సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

3, నవంబర్ 2015, మంగళవారం

" సాయి " _ దేవుడా ? కాదన్న చర్చ యేల ?




శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ
             హితబోధ చేసిన హితు డితండు
రెండు రూపాయల దండి దక్షిణ గొని
             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు
రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి
            తాననుభవించిన త్యాగ శీలి
' సాయి ! కాపాడ  రారా  ' యన్న తక్షణ
            మాదుకొను కరుణామయు డితండు
 
సర్వ దేవతా సత్తాక సద్గురుండు
సాయి నాధుండు –  తమ మనసార కోరి
చరణములు తాకి తరియింత్రు సకల జనులు
శరణు శరణంచు వేడి   ప్రశాంతి బొంద .
                                                                   *****                                                      

 
చాలిక వద్దండి  చాలయెక్కువయింది

గురుస్థాన స్థితులకు కూడని పని

కోటాను కోట్ల భక్తుల మనోభావాల

హననకు దిగకండి  ఆర్తి రగులు

అసలిదేమి ఘనత ?  పస గలదేని _ ప్ర

జా సమస్యలు లేవ ? చక్క దిద్ద

చదువు చెప్పించండి  సంస్థలు నెలకొల్పి

వైద్య మందించండి ఉద్యమించి

పేద వాళ్ళకీరెండె లాభించుగాని
 

" సాయి " _ దేవుడా ? కాదన్న చర్చ కాదు

అసలిదేమి రగడ ? ఆపరా ? యికైన

భరత సంస్కృతి కాదిది పరము లార !

               *****

పాద పూజకుగాని , ప్రవచనాలకుగాని

కానుక లడిగెనా కాంక్షదీర ?

రజిత సింహాసన రాజ భోగాలలో

మనసార తేలెనా తనివి దీర ?

తలకు గెడ్డాలకు తలలోని తలపుకు

నల్ల రంగలదెనా యుల్లమలర ?

ఏసీ గదులు కార్లు వాస యానాలకు

తనివార వాడెనా మనసుదీర ?
 

తిరిగి నాలుగిళ్ళు తెచ్చి భిక్షాన్నంబు

అనుచరులకుబెట్టి యపుడు తినెను

చిరుగుబొంత కట్టి సిరులిచ్చె జనులకు

సాయితోడ మీకు సామ్య మేల ?

 

6 కామెంట్‌లు:

  1. పద్యాలు బాగున్నాయి.

    కొన్ని సూచనలు:
    శ్రధ్ధా , సబూరిలు అన్న చోట విరామచిహ్నం అనవసరం. ద్వంద్వసమాసం కదా, శ్రధ్ధాసబూరీలు అనండి. అలాగే హిత శబ్దం పునరుక్తి ఐనది - ఇట్టివి పరిహరించండి,
    గురుస్థాన అన్నపదంలో రు అనేదు గురువు అవుతుంది 'తల' అనేది ఇంద్రగణం కాదు. ఇలాగే మరికొన్ని ఉన్నాయి. ఇవేమీ ప్రతిబంధకాలు కావుగాని లేకుంటే మరింత సొగసు వస్తుంది పద్యాలకు.

    ఇకపోతే టపా విషయకం. పీఠాధిపత్యం రానురాను అధికారస్థానంగా మిగులుతున్నది కాని గురుస్థానం అన్నసంగతి మరుగున పడుతున్నది. అదీకాక,అ అనకూడదు కాని కొత్తదేవుళ్ళు తామరతంపరగా పుట్టుకు వస్తూ ఉండటం కూడా సనాతనధర్మానికి దెబ్బలు తగిలిస్తున్నది. ఈ బాధతో కొందరు అసహనాన్ని ఆపులేకేకపోతున్నారేమో. ఆకోణంలో కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఏదైనా హిందువుల మెట్టవేదాంతధోరణి - ఏ పుట్టలో ఏ పామున్నదో అన్నట్లు - అదిగో ఈయన దేవుడు అంటే ఇదిగో నా పూజలు అని మనవాళ్ళు ఎగబడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. సాక్షివ్యాసాలలో ఒక తురకాయన జంఘాలశాస్త్రితో, 'మీకు మతిలేదా ఇన్ని దేవుళ్ళేవిటి!?' అంటాడు. పరిస్థితి అచ్చంగా అలాగే ఉంది. ఏది ఏమైనా సరైన విధానంలో వాగ్విలాసం ఉండాలి - కొట్టినట్లు మాట్లాడటం వలన అపార్థాలూ పెడర్థాలూ వస్తాయి తప్ప కార్యం లేదు. గురుస్థానీయులు మరింత సున్నితంగా అభిప్రాయాలను వ్యక్తీకరించాలి తప్ప యుధ్ధోన్మాదంతో వలె మాట్లాడరాదన్నది నిర్వివాదం.

    రిప్లయితొలగించండి
  2. శ్యామలరావుగారూ ,
    తల , యల ? - సాధుత్వాసాధుత్వాల విషయంలో నేనంత పట్టింపులేని వాణ్ణి , ఐనా , సూచనలకు ధన్యవాదములు .
    ఇక , మీరన్న " మెట్టవేదాంతధోరణి " అతి సామాన్యుల విషయంలోనేకదా , ఈ ధోరణికి కారణమెవరు ? ఎరుకగల మేధావులే కదా , జ్ఞానాన్ని భోషాణాలలో దాచుకుని , సామాన్యులను అజ్ఞానపు కటిక చీకటిలో ముంచి , సమాజం మీద పెత్తనం సాగించేరు . అన్నీ మన వేదాలలోనే ..... అంటూ ఇప్పుడేడిస్తే ప్రయోజన మేమిటి ?

    రిప్లయితొలగించండి
  3. సంప్రదాయికకవిత్వం వ్రాయదలచుకున్నప్పుడు దాని పధ్ధతులను కూడా పాటించటం బాగుంటుందని నా అభిప్రాయం.

    మెట్టవేదాంతధోరణికి కారణం ఎరుకగల వారే అనుకోనవసరం లేదని నా ఉద్దేశం. ఒకే గురువునుండి పదిమంది శిష్యులు విద్యను గ్రహించినప్పుడు కూడా వారి వారి సమర్థత కారణంగా కొధ్ధికొద్ది తేడాలతోనే వారి అవగాహన ఉంటుంది. అటువంటప్పుడు గురుబోధ జనసామాన్యానికి చేరి ప్రచారం అవుతున్న కొలదీ అది పలుచన కావటంలో ఆశ్చర్యం లేదు. కావాలని సద్గురువులు ప్రపంచం నుండి విద్యను దాచటమూ చేయరు, జనాన్ని చీకటిలోనే ఉంచాలని విద్యను దాచుకోవటమూ చేయరు, జనవంచనోద్దేశంతో విద్యను కావాలని వక్రంగానే బోధించరు. విద్యలో బోధ ఎంత ముఖ్యమో అధ్యయనమూ అంతే ముఖ్యం. అధ్యయనశీలం వదలుకొని ఇప్పుడు చీకటిలోకి వచ్చాము - దానికి గురువులు ద్రోహం చేసారనటం పొరపాటు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మళ్ళా కృషిచేయవచ్చును.

    రిప్లయితొలగించండి
  4. శ్యామలరావు గారూ ,
    భాష పరిణామ శీలి . మార్పు సహజం . సంప్రదాయాలకూ కాలానుగుణ మార్పులు తప్పవు .
    పారుటేరును నిరసించే పండితులతో నాకు పనిలేదు . అట్లని పద్యాన్నీ వీడేది లేదు .
    ఇక , ఇప్పుడు వర్ణభేదాలతో పనిలేకుండా అందరూ విద్యావంతులు . మంచి చెడుగులూ ,
    ఉచితానుచితాలూ , సత్యాసత్యాలూ నిర్ణయించుకోగల జ్ఞానవంతులు . పూర్వం గురువులు
    ఎవరికి విద్వ గరపేవారో , ఎవరిని వివక్షకు గురి చేసేరో , అసలు విద్యాభ్యాసార్హులుగా
    ఎవరిని ఎంచుకున్నారో ఇప్పుడందరికీ తెలుసు . ఇంకా మభ్య పెట్ట పనిలేదు . చర్చలకస్సలు
    తావేలేదు . ఏతావత్ , ముప్పై యెనిమిదేండ్ల ఉపాధ్యాయ వృత్తిలో జీవించిన నాకు మీ
    అభిప్రాయం రుచించదు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ, నమస్కారం. మీకు నా అభిప్రాయం‌ రుచించకపోవచ్చునండి. ఇబ్బంది లేదు. నాకు ఎవ్వరితోనూ వివాదం లేదు. నేను నా అభిప్రాయం చెప్పటం వలన మీకు ఇబ్బంది కలిగితే మన్నించండి. ఇకపై మీకు నా అభిప్రాయాలు చెప్పే సాహసం చేయననే‌అనుకుంటున్నాను. మీకు పూర్వగురువులు అల్పులని తోచటం నాకు విచారం కలిగించింది. మీరు ఉపాధ్యాయులని తెలిసి ఆనందించాను, నేను కూడా ఉపాధ్యాయుల కుటుంబంలో నుండి వచ్చిన వాడినే. సెలవు.

      తొలగించండి