సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

3, ఆగస్టు 2020, సోమవారం

అయోధ్యలో భూమిపూజ ఆగష్ట్ 5న.....


Add caption

ఏ మహాత్ముడు జనియించి భరతభూమి
పావనమయ్యె సౌభాగ్యయగుచు
ఏ మహాత్మునిపాద మీమహీతలమున
తాకగా పుణ్యాల తతులు విరిసె
ఏ మహాత్ముని నామ మిరవొంద రామా య
నుచు నిట మార్మ్రోగి నుతులు గొనియె
ఏ మహాత్ముని చేత ఏలబడి సుభిక్ష
మై యిచ్చటి జనులు హాయి వడిరి

అట్టి లోకైక ప్రభు డయోధ్యాధిపతికి
రామజన్మభూమి యయోధ్యలో మహిత
రామమందిరనిర్మాణ భూమిపూజ
జరుగు శుభముహూర్తంబు లాసన్న మయ్యె .

11 కామెంట్‌లు:

  1. ఆ కోదండము పట్టు ఠీవి , కనులం దార్తావన జ్యోతులున్
    రాకాశోభలు గుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
    లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
    కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కం గల్గు సర్వార్థముల్ .

    రిప్లయితొలగించండి
  2. నినుధ్యానించిరి యెందరోబుధులు , కానీ వారిలో పోతరా
    జును,త్యాగయ్యయు తెల్గువారినిసుధాస్తోకాంబుధిన్ముంచి,నీ
    ఘనతల్బాడిరి,పద్యకీర్తనములన్, కైవల్యమున్ బొందినా
    రనఘుల్,రామ!దయాబ్ధిసోమ!మముజేరన్దీయరామాధవా!

    రిప్లయితొలగించండి
  3. సీతమ్మ వరదహస్తము ,
    సీతాపతి కోల రక్ష , శ్రీలక్ష్మణు సే
    వాతత్పరతయును , పవన
    జాతామలభక్తి ప్రతతి , జగతి విదితమౌ .

    రిప్లయితొలగించండి
  4. శ్రీరాముని గుడియుండని
    యూరేదియులేదుచూడ , నొక్కటికూడా ,
    ఊరూరా కళ్యాణము
    శ్రీరామనవమి దినాన చేయుదురెలమిన్ .

    రిప్లయితొలగించండి
  5. ఈరేడు లోకాల నేకపత్నీవ్రత
    మొక్క రామునికిగా కొరుల కేది ?
    ఒక్కటే మాటగ నొక్కటే శరముగ
    నొక్కరాముండుగా కొరులు లేరు
    ధర్మంబు దప్పని ధరణీశు డిలలోన
    నొక్కరాముండుగా కొరులు లేరు
    రక్షించు విభులలో రాణకెక్కిన నృపుం
    డొక్కరాముండుగా కొరులు లేరు

    నామజపమాత్ర తరియింప నాశ్రయ మిడ
    నొక్కరాముండు తప్ప లేరొరు లెచటను
    పల్లె పల్లెన గుడులలో భజనలంద
    నొక్కరాముండు తప్ప లేరొరు లెచటను .

    రిప్లయితొలగించండి
  6. శ్రీరామ పట్టాభిషేక చిత్తర్వుతో
    యిళ్ళలో జేరెద రిచటి జనులు
    తొలుదొల్త 'శ్రీరామ'తో మొదుల్ బెట్టక
    యెట్టి వ్రాతలు గనుపట్టవిచట
    పలుమార్లు రాముని ప్రణుతించి ప్రణుతించి
    నిద్రకు జారుట నియతి యిచట
    రామనామమ్ములు రంజిల్ల భజియించి
    మంచాలు దిగుదురు మనుజులిచట

    మరణ శయ్యను గూడ “ రామా “ యనుటను
    మాట గోల్పోవు చున్నను మరువ రిచట
    యిచటి జనజీవనమున మమేకమయ్యె
    రామనామమ్ము , శ్రీరామ రామ రామ .

    రిప్లయితొలగించండి
  7. రాముడేలిన రామరాజ్యమందంతట
    నెల మూడు వానలు నిలిచి కురిసె
    రాముడేలిన రామరాజ్యమందంతట
    ధర్మంబు నాల్గు పాదాల నడిచె
    రాముడేలిన రామరాజ్యమందంతట
    ప్రకృతి సుభిక్షమై పరవశించె
    రాముడేలిన రామరాజ్యమందంతట
    ప్రజలలో సుఖ శాంతి పరిఢవిల్లె

    నాడు రాముడే రక్షణ , నేడు “ రామ
    నామ “ మా రాముకంటె కనంగ శత స
    హస్ర మెక్కుడై నిల్చి , మహా మహిత ప్ర
    భావ శీలమై రక్షించు భరత జనుల .

    రిప్లయితొలగించండి
  8. అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికైనా అంతా రాముడిలా సక్షెస్ఫుల్ లీడర్ ఎలా అవ్వాలో నేర్చుకుంటారని ఆశిస్తాను.

    రిప్లయితొలగించండి
  9. అవును , అందరికీ శుభాకాంక్షలు .
    ధన్యవాదాలు .నమస్సులు .

    రిప్లయితొలగించండి
  10. దొరకునా యిటువంటిసేవ , రఘువరుని
    రామచంద్రుని మందిర భూమిపూజ
    వీక్షణముసేయు క్షణము లీయక్షులకును ,
    జన్మధన్యతయన నిదే , జనజగతికి .

    రిప్లయితొలగించండి
  11. అంబు జోజ్జ్వల దివ్య పాదారవింద !
    నీదు చింతనామృత చిత్త నీమ మొకటె
    కడవ బెట్టంగ నావయై గానుపించు
    జరను రుజలను దాటంగ , పరమ పురుష !

    రిప్లయితొలగించండి