సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఉగాది శుభాకాంక్షలు



చెఱకు గడకు మావి చిగురుటమ్ము దొడిగి
పుడమి నాట విడిచె పోకి రొకడు
ప్రకృతి రమణి తనువు పరవశించి యిలకు
నవ వసంత శోభ లవతరించె .

సంఘటితం కండి




సంఘటితం కండి
---------------------
బలిజలు  పుట్టుకన్  విమల పావని గంగకు సోదరుల్ , మహా
బలి తల కెక్కి త్రొక్కిన శుభంకర విష్ణు పదోద్భవుల్ , ధరా
విలసిత జాతి , విద్యల వివేకములన్ కడు ఖ్యాతి గాంచి , భూ
తలమున ప్రాభవమ్మొలుక తాము వసించిరి శౌర్యవంతులై .

రాయల రాజ్యలక్ష్మి గత ప్రాభవ మంతయు కాపుజాతితో
శ్రేయము బొంది యున్నతికి జేరెను , కాపుల ధైర్యసాహసాల్
సాయము గాగ  గెల్చెను విశాల ధరాస్థలి రాయ భూపతుల్ ,
ధీయుతులై చరిత్ర నినదింపగ వెల్గిరి కాపు సోదరుల్

తెలుగుల సాంస్కృతీ విభవ దీప్తులు - కాపుల శౌర్య విక్రమో
జ్జ్వల ఘన కీర్తి జన్యములు - సంగర రంగము నందుగాని , శ్రీ
విలసిత కాంతిమత్ విపణి వీధుల యందున గాని , వేష భా
షల లలితేందిరా కళల చాయల గాని , చరిత్ర గాంచినన్ .

కుజన రాజన్యుల కుత్తుకల్ గోసిరి
రాయల సంగ్రామ రాజియందు
మణి మయ భూషణ వణిజులై వెలిగిరి
దేశ దేశాల సందీప్తి మెరయ
వేష భాషల కీర్తి వెలుగొంద నిలిపిరి
సాంస్కృతీ వైభవోజ్జ్వలత గదుర
పేద సాదల కింత పెట్టిరి కడుపార
దాన దయా గుణ జ్ఞాను లగుట

శౌర్య విక్రమ ధిషణాది చతురతలును ,
వేష భాషలు , సంస్కృతీ విభవములును
కాపు వర్గాల పెన్నిథుల్ , కలసి రండు ,
సంగరము సేయ , ఎన్నిక రంగ మందు .

తెలగలు , వొంటరుల్ , బలిజ ధీరులు , కాపులు తెల్గు నేలపై
గలరు విశేష సంఖ్యల , సకాలములో తమ శక్తి జూపి , ఈ
మలినపు రాజకీయమును మట్టున బెట్ట మహోగ్ర మూర్తులై
తెలుగు ధరాతలమ్ము వినుతింపగ సంఘటితమ్ము కావలెన్ .

ఇతరుల కాళ్ళవద్ద యసలేల పడుండగ ? , రోష శౌర్య సం
వృతమతులై , స్వయం జ్వలిత వేగ సుసంఘటి తాంతరాత్మతా
స్తుతిమతులై , వినూత్న గతి , వంచకులన్ దిగద్రొబ్బి , భ్రాతలై
సతతము రాష్ట్ర పాలనకు సందడి సేయుడు రాజ్య కాంక్షతో .

ఇదె సమయమ్ము - కాపు విజయేందిర ఆంధ్రప్రదేశ రాష్ట్రమం
దుదయము నొందు దాక , పునరున్నతి బొందెడు దాక , కృష్ణరా
య ధరణి నాధు ప్రాభవ మహా మహనీయత లొప్పు దాక ,  సం
విధ సముదైక్య సంఘటిత వేదిక గావలె కాపు వర్గముల్ .

31, మార్చి 2019, ఆదివారం

మంచి ప్రజాప్రతినిథులను ఆశించడం అత్యాశే .

ఓటు హక్కు గురించీ  – దాన్ని వినియోగించుకోవడం గురించీ అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు మేధావి .
         “ ఓటు హక్కు ప్రతి పౌరునికీ రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం . పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తీ ఓటరుగా నమోదు కావాలి . ప్రజాస్వామ్య సూత్రానికి ఓటు మూల స్థంభం . ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్న దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది . పౌరులందరూ ఎన్నికలలో విథిగా ఓటు హక్కును వినియోగించు కోవాలి ......
        సదరు మేథావికి భారత రాజ్యాంగం గురించీ - పౌరహక్కులూ విధుల గురించీ క్షుణ్ణంగా తెలుసు . మీదుమిక్కిలి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి పరితపించే మనస్తత్వం .
       నిజమే . ఓటు హక్కు వజ్రాయుధమే . అయితే ఓటరు చేతిలో ఉన్నప్పుడు కాదు . ఓటరు చెయ్యిదాటి నేతకు చేరినప్పుడు . అవినీతికి చేరువైనప్పుడు . ఇదీ ప్రస్తుతం జరిగే ప్రజాస్వామ్య ప్రహసనం .
        రాజకీయ పార్టీలు రెండో మాట లేకుండా అంగబలం అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి    దించుతాయి .  ఎన్నిఅకృత్యాలు చేసయినా గెలవగల సత్తా ఉండడమే అభ్యర్థిత్వానికి ముఖ్య అర్హత .  అవినీతి మలికి అంటని స్వఛ్ఛత– సేవాతత్పరత , నిరాడంబరత , సంస్కారం – ఇలాంటి ట్రాక్ రికార్డు అవసరం   లేదు.  
రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థిత్వాలు ఇలా ఉంటే ఎవరికి ఓటెయ్యాలి . ఎవరికి ఓటేసినా అది
గెలిచిన వాడి చేతికి వజ్రాయుధాన్నిచ్చినట్టే . వాడు దాన్ని ప్రజలనూ  ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నాడు . ప్రజాధనం దోచుకుంటున్నాడు .
         పూర్వం న్యాయవాద విద్యనభ్యసించిన వారే ఎక్కువగా రాజకీయాలలోకి వచ్చేవారు . రాజకీయాలలోకి వచ్చిన ఇతరత్రా వారికి కూడా ప్రజాసేవ పట్ల నిబధ్ధతా , అవినీతి ముద్ర పడుతుందేమోననే జంకూ ఉండేది . 
నేడు అధికారం కోసం నేతలు పడే తహ తహ చూస్తూ ఉంటే ఎలాంటి జంకూ గొంకూ కనబడడం లేదు . కేవలం దాహం తప్ప .
        బడా కాంట్రాక్టర్లూ , బడా పారిశ్రామిక వేత్తలూ , లిక్కర్ కాంట్రాక్టర్లూ , చివరకు గూండాలూ రౌడీలూ కిల్లర్లూ
రాజకీయ నేతల అవతారమెత్తి అధికారం కోసం తహతహలాడడం ప్రజాసేవ కోసమే అనుకోగలమా ?
దీన్ని ప్రజాస్వామ్యమని మభ్యపెట్టుకొనాల్నా?   మేథావుల సలహాను పాటించి  ఉన్నంతలో మెరుగైన అభ్యర్థికి        ఓటేసి చేతులు దులుపుకో వలసిందేనా ?  మరేదైనా పరిష్కారం ఆలోచించవలసి ఉందా ?
       అసలీ రాజకీయ పార్టీలవ్యవస్థను నిషేధించాలి .  అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగాలి . నామినేషన్ దశ లోనే  సమగ్ర పరిశీలనద్వారా  వివిథ అంశాలలో  అభ్యర్థిత్వాన్ని మదింపు వేసి  పోటీ చేయడానికి అర్హతను నిర్థారించాలి . ప్రచారార్భాటాలనూ కోట్లాది రూపాయలు వ్యయం చెయ్యడాన్నీ నిషేధించాలి .  స్వయంగా గాని
మీడియా ద్వారా గానీ  ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నియోజక వర్గ ఓటర్లను కలిసి అభ్యర్థించడం మాత్రమే
చేయాలి . పోటీలోని అభ్యర్థులంతా వడకట్టబడిన మంచి అభ్యర్థులైనప్పుడు గెలుపొందిన అందరూ ప్రజాసేవకుపక్రమించడాన్ని అనుమానించవలసిన అవసరముండదు .
       ఎన్నికలు పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలుపొందిన ప్రజాప్రతినిధులంతా ముఖ్య మంత్రిని         ఎన్నుకోవడం , ముఖ్యమంత్రి మంత్రులను ఎన్నుకోవడం – ఈ విధంగా పార్టీ రహిత ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసుకోవచ్చు . 
       ఇలాంటి ఏదైనా మంచి ఎన్నికల సంస్కరణ అమలై   మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఏర్పడి నప్పుడు తప్ప    ఇప్పుడున్న రాజకీయ పార్టీల వ్యవస్థలో మాత్రం   మంచి ప్రజా ప్రతినిధులను ఆశించడం , ప్రజాధనం దోపిడీని నివారించడం  అత్యాశే అవుతుంది .