సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, ఏప్రిల్ 2017, బుధవారం

ఆవకాయ - అమరావతి

ఆవకాయ - అమరావతి
-----------------------------
భక్ష్య లేహ్య చోష్య బహువిథ భోజ్యాల
రుచులు చూచి చూచి రోత పుట్టి
నాల్క తుప్పు డుల్చు నవవిథ రుచి గూర్చి
తపము జేసె నొక్క ధార్మికుండు .

మంగళ గిరి ప్రాంతమునకు
చెంగట దిగి యతడు తపము జేయుచు నుండన్
రంగారు విపిన తలములు
క్రుంగంగా బారె నతని ఘోర తపమునన్ .

తపము బలము నింద్రు తాకెను , తనకేదొ
మూడె ననుచు నతడు ముగ్ధలైన
అప్సరోవనితల నంపె తపము గూల్చ
తలిరు బోడు లటకు తరలి రంత .

ఆమని యరుదెంచె నామ్ర తరువులన్ని
పూప పిందె బట్టి పొలుపు దాల్చె
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .

మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
పప్పునూనె బోసె పరువాల యూర్వశి
రుచికి పడి ఘృతాచి లొట్ట సేసె .

అల్లంత దూరమందున
నుల్లము రంజిల్ల ' ఘాటు ' నోరూరించన్
కళ్లు దెరిచి వెళ్లి తబిసి
యల్లన రుచి చూచి తన్మయత్వము నందెన్ .

కొత్తావకాయ రుచి గని
తత్తర పడి తబిసి తపము ధన్యత గాంచన్
బిత్తరు లందరను గూడి
చిత్తము రంజిల్ల విడిది చేసెను తోటన్ .

పోయిన భామలు రాలే
దేమయినదొ యంచు నింద్ర దేవుడు వెదుకన్
ధీ మహితులు సురలందరు
భూమికి దిగి వచ్చి చూడ ' బొమ్మ ' కనబడెన్ .

తబిసి తలిరు బోళ్లు తనివార కొత్తావ
కాయ రుచులు గొనుచు కన బడి రట
దేవ గణము గూడి దేవాధిపతి గూడ
వచ్చి చేరి రుచికి మెచ్చి నారు .

ఆవ కాయ రుచికి యమరులు పరవశం
బంది స్వర్గ సీమ మరచి నారు
అచటె యుండి పోయి ' రమరావతి ' యనంగ
' నాంధ్ర రాజధాని ' యయ్యె  నేడు .

8 వ్యాఖ్యలు:

 1. అందమైన భామలతో ఆవకాయ! కాన్సెప్ట్ బాగుందనుకుంటానండీ! తెనుగు సినిమాచుట్టెయ్యచ్చేమో :)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ' అందమైన భామలతో ఆవకాయ '
   టైటిల్ బాగుందండీ !
   మరి ,
   ఱావు గారూ వగైరా మిత్ర బృందం
   ఏమంటారో చూద్దాం .

   తొలగించు
  2. ' అందమైన భామలతో ఆవకాయ '
   టైటిల్ బాగుందండీ !
   మరి ,
   ఱావు గారూ వగైరా మిత్ర బృందం
   ఏమంటారో చూద్దాం .

   తొలగించు


 2. మా ఆవకాయ తినిర
  మ్మా యబ్బురపడుచు రంభ మాహేంద్రాదుల్
  ఓయమ్మ తిష్ట వేయగ
  మా యమరావతి పడుసర మయ్యె జిలేబీ :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆవకాయ పద్యమాల - చదవ కనుల "విందు" - వుంది నోరూరించేలా

  ప్రత్యుత్తరంతొలగించు