సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, జులై 2013, సోమవారం

అతడె పరమేశ్వరుండు - దయామయుండు

అతడె రాజాధి రాజు , విశ్వాధి నేత ,

సకల జగతీ చరా చరాశ్రయ ప్రదాత ,

సర్వ జగద్రక్ష , ఆనంద సాగరుండు ,

అతడె పరమేశ్వరుండు , దయామయుండు


చినుకు వర్షించు నతని తో చేరు కొరకు

చివురు చివురించు నతనితో చెలిమి కొరకు

పువ్వు పుష్పించు నతని కొల్వున తరింప

మనిషికే సందియ మతని యునికి యందు



శక్తి యతని రూపు , సకల జగతి యతని

చిద్విలాసమ్ము , ప్రేమ భాసించు టతని

తత్త్వ , మతడు విరాట్ సత్య ధర్మ రతుడు ,

దర్శనీయుండు జగతి యంతటను నతడు



అతని సృష్ఠి అడుగడుగున నతి మనోఙ్ఞ ,

మత డగుపడు నన్నింట తా నద్భుతముగ ,

ప్రతి చరాచర రూపమ్ము నతని దివ్య

చేతనా ప్రభావిత వికసిత సుమమ్మె



మొనసి జీవన సంద్రాన మునిగి పోవు

నావ నొడ్డుకు లాగ లేనపుడు మనకు

తోడుగా నిల్చి కాపాడు వాడె యతడు

కష్టములు తీరి నంతనే కనము గాని .....



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి