సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

26, జనవరి 2016, మంగళవారం

నీళ్ళు కూడ కొన వలసిన బ్రతుకులు .....




ఆనాటి నేతలు ప్రాణాలకు తెగించి  
ఉద్యమాలందు ముందురికినారు
ఆనాటి కవివరుల్ వేనోళ్ల నినదించి
ప్రజలను చైతన్య పరచినారు
ఆనాటి యువత వీరాధి వీరత్వ ము
రకలెత్త నిలిచి పోరాడినారు
ఆనాటి మహిళలు మేని యాభరణాల
నొలిచిచ్చి అండగా నిలిచినారు

మొనసి ధన మాన ప్రాణముల్ తృణము గాగ
నెంచి స్వాతంత్ర్య సమరాణ నిల్చి నారు
భరత మాతృ శృంఖలముల సరము త్రెంచి
స్వేచ్చ , స్వాతంత్ర్య ఫలముల నిచ్చి నారు .

గాంధి విలువలు , జవహరు గారి స్ఫూర్తి ,
పరగ సర్దారు ధీరత్వ పటిమ  నిలిచి 
భారతావని కీర్తి వైభవము గాంచు
నంచు నూహింప బడియె , గానది చివరకు,

స్వార్థములు దప్ప జనహిత పరత లేని 
నిండు వ్యాపార వేత్తలు నేత లైరి
ఈన గాచి నక్కల పాలయిన విధముగ
పాలకుల జేరె స్వాతంత్ర్య ఫలము లెల్ల .

విద్య , వైద్యాలె కాదు భావింప నీళ్ళు
కూడ కొన వలసిన బ్రతుకులుగ మార్చి
సొంత వ్యాపార సామ్రాజ్య మెంత గొప్ప
గా జరుపుకొను చుంటిరో గద ప్రభువులు .


1 కామెంట్‌:

  1. మంచి గాలి కూడా కొనుక్కోవలసిన రోజులు దూరంలో లేవు, ఇదే మన స్వతంత్ర భారతి ప్రగతి :)

    రిప్లయితొలగించండి