సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

17, జూన్ 2014, మంగళవారం

తెలుగు నేలకూ తెలుగు పద్యానికీ అనుబంధం



పద్యము లన్న నాంధ్రులకు ప్రాణము  ,  పద్యము తెల్గువారి  వై
విధ్య వచో విధాయక ప్రవృత్తి  , నిరక్షర కుక్షియైన  తా
పద్యము జెప్పిగాని తన పల్కు ముగించడు ,  తెల్గు నేలకున్
పద్యముకున్ గలట్టి యనుబంధము లిట్టివి , చూడ ముచ్చటౌ .

మూటలు గట్టి పద్యముల ప్రోవులు వోసిరి -  పల్లెటూళ్ళ 
తేటల తెల్గు మాటలను - తిక్కన పోతన వేమనాదు  లా
మాటలు నేటికిన్ గడు సమాదరణీయములై తెలుంగులో
పాటల యందు పద్యముల పట్టుల వాడుట జూడమే యిటన్ .

చదువుట తోనె భావములు చప్పున దోచగ – పద్యమాలికన్
బొదిగిన రామణీయకపు పొల్పులు దెల్పగ  తల్లి భాషకే
చదురులు గల్గు గాన  - సహజమ్మగు తెల్గు పదాల సొంపులన్
మదికి లయించి వ్రాయు గరిమల్ గల పద్యము లింపు గూర్చెడిన్ .

పద్యమందు , పల్లె పట్టులందు , అచటి
మనుజులందు , వారి మాటలందు ,
అందు తేనెలూరు ఆప్యాయతల తెల్గు
దనములందు తియ్యదనము కలదు .

పట్టణ వాసనలంటని
మట్టిన్ మన పలుకుబళ్ళు మనుచున్నవి – ఆ
పుట్టతెనుగు తేనె పలుకు
పట్టి పిడిచి పద్యమందు వాడగ వలయున్ .

15, జూన్ 2014, ఆదివారం

నేల ముక్కలైనా - జాతి యొక్కటే



తెలుగు రాజు లేలి  తెలగాణ మైనది
ఆంధ్ర రాజు లేలి  ఆంధ్ర యయ్యె
రాయ లేలు బడిని  రాయల సీమయ్యె
తల్లి భాష  తెలుగె  తర తరాల

తెలుగులు ప్రాదేశికముగ
తెలగాణా , ఆంధ్ర , సీమ దిశలందున్నన్
తెలుగొకటే భాష గనుక
కలకాలము కలిసి బ్రతుకగా వీలయ్యెన్

నిన్న నేడు గాదు – నేల యున్నంతకు
తెలుగుజాతి  యొకటె -  తిరుగు లేదు
రాజకీయ మెన్ని రంగులు మార్చినా
భాష చాలు మనల పట్టి యుంచ

తెలుగు జాతి మధ్య ద్వేషాగ్ని రగిలించి
గద్దె లెక్కి నారు , కాంక్ష దీరె
ఇంక ఇప్పుడైన ఇక్కడా అక్కడా
సఖ్య మొనరనిండు  జాతి మధ్య

దొరలు రెండు చోట్ల  కరవాలములు దూసి
మాట మాట పెరిగి మనుట కంటె
ఒద్దిక నిరు దెసల వృధ్ధి చేయగ బూని
అన్నిట సహకార మంద మేలు