సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, అక్టోబర్ 2020, ఆదివారం

మా తల్లి శ్రీపోలేరు పరమేశ్వరీ పరంజ్యోతికి దేవీనవరాత్రుల సంకీర్తన సంస్తుతి

 మా తల్లి శ్రీపోలేరు పరమేశ్వరీ పరంజ్యోతికి

దేవీనవరాత్రుల సంకీర్తన సంస్తుతి




తొలిరోజు ' శైలసుత ' యై

యలరారును దుర్గ , మా మహా పోలేర

మ్మ , లలిత , శాంకరి , శుభకరి ,

అలివేణికి 🙏 ప్రణతులిడుదు నమృతాంభసికిన్ .


రెండవ రోజున దుర్గా

చండిక పోలేరు ' బ్రహ్మచారిణి ' యనగా

దండ కమండల మాలా

మండిత తపమాచరించు మాతకు ప్రణతుల్ 🙏 .


మూడవరోజున ' అమ్మ ' ను

వేడుకగా ' చంద్రఘంట ' వేషధారి యనన్

వేడుకొని మ్రొక్కుకొందును ,

నీడగ పోలేరుతల్లి ! నిలుమమ్మ ! మదిన్ 🙏 .


నిండుగ మా తల్లియె బ్ర

హ్మాండము సృజియించుగాన , మరి చవితిని , ' కూ

ష్మాండాదుర్గ ' యనగ భూ

మండలమందువెలుగున్ , నమస్సులు 🙏 తల్లీ !


అయిదో రోజున దుర్గ  వి

జయంబగును  ' స్కందమాత ' సన్నుతనామా

భయహస్త మాతృమూర్తిగ ,

దయగల  పోలేరు  తల్లి ! దండాలమ్మా🙏  !


ఆరో రోజున దుర్గా

కారుణ్యామృతహృదయిని ' కాత్యాయని 'యై ,

చేరి వ్రతమాచరించిన

వారికి పోలేరుతల్లి వరముల నొసగున్ 🙏 .


' కాళరాత్రి ' దుర్గ  గాఢాంధకార వపుష ,

దుష్టసంహరణ , ప్రదోష శుభద ,

కడుభయంకర , శుభకర , సప్తమిని తల్లి ,

పుడమి తలను మోపి మ్రొక్కులిడుదు 🙏 .


అష్టమిని ' మహాగౌరి ' యై యలరు దుర్గ 

అమ్మలను గన్న మాయమ్మ అమృతవల్లి

తల్లి కుల్లూరుపోలేరు తరతరాల

మమ్ము కాపాడు , శిరసా నమామి 🙏 తల్లి !


' సిధ్ధిదాత్రి ' దుర్గ శ్రీమహాపోలేరు ,

సకల సిద్ధులనిడు శాంకరి , అమృ

తమయి , తొమ్మిదవ దిన మనోఙ్ఞరూపసి ,

తల్లి పదములంటి 🙏 తనియువాడ .

11 కామెంట్‌లు:

  1. స్తుతి బాగుందండి.
    మీకందరకూ విజయదశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. పెద్దలు శ్రీనరసింహరావుగారికీ ,
    మిత్రులందరకూ
    నమఃపూర్వక

    విజయదశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి


  3. స్తుతి బాగుందండీ సం
    స్తుతి సంకీర్తన లలితకు శాంకరి కిన్ స
    న్నుతము తిరము పది దినముల
    కు తపమ్మును చేయుచు‌ పలుకుజెలికి రాజా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వందారు పరంజ్యోతికి
      మందారమరందబిందు మధుభాషిణికిన్
      మందస్మితేందుముఖికి ము
      కుందు ప్రియభగినికి సిత కుందరదనకున్ .

      తొలగించండి
  4. ఏ మహాత్ముడు జనియించి భరతభూమి
    పావనమయ్యె సౌభాగ్య యగుచు ,
    ఏ మహాత్మునిపాద మీమహీతలమున
    తాకగా పుణ్యాల తతులు విరిసె ,
    ఏ మహాత్ముని నామ మిరవొంద ' రామా ' య
    నుచు నిట మార్మ్రోగి నుతులు గొనియె ,
    ఏ మహాత్ముని చేత ఏలబడి సుభిక్ష
    మై యిచ్చటి జనులు హాయి వడిరి ,

    అట్టి ' లోకైక ప్రభు ' డయోధ్యాధిపతికి
    రామచంద్రున కనఘ ! ' కీర్తన సహస్ర
    తపము ' జేసిన తమజన్మ ధన్యతమము ,
    ఘనము , శ్యామలరాయ ! మీకలఫలించె .

    రిప్లయితొలగించండి
  5. శ్రీమాత్రేనమః
    అమ్మకి ఎలా మొక్కినా అందమే!

    రిప్లయితొలగించండి
  6. పెద్దలు శ్రీభాస్కరశర్మగారికి ముందుగా నమస్సులు , అటుపై ధన్యవాదములు.

    హంస సమారూఢయై బ్రాహ్మి యరుదెంచె
    నెమలిపై కౌమారి నెలత వచ్చె
    ఐరావతారూఢయై ఐంద్రి యరుదెంచె
    మహిషాన వారాహి మరలి వచ్చె
    గరుడ సమారూఢ ఘనవైష్ణవియు వచ్చె
    శవమెక్కి చాముండి దవిలి వచ్చె
    వృష సమారూఢయి వినుత మాహేశ్వరి
    యును , సప్తమాతృకల్ పనిగొని ఘన

    లలిత , పరదేవత , భవాని , ప్రణవరూప ,
    రాజరాజేశ్వరిని గొల్వరాగ వెలిగె ,
    చెలగి యొడ్డోలగంబున , కొలువరండు ,
    అదుగొ ! కుల్లూరు పోలేరు పదయుగళము 🙏 .

    రిప్లయితొలగించండి
  7. శ్రీ మాత్రే నమః

    అమ్మకు ప్రియమైన నామాల్లో ఒకటి భావనాగమ్యా. దేవతకీ ఉపాసనకునికీ మాధ్యమం భావన. నిరంతరభావనతో ఆరాధించే వారికి అనుగ్రహించే పరతత్త్వమే పరాశక్తి. అలానే అమ్మ భక్తికి వశ్యురాలు. అందుకే ఆమె భక్తి వశ్యా.

    భక్తితో, చక్కటి భావనతో స్తుతిస్తున్నారు. అభివందనములు మాస్టారుగారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారతి గారికి ధన్యవాదములు ,
      అమ్మనామావళిలో భావనాగమ్య , భక్తివశ్యల
      వివరణలకు కృతఙ్ఞతలు .

      రేగి రక్కసిపిండు రెక్కలు తెగగొట్టి
      కుత్తుకల్ మెలిద్రిప్పి కోయు చుండ
      కుడిచేత ఖడ్గంపు కొననుండి కారుచు
      నెత్తుటి ధారలు నెగడు చుండ
      డాచేత మూకుడు సాచి రౌద్రమ్ముగా
      రుధిరమ్ము వట్టి తా గ్రోలుచుండ
      ఆపలేక శివుం డడ్డదిడ్డము దూరి
      కాళ్ళ క్రిందుగ పడి కనలు చుండ

      దుర్నిరీక్ష్య తేజోమూర్తి దురితదూర
      దుర్గ మాయమ్మ కలదు ప్రాదుర్భవించి
      మమ్ము కాపాడు చున్న మా మాతృమూర్తి
      దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు🙏 .

      తొలగించండి
  8. తనువంత బంగారు ధగధగల్ మెరవంగ
    వెలుగు మాతల్లికి వేల నతులు
    పసుపు కుంకుమ శోభ పరిఢవిల్లెడు రహిన్
    వెలుగు మా తల్లికి వేల నతులు
    మణిరత్న ఘృణిశీర్ష మంగళాకారయై
    వెలుగు మా తల్లికి వేల నతులు
    మంటప శ్రీచక్ర మహితాసనస్థయై
    వెలుగు మా తల్లికి వేల నతులు

    ముగ్గు రమ్మలున్ , ముగ్గురు మూర్తులును , సు
    ర , లసురులు , సకల జగతి గొలుచు చుండ
    పసిడి పాస్పున బవళించి వైభవమున
    వెలుగు పోలేరు తల్లికి వేల నతులు .

    రిప్లయితొలగించండి
  9. భక్తివశ్య , తల్లి , భావనాగమ్య , త్రి
    భువనవంద్య , మమ్ముబ్రోచు మాత ,
    భక్తవత్సల , సమభావ , పోలేరు , కు
    ల్లూరుపురనివాసి , సారసాక్షి 🙏 .

    రిప్లయితొలగించండి