ఇక్కడ ఈ లింక్ నిచ్చినది పాఠకులు ఒక అవగాహన ఏర్పరుచుకోవడానికి మాత్రమే. స్వంత వైద్యం చేసుకోవద్దు. డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.

  ప్రత్యుత్తరంతొలగించు