సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, ఏప్రిల్ 2020, శనివారం

తల్లి సేవతో జన్మమ్ము ధన్య మయ్యె .....

            వెంకట రాజారావు . లక్కాకుల

చీర్ల శింగరయ్య శెట్టి డొనేషను
కట్టె , నతని పేర ఘనము గాగ
అప్పు డెపుడొ యిచట హైస్కూలు పెట్టిరి
చదువు లన్న నెంత చవులు ప్రజకు !

నెల్లూరికి దూరములో
కుల్లూరున స్కూలు బెట్టి కూడా యరువై
యేళ్లకు పైగా గడచెను
యెల్లర కిది చదువు జెప్పె నీ ప్రాంతములో .

నలభయ్యేడు స్వతంత్రము ,
నలభై తొమ్మిదిన స్కూలు నడిపించిరి పె
ద్దలు మా కుల్లూరున తా
వెలుగులు విరజిమ్ము చుండె విద్య గరపుచున్ .

తల్లీ ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ , నీవు నా
యుల్లంబందున నిల్చి , జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము , నీదు వాక్కునను సంప్రీతిన్ , జగన్మాతరో !
కుల్లూరున్నత పాఠశాల యన నీకుంగీర్తి చేకొందుమే .

నా డీ ప్రార్థన పద్యము
పాడితి మట , ప్రతి దినమ్ము పరవశమున , నా
పోడుములకు గురువులు పో
రాడిరి , కామయ్య గారు వ్రాసిరి దీనిన్ .

ఏ పాఠశాల నా కెంతయు విఙ్ఞాన
మిచ్చి గురు స్థాన మెక్క జేసె
ఏ పాఠశాల నా యెదుగు దలకు నిల్చి
బుధ్ధులు గరపె ప్రాపులు వహించి
ఏ పాఠశాల నాకింత బ్రతుకు దెరు
వొసగె నిచ్చెన యయి స్ఫూర్తి నిచ్చి
ఏ పాఠశాల తా నీప్రాంత ప్రజలకు
విద్యా ప్రదాతయై వినుతి కెక్కె

నట్టి హైస్కూలు ' హెచ్ యం ' గ నరిగి , నాటి
గొప్ప దనములు సాధించు కొఱకు పూని ,
పూర్తి సాఫల్య ఫలములు పొంది నాను
తల్లి సేవతో  జన్మమ్ము  ధన్య మయ్యె .

6 కామెంట్‌లు:

  1. ప్రస్తుత పరిస్ధితుల వలన మీ అన్నదాన కార్యక్రమానికి అంతరాయమేమీ కలగడం లేదు కదా?

    రిప్లయితొలగించండి
  2. మీ జీవితం అందరికీ ఆదర్శం. మీరు ధన్య జీవులు sir . మీ జీవితం సార్థక మైనది.

    రిప్లయితొలగించండి