సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, డిసెంబర్ 2012, శనివారం

తెలుగు - వెలుగు


                          నలు చెఱంగుల తెలుగుల నాల్క లందు

                          తెలుగు వెలుగులు వెల్లువై – తెలుగు బాష

                          తేజ రిల్లును గాత  !  సందియము లేదు ,

                          మాతృ భాషకు వందన మాచ రింతు .

 

          దక్షిణ భారతీయ భాషలలో తెలుగు మథురమైన భాష . సంస్కృతంతో మిక్కుటముగా మమేకమై తెలుగు

దక్షిణాది భాషల కంటే విలక్షణమై భాసిల్లుతూ ఉంది .

          పద , వాక్య నిర్మాణాది భాషా లక్షణాలలో తన సహజ సౌరభాన్ని నిల్పుకుంటూనే సంస్కృతం , ఉర్దూ ,

ఆంగ్ల పదజాలంతో పరి పుష్టమై వికసిస్తూ , నిరంతరం భాషా స్రవంతిగా కొన సాగుతూనే ఉంది .

          పద నిర్మాణంలో తనకు మాత్రమే సొంతమైన అజంత మాథుర్యాన్ని తనలో కలగలసిన పరభాషా పదజాలానికి కూడా అద్ది , సుమథుర రుచిరం గావిస్తున్న తెలుగు భాష సహజ సౌందర్యం కొనియాడ దగినది .

         తెలుగు బ్రష్టు పట్టి పోతోంది . కను మరు గయ్యే ప్రమాదం ఉంది . ఉధ్ధరించ వలసి ఉంది . “ – ఇలాంటి మాటలు ఈమథ్య తరచుగా విన వస్తున్నవి .  ఈ నెల ఇరవయ్యొకటిన ప్రపంచం అంత మవుతుందన్న అసంబధ్ధ

జ్యోతిషాలలో వాస్తవం లేనట్లే పై మాటలలో కూడా నిజం లేదు .

            తల్లి భాషలో భావ వ్యక్తీ కరణ సుళువుగానూ విస్పష్టంగానూ ఉంటుందనడంలో సందేహం లేదు . నేడు

మనం మాటాడే తెలుగులో సంస్కృత పదజాలం ఎక్కువ . తెలుగేదో సంస్కృత మేదో గుర్తించ లేనంతగా కలగలసి

తెలుగు భాష కొన సాగుతూ ఉంది .

             సంస్కృత భాషా ప్రభావం మన భాషపై ఎక్కువ . ఒక విథంగా తెలుగు పరి పుష్టం గావడానికి ఈ ప్రభావం దోహదం చేసింది . ఐనా , ఇప్పుడు మనం మాటాడే సంస్కృత పదానికి అర్థంలో సరి తూగే తొలి తెలుగు

పదాలు ఈ ప్రభావం వల్ల వాడుక నుండి తప్పుకున్నవి . కారణం , మన పండితులకూ కవులకూ పండిత – కవి పోషకులకూ సంస్కృతం మీద ఉన్న మక్కువ . ఈ మక్కువ వల్ల తుదకు తెలుగు పేర్లు కూడా సంస్కృతీకరింప బడి , అసలేదో కొసరేదో గుర్తించ లేని స్థితి ఏర్పడింది . ఇది కొంత వరకు తెలుగు భాషకు ఇబ్బంది తెచ్చింది .

              తెలుగు కవులలో తిక్కన , వేమన , గురజాడ లాంటి కవులు కొంత మంది – కృష్ణ రాయలు , రఘునాథ – విజయ రాఘవ నాయకుల లాంటి కొంత మంది కవి పోషకులు తెలుగుపై మమకారంతో ఆనాటి

వాడుక లోని తెలుగు మాటలను తమ రచనలలో సింహ భాగం వాడి తెలుగు వెలుగులు విర జిమ్మినారు .

వారికి తెలుగు జాతి సదా ఋణ పడి ఉంటుంది .

               గ్రామీణుల నోళ్ళలో  నేటికీ తొలినాటి తెలుగు పదాలు వాడుకలో ఉన్నవి . పుట్టుకకు దగ్గరగా , ఎక్కువ మార్పులకు లోనుగాకుండా , పరిపూర్ణ భావ వ్యక్తీ కరణ సమర్థత గల్గి జాన పదుల నోళ్ళలో నేటికీ

ప్రాచీన తెలుగు పదజాలం అలరారుతూ ఉంది .

                కానీ , మన దౌర్భాగ్యం ఏమిటంటే మన పండితులూ కవులూ వీటిని గ్రామ్యాలంటారు . అసాథువు లని పేరు పెడుతారు . వ్యాకరణ విరుధ్ధాలని కొట్టి పారేస్తారు . మాటాడుటకు తప్ప రచనలో వినియోగించుట నేర మంటారు .

                దరిమిలా , మనకు గ్రాంథికం – వ్యావహారికం అనే రెండు సమాంతర భాషలు ఏర్పడ్డవి . ఏమిటో  మరి ! సహజ సౌందర్యం ఉట్టి పడే గ్రామీణ తెలుగు పదాలు పండితులకు పంటి కింద రాయిలా బాధిస్తుండడం చూస్తే మన నెత్తిన సంస్కృత ప్రభావం ఎంత ఎక్కు పడిందో తెలుస్తోంది కదా !  

                  ఇంతకీ నేను విన్న వించు కునే దేమిటంటే ,  తెలుగా , సంస్కృతమా , ఉర్దూనా , ఇంగ్లీషా తదితరమా  అనే తేడా మానుకొని  తెలుగు మాటాడే టప్పుడు గాని , వ్రాసే టప్పుడు గాని  -

భావాన్ని విస్పష్టంగా వ్యక్తీకరించడానికి  తెలుగు వాడుకలో కలగలసి పోయిన  అత్యంత సమర్థ మంతమైన  

ఏ పదాన్నయినా వాడండి . తెలుగు భాషను పరి పుష్టం చేయండి .

                భాష పరిణామ శీలి . నిరంతర శ్రోతస్విని . దీన్ని గుర్తించిన వారు భాషా వికాసానికి తోడ్పడి నట్లే .

మడి కట్టు కున్న వారు తెలుగు చెడిపోతుందన్న బ్రమలో పడి భాషకు తామెంత నష్టం చేస్తున్నారో ఎన్నటికీ గ్రహించ లేరు .

                 జన బాహుళ్యం నాలుకల మీద నాట్యమాడే ఏ భాషా అంతరించదు .

                 పిడికెడు మంది పండితుల వ్యవహారంలోని భాష లెప్పుడూ మనుగడ సాగించిన దాఖలాలు లేవు .

 

 

                 

5 వ్యాఖ్యలు:

 1. జన బాహుళ్యం నాలుకల మీద నాట్యమాడే ఏ భాషా అంతరించదు ... నిజం చెప్పారు మాష్టారుగారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మాష్టారు టపా చాలా నచ్చింది నాకు.
  తెలుగు భాష కొనసాగుతూనే ఉంటుందని నా నమ్మకం కూడా..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భారతి గారూ ,
  ధన్యవాదములు . బ్రౌణు లాంటి ఆంగ్ల పండితులు తెలుగు భాషాభిమానులై గ్రామీణ తెలుగు పదాలను వెలుగు లోకి తెచ్చి భాషా వికాసానికి విశేషమైన కృషి చేసి తెలుగు వారికారాధ్యులైనారు .కాని , మన దురహంకారులు గ్రామీణ తెలుగు మాథుర్యాన్ని గ్రామ్యా లంటూ అపహాస్యం చేయడం బాథాకరం .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. జలతారు వెన్నెల గారూ ,
  విదేశాలలో ఉంటూ , పని ఒత్తిడిని కూడా అధిగమించి మాతృ భాషపై మమకారాన్ని కురిపిస్తూ అనేకానేక సామాజి కాంశాలపై చక్కని అవగాహనతో వ్రాస్తున్న మీకు , మీలాంటి అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు