సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, డిసెంబర్ 2012, ఆదివారం

ముక్కోటి దేవతా మూర్తీ ! శ్రీ సాయి నాథా !

శేష నగము జేరి చెలు వార కొలువైన
వేంకటేశ్వరుడవు వెలయ మాకు
కలల పంటవైన యిల వేల్పు నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

తిరుమ లేశు నెదను దీటు గా కొలువైన
అమ్మ- త్రిభువనాల కండ దండ
పరమ సాధ్వి యైన పద్మావతియె నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

తాను విశ్వ మందు తన యందు విశ్వమ్ము
" తామరాకు నీరు " తనరు భంగి
వెలయు విష్ణు రూప ! విశ్వావనీ నాధ !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

పసిడికి నిలువెల్ల భాసురంబగు కొల్వు
శ్రీకరముల నెలవు చిత్త మెల్ల
సిరులు రూపు దాల్చు శ్రీలక్ష్మి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

సకల శుభము లిచ్చి సాయుజ్యముల నిచ్చి
సగము తనువునిచ్చి సత్కరించు
భక్త సులభు డైన పరమేశ్వరుడ వీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

అరయ ప్రాణికోటి కాహార మిచ్చేటి
అమ్మ – త్రిభువనముల కన్న పూర్ణ
సర్వ మంగళ , శుభ , శర్వాణి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

విశ్వ స్రస్ట తాను విశ్వమ్ము సృజియించి
మొదలి జన్మలరసి విధి లిఖించె
బ్రహ్మ నీవె పరమ బ్రహ్మమ్ము నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

వరలు దేహమెల్ల వాగర్ధ విభవమ్ము
భావ సంపదల ప్రభావ మయము
ఎరుక రూపు దాల్చు పర శారదే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

రామ నామ మధుర రస ధార సేవనా
నంద మహిమ లెన్న నాతరంబె
సాయి రాము డనగ సర్వోన్నతుడ వీవె
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

శ్రీ రాము పత్ని , జనకజ ,
గారాముల భూమి పుత్రి , కమనీయ ,దయా
వారాశి , సీత నీవయి
కారుణ్య రసాబ్ధి దేల్చి కావర సాయీ !

శ్రీరాము బంటు , అంజని
గారాముల కూర్మి సుతుడు , కరుణాంబుధి , మా
కారాధ్యు డైన మారుతి
నీరూపున గాంచు వరము నియ్యర సాయీ !

పూర్వాద్రి రూప ! పశ్చిమ
పర్వత రూపాయ ! తే నమామి – యటంచున్
సర్వేశుడవగు దినకరు
సర్వోన్నత మూర్తి ! నీకు సన్నుతి సాయీ !

తివిరి భూజనులకు దేదీప్య మానమై
వెలుగునిచ్చి బ్రోచు వేద వేద్య !
తిమిర సంహరణకు దీప్తి నీవేనురా !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

చలన రధము నీవు సారధి యును నీవు
కొదమ గుర్రములును రధియు నీవు
చరమ పధము నీవు చైతన్యమే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడిరాజ !

మదిని నిన్ను బెట్టి మొదలిడి నట్టి యే
కార్య మైన సఫల కారియగును
యింత కన్న జనులు యేమి కోరేరు రా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

2 కామెంట్‌లు:

  1. ముక్కోటి దేవతా మూర్తీ ! శ్రీ సాయి నాథా !

    శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

    సాయి స్తుతితో మనస్సంతా సాయిమయం చేశారు మాస్టారు గారు.

    రిప్లయితొలగించండి
  2. విశ్వమంతా సాయి మయం భారతి గారూ !
    ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి