సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, డిసెంబర్ 2025, బుధవారం

నూతన (2026)ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు

 



ఆయు రారోగ్య భాగ్య సౌఖ్యాల నిచ్చి
నవ వసంతంబు మిమ్ముల నడుపు గాత !
నవ నవోన్మేష సంతోష యవనికలకు
బాట లిడుగాక ! క్రొత్త సంవత్సరమ్ము  .

'మన కుగాది గదా ! ఇది మనది కాదు'
అనుచు కొందరు నిరసింత్రు , అవని యంత
నే డనుసరించున దిదియె , నీవు నేను
పదుగు రేగెడు బాటలో పడుట మేలు .


28, డిసెంబర్ 2025, ఆదివారం

నేటి మా కుల్లూరు


ఒక నాటి కుల్లూరి యున్నతుల్ స్మరియింప

గర్వ ముప్పొంగు సాగరము రీతి

సు విశాలమై , కళల్ శోభించు పెంకుటిళ్ళు

ఇంటి ముంగట నొప్పు   జంటరుగులు

ఎత్తుగా ప్రహరీలు ఇంపుగా ముంగిళ్ళు

ఏపుగా పెరిగిన వేప చెట్లు

ప్రతి యింటి వెనుకల బావియు , వంటిల్లు

మధ్యన హాలు ధీమమ్ము గదుర


అన్ని వసతులు గల్గి సంపన్న మై , యొ

నర్చు వైభవోపేత ఘనతలు ' నాడు '

కటకటా ! కనంగ , నిటు నా కళ్ళ ముందె

రూపు గోల్పోయె , నేమిటీ లోప మకట !


ఏరీ మా పెద్ద తలలు

ఏరీ మా చెలిమికాండ్రు , ఏమై పోయెన్

ఊరి మహోన్నత శోభలు ?

ఊరంతా ఘన నిశీధి  , ఊరా కాడా ?


పటుతర గృహాలు కూలెన్

ఎటు చూచిన శిధిల కుడ్య హేలె కనబడున్

మటు మాయ మాయె వెలుగులు

పటిమలు గోల్పోయె ఊరి ప్రాభవమెల్లన్ 


రూపాయి కనగ నోచని

మా పల్లెల లోన ' నాడు ' మా ఊరి గృహాల్

ప్రాపుగ వందలు వేలుగ

రూపాయిలు గలిగి వెలిగె రుణదాతలుగా .


చుట్టు పక్క లూళ్ళ సొరిది రైతులు గూడ

రుణము కొఱకు రాని రోజు లేదు

పార జూడ నొక్క నూరు రూపాయలు

పుట్ట వరయ ' నాడు ' చుట్టు పట్ల .


ధన ధాన్య రమా విలసిత

ఘనతలు తలదాల్చి బలిజ ధార్మిక గృహముల్

మొనసి తదితర కులాలకు

దిన వెచ్చము లిచ్చి , బతుకు తెరవు లొసంగెన్ .


ప్రతి యింట యినప్పెట్టెలు

అతిశయముగ పసిడి నిండి అలరారె , ధన

స్థితి , భూ స్థితి  శ్రుతి మించుడు

నతులిత వైభవము తోడ నందల మెక్కెన్ .

 

క్రిక్కిరిసిన జనములతో

పెక్కగు అంగళ్ళు ' నాడు ' పెంపు వహించెన్

అక్కజ మవి యెటు వోయెనొ ?

పక్కూళ్ళ జనాలు రారు పదిమందైనన్ .


వందలాది బలిజవాళ్ళ కుటుంబాలు

వలస వోయె నగర బాట బట్టి

ఊరు వదలినారు ఉద్యోగములబట్టి

కూలె యిళ్ళు , మొలిచె కుటజ తతులు .


అసలూరు నిర్ మనుష్యము

మసలిన పాళేల జన సమర్థత పెరిగెన్

పసగల వారు గతించిరి

కసుమాలపు జాతి హెచ్చె ,  కళదప్పె కడున్ .



25, డిసెంబర్ 2025, గురువారం

నేడు జీసస్ జయంతి

 


పాలకుల మతాధిపతుల దుర్మార్గాలు
నిరసించి ప్రశ్నించి నిలిచినాడు
పీడిత తాడిత పేదల పక్షాన
ధీరుడై  అండగా పోరినాడు
జనజీవనమున నిజానిజాలను దెల్పి
ప్రజలను చైతన్య పరచినాడు
అన్యాయ తీర్పు దౌష్ట్యానికి గుర్తుగా
సిలువపై ప్రాణాలు విడిచినాడు

భూమిపై దిగి వచ్చి ఈ పుణ్యమూర్తి
ప్రజల కోసము బ్రతికి ఈ ప్రజల కొఱకు
అమరు డైనాడు క్రీస్తు ,  మహాను భావ !
మరల రావయ్య , యొకమారు , మహికి తండ్రి !


7, డిసెంబర్ 2025, ఆదివారం

సొగసుల సోయగాల .....

 



సొగసుల సోయగాల దినుసుల్ జడి దాకి కకావికై , మనో

ఙ్ఞగతి సరాగమాడు నవమన్మథ ప్రేయసియో యనంగ తాన్

సుగతినిగాంచె నీయమప్రచోదితయై,యెదనిండమోహనాల్

రగిలి, మనోగతామృత సరాంతర మగ్న ప్రమోద సంస్థితిన్ .


డిసి ప్రకృతిలో రూపు తాదాత్మ్య మొంది
ముగ్ధ మోహన ఆనంద మూర్తి యయ్యె
ఇంత కన్న పరవశత్వ మేది కలదు ?
విభవములహో ! అనుభవైకవేద్యము కద !


చిత్తజు వేటుకు జిక్కి .....

 


నెత్తికి చేయి సేర్చి తరుణీ ! యిటు వానను దోగ నేటికో ?
చిత్తము వేదనన్ గుదిసి , చిత్తజు వేటుకు జిక్కి ,  సొక్కిన
ట్లిత్తరి గాన నయ్యెడిని , ఇంతటి చక్కదనాలు నీటిలో
గత్తర బిత్తరల్  దడిసి , గ్రక్కె సెగల్ , వగకాడె శత్రువా ?


6, డిసెంబర్ 2025, శనివారం

జడ యల్లాడెడు .....

 

11, నవంబర్ 2020, బుధవారం

జడ యల్లాడెడు .....

 


జడ యల్లాడెడు,జాజిపూతురుముతో ,జాల్వారు కుచ్చుల్లతో,

నడు మల్లాడెడు,మాయురే!పిడికెడై ,నాజూకు యొడ్డాణపుం

గుడుసై,ముందుకువెన్కకై యొడలు,సోకుల్ మాడ , చెంచెక్కలా

డెడు ఊపుల్,చెఱుకుంగడల్ బలెను,చేడెల్ ,చూడ కన్విందగున్ .

22, మార్చి 2025, శనివారం

శ్రీనివాసునికి అలివేలు కైసేత

 

తిరువాభరణములు దీసి పక్కనబెట్టి

ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి

పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి

లలితంపు రొమ్ము తల మొలజుట్టి

తుమ్మెదమైచాయ దొడరు నచ్యుతునికి

శిరసాది పచ్చ కప్పురము నలది

కన మల్లె పూవల్లె కన్నుల కింపైన

స్వామికి పునుగు జవ్వాది పట్టి


శుక్రవారాలు అలవేలు శోభనవతి

మగని కైసేసె ,  నెన్ని జన్మాల ఫలమొ !

దివ్యమంగళ వేంకట దేవదేవు

మోము వీక్షించు కొనరండు , పుణ్యఫలము 🙏


29, జనవరి 2025, బుధవారం

అంతరంగ మధురిమ

  అంతరంగ మధురిమ

------------------


పుట్టితి గొప్పవంశమున , బూనితి జ్ఞానము , మంచిమార్గమున్

బట్టితి , నొజ్జనైతి , విలువల్ గల జీవనయాన మొందితిన్

గట్టిగ శిష్యకోటికి వికాస మొసంగితి నేర్చినంతలో

నెట్టి యవాంఛనీయ పను లేమియు జేసి యెరుంగ నెన్నడున్ .


చేసితి ధర్మకార్యములు , సేవలు పూనిక నున్నయంతలో

వ్రాసితి వెంకయార్యు నిజ వాస చరిత్రము గద్యమందునన్

వ్రాసితి సాయినాధు ననవద్య మహత్వము పద్యమందునన్

వ్రాసితి పద్యమందు విలువల్ గల వెంకయ స్వామి సూక్తులన్ .


కోరిన దైవకార్యముల గూడి వసించితి , నూరిలోని పో

లేరు మహేశ్వరిన్ , పరిమళించిన భక్తి ప్రపత్తులొప్పగా

నేరిచినంత వట్టు , యను నిత్యము గొల్చి , తదేక సేవలో

తీరుగ నిర్వదేండ్లు గడి దేరి తరించితి , నింత యేటికిన్ 


ఎన్నడొ యెన్బదేండ్ల తరి , నేర్పడ గట్టిన , చిన్న దేవళం

బెన్నగ గచ్చులూడి , దురపిల్లి , విభూతి నశించి , జీర్ణమై 

చన్న యెడన్ , గలంగుచు విచారణ జేసి , మహోజ్జ్వలమ్ముగా

కన్నులు కాంతులీను గుడి గట్ట దలంచితి నెంతయున్ గడున్ .


ఎంతగ పూర్వ జన్మముల నెట్టివి పుణ్యఫలంబు లున్నవో ,

చింతన సేయుటే తడవు , చేరిరి పుణ్యులు , చేరె డబ్బు , యా

వంతయు క్లేశముల్ వొడమ , వద్భుతమే యిది , భూరి యాలయం

బెంతయు శోభలన్ మెరయ , నింద్ర నిభా భవనంబె  యేర్పడెన్ .


ఇంత కన్న నే యదృష్టము కోరేది ?

జన్మసఫల మయ్యె , చాలు చాలు ,

పరగ నింత యిచ్చె పరమాత్మ కృష్ణుండు

వందనాలు నీకు పరమ పురుష !