సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, మార్చి 2016, బుధవారం

బృందావనమున .....



భూమీ తలమును  రంగుల
ఆమని ముంచెత్తె , చివురుటాకులెరుపులో
పామిన శ్యామలమయ్యెను ,
ఏమని వర్ణించ వచ్చు నీ వని  యమునన్ .

నిండుగా పూచి  పొగడ  వన్నియలు వోవ
దరిసి నాధుని కైసేయ దండ గ్రుచ్చి
మురిసి రాధిక మాధవుముందు నిల్చి
గుండెలకు గుండెలానించి దండ గూర్చె .

మోదుగ పూగుత్తిని గన
మాధవునికి రాధమీద మనసు దవిలి , బిం
బాధరి మోవికి వంశీ
మాధుర్యపు కేళి పంచి మరులొలికించెన్ .

బృందావనమున గోపీ
బృందముతో కృష్ణు డాడె , బింబాధరులున్
బందీలై మాధవునికి
సంధించిరి సరస మధుర  సరి సమరమ్ముల్ .

ఇది వసంత హేల , యిల కెన్నిరంగులో
ప్రకృతి కన్య పూచి పరవశించె ,
ఇందు బ్రతుకు మనిషి కెందుకో  ప్రకృతితో
పాలు పంచు కొనుట పడుట లేదు .  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి