సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, జూన్ 2014, ఆదివారం

నేల ముక్కలైనా - జాతి యొక్కటే



తెలుగు రాజు లేలి  తెలగాణ మైనది
ఆంధ్ర రాజు లేలి  ఆంధ్ర యయ్యె
రాయ లేలు బడిని  రాయల సీమయ్యె
తల్లి భాష  తెలుగె  తర తరాల

తెలుగులు ప్రాదేశికముగ
తెలగాణా , ఆంధ్ర , సీమ దిశలందున్నన్
తెలుగొకటే భాష గనుక
కలకాలము కలిసి బ్రతుకగా వీలయ్యెన్

నిన్న నేడు గాదు – నేల యున్నంతకు
తెలుగుజాతి  యొకటె -  తిరుగు లేదు
రాజకీయ మెన్ని రంగులు మార్చినా
భాష చాలు మనల పట్టి యుంచ

తెలుగు జాతి మధ్య ద్వేషాగ్ని రగిలించి
గద్దె లెక్కి నారు , కాంక్ష దీరె
ఇంక ఇప్పుడైన ఇక్కడా అక్కడా
సఖ్య మొనరనిండు  జాతి మధ్య

దొరలు రెండు చోట్ల  కరవాలములు దూసి
మాట మాట పెరిగి మనుట కంటె
ఒద్దిక నిరు దెసల వృధ్ధి చేయగ బూని
అన్నిట సహకార మంద మేలు   

4 కామెంట్‌లు:

  1. పని గట్టుకుని ప్రజలమధ్య విద్వేషాలు పెంచుతున్నారని బాధగా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పదవు లెక్కినారు గాన ఇకనుంచైనా ప్రజల గోడు పట్టించు కొంటారని ఆశిద్దాం

      తొలగించండి
  2. చక్కని భావముతో,బల్
    చక్కని సరళోక్తు లలర, సత్కవితను "శ్రీ
    లక్కాకుల" సత్కవి! మది
    నెక్కెడునటు లల్లినాడ వెల్లరు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెచ్చుట మీ గొప్పదనము ,
      మెచ్చువడుట నాయదృష్టమేయగు , నార్యా !
      హెచ్చగు మీరెచ్చట ! నే
      నెచ్చట ? కవితావనిని ఫణీంద్రాచార్యా !

      తొలగించండి