28, జనవరి 2012, శనివారం

సమస్యాపూరణలు


పసలేని పశువు కడివెడు పాల నొసంగున్
కసవును మెసవుచు బుధ్ధిని
పసలేని పశువు కడివెడు పాల నొసంగున్
వసుధను మొలిచిన గింజలు
వసువులు గురిపించు మానవాళికి - నరుడో???
మకర సంక్రమణము మతిని  చెఱచు
వచ్చి మనిషికి సద్బుధ్ది నిచ్చి తీర్చి
మార్చు'మకర సంక్రమణము'మతిని - చెఱచు
దురిత స్వార్థాది' పిదప బుధ్ధుల'ను - కాల్చి
మలినములు లేని 'బంగారు మనిషి' జేయు
భోగములకు పంట భోగిమంట
వర్ష హేమంతముల గల్గు వణుకు నుండి
కొంత తెరిపి గల్గు, భువికి సుంత తగ్గు
రోగ బాధలు, జనుల కారోగ్యభాగ్య
మొదవు, భోగములకు పంట భోగిమంట
సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో
రంగ దభంగ భయంకర
శృంగ మహోదధులు పొంగి చేలము దాటన్
చెంగట ప్రళయ సునామీ
సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో
ధర్మ విదులకు బూజ్యుడు త్రాగు బోతు
పాలకుల దోపిడీకి , పైవారి ముడుపు
లకును , జీతాలు , పెన్షనులకు , ప్రభుత్వ
పనులకును మద్య మాదాయ వనరు గాన
ధర్మ విదులకు బూజ్యుడు త్రాగు బోతు


సమస్యాపూరణలు


దైవ మనెడి పదము తద్భవమ్ము
ఆ పరాత్పరు పరమాత్మ తత్వపు సూచి
దైవ మనెడి పదము,తద్భవమ్ము
గాదు దయ్యము,భయ కల్పితమ్మయి పుట్టి
మనిషి తలను దూరి మతిని జెరచు
       
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్
  ప్రణతి ప్రణతి శ్రీ భారత
గణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
ఘనమెరుగని యల్పులకీ
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్
కడలి నీరంతయును నిండె కడవ లోన
వెళ్లె వేటకు మావతో పల్లె పడుచు
దూర మేగిరి సంద్రాన దొరక లేదు
చేప లేవియు, చింతించె పాప మిట్లు
'
నోరు దడుపంగ పనికి రా నేర విచటి

కడలి నీరంతయును,నిండె కడవ లోన
మంచి తీర్థము లొడ్డుకు మరల నెపుడు?
పైన సూరీడు మండె, నీవైన మొయిల !
కురిసి దాహార్తి దీర్చరా కూడ దేమి?
విఱుగ బండిన చేలను విడువ దగును
నకిలి విత్తన మోసాలు నమ్మిచెడిరి                                                                                          బొంది బోయి రైతన్నలు మునిగి ,నడ్డి
విఱుగ,బండిన చేలను విడువ దగును
కోరి పసులకు , దండుగ కోత కూలి
కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్
దీటైన ప్రతిభ గల్గిన
మేటి కళాకారు డయ్యు మెచ్చక జనముల్
మాటున బడి మహిత కళా
కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్




సమస్యాపూరణలు


గజ్జ లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే

ముజ్జగంబుల నేలు సాయికి మ్రొక్కి పాటలు పాడరే
పజ్జ చేరి మహాను భావుని పాదపూజలు సేయరే
గజ్జ లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే
సెజ్జ హారతు లియ్యరే యభి షేకముల్ పలు సేయరే

కాకులుకొంగలున్ మరియు గ్రద్దలుడేగలురాపులుంగులున్

 రాకు మహేంద్ర జాలమిది రాచిలుకా! కవికోకిలల్ మహా
పోకిరులమ్మలేనివిధముల్ వచియింత్రు-వసంతమేడ? మీ
కాకులుకొంగలున్ మరియు గ్రద్దలుడేగలురాపులుంగులున్
కేకలు వేయుటల్ వినవ? గింజలు లేక వనమ్ములెండగా

చెడుగుల తో దేశమెల్ల శ్రీకర మయ్యెన్

చెడుపై సమరమునకు దిగి
కడుకొని కవి శంఖమూది కవితల నల్లన్
కడు చైతన్యము నొందిన
చెడుగుల తో దేశమెల్ల శ్రీకర మయ్యెన్ 


మకర శేఖరుండు మమ్ము బ్రోచు

తనకు చిక్క కెవడు తప్పించు కోలేడు
కాల విధిని దాటు ఘనుడు లేడు
ఉత్తరాయణమున నుజ్జ్వలు డాదిత్య
మకర శేఖరుండు మమ్ము బ్రోచు  



పాపులను బ్రోచులే భగవంతు డెపుడు

దారి తప్పిన బిడ్డలే తల్లి దండ్రి
మదిని మెదులుట జూడగా మనుజులందు
దారి తప్పిన వారిని దరికి జేర్చి
పాపులను బ్రోచులే భగవంతు డెపుడు 



 దారము రక్షింపుము సాధుతతి' నండ్రు బుధుల్
ఘోరము 'సాధువు'ల విథము
నేర ప్రపంచముల నేలు నేర్పరు లగుటన్
'
శ్రీరమణా! పృథ్వీ కే
దారము రక్షింపుము సాధుతతి' నండ్రు బుధుల్

4, నవంబర్ 2011, శుక్రవారం

తెలుగు పద్యము తా కొల్వు దీర వలయు

తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
తెల్గు పద్యము కొల్వు దీర వలయు

కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
తెల్గు లందరి కందంగ దివురు నటుల
తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు

              ---- వెంకట రాజారావు . లక్కాకుల

3, నవంబర్ 2011, గురువారం

నివేదన

                         నివేదన

ఆ.వె: రార గోప బాల! రాజిత జయ శీల !
        రార వేణు లోల !రాగ హేల !
        రార విశ్వ పాల !రమణీయ శుభ వేళ
        శ్రీనివాస సాయి! షిరిడి రాజ!

ఆ.వె: కాళ్ల కడ్డము పడి కరుణించ వేడితి
        కనుల జూడు నన్ను గన్న తండ్రి !
        కన్న బిడ్డ నయ్య కనికరించగ లేవ ?
        శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

కం:   నీ పాదాంబుజ ధ్యానము ,
       నీ పాద నితాంత దృష్టి నీమము ,సతత                                                                                   
       శ్రీ పాదసేవ భాగ్యము
       మాపాలిటి వరము లయ్య మారుతి సాయీ !

కం:  శశి కరములు తాకగ నే
      పసి హృదయము విచ్చి కలువ పరవశ మందున్
      వెస నీ కటాక్ష రుచిరము
      ప్రసరించుట తోనె మాకు భాగ్యము సాయీ!

కం  మధురము నీ నామ జపము ,
       మధుర తరము దర్శనమ్ము, మధు మాస సుధా
      మధురము నీ తోటి చెలిమి ,
      పద సేవన భాగ్య మెంత మధురమొ సాయీ !

ఆ.వె  అరయ ప్రణవ నాద మాకాశ మంతట
         నిండి మారు మ్రోగి నిన్ను జేరి
         యొనర నొక్కటగుచు నోంకార మయ్యెరా
        శ్రీనివాస సాయి! షిరిడి రాజ !

ఆ.వె  గగన సీమ విరిసి కను విందు చేయు నా
        తార లెల్ల భువికి తరలి వచ్చి
        తనర నిన్ను గొల్వ ద్వారాన నిల్చెరా
        శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

ఆ.వె  నాడు పట్టు చేల వీడని కన్నయా !
         నేడు చిరుగు బొంత వీడ వైతి
         నిన్ను దెలియ లేము నిర్గుణ బ్రహ్మమా !
         శ్రీనివాస సాయి! షిరిడి రాజ !

కం  నీ కరుణాపాంగ రుచులు
      ప్రాకటముగ బొంది నట్టి భాగ్యము కతనన్
      చేకొని యేపని జేసిన
      నీకు సమర్పణము జేతు నిరతము సాయీ !

ఆ.వె  మాకు రక్ష నీవు మమ్ముల బోషించు
         భార మరయ నీదె పరమ పురుష !
         జగతి నిండి నీవు జాగృతి నిచ్చేవు
         శ్రీనివాస సాయి ! షిరిడి రాజ !

ఆ.వె  శ్రీ సమస్త విశ్వ శ్రేయోభి లాషి !నా
         యాత్మ నందు నీవు నాకతీత
         యోగి రూప మందు దాగి యున్నావురా
        శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

ఆ.వె  నిన్ను గూర్చి తెలిసి నీతోటి మాటాడి
         నిన్ను బొందు నాశ నన్ను విడదు
         వెలయు జ్ఞాన మిచ్చి వివరించరా తండ్రి !
         శ్రీనివాస సాయి !షిరిడి రాజ !

                                  --- వెంకట రాజారావు . లక్కాకుల


                      




      

20, నవంబర్ 2010, శనివారం

శ్రీ సాయి నాధుని " దివ్య మంగళ స్వరూపం "

శ్రీ సాయి నాధుని " దివ్య మంగళ స్వరూపం "

శ్రీ సాయి నాధా !

ఆ.వె. భాను బింబ మంత ప్రజ్జ్వలత్ కాంతులు
చంద్ర బింబ మంత చల్ల దనము
నీదు శిరసు నందు నెగడొంద గంటి రా
శ్రీని వాస సయి ! శిరిడి రాజ !

ఆ.వె. ఉత్త మాంగ కాంతు లుజ్జ్వ లింపగ నీక
నెట్టన తల గుడ్డ కట్టి నావు
ప్రజ్జ్వ లించు ప్రభలు పరిహృత మయ్యేన ?
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె. ఫాల భాగ మందు పారాడు శాంతమ్ము
కట్టు చేల దాచి పెట్ట లేక
మోము దమ్మి నరసి మురిసేని విరిసేని
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . శ్రీ కరములు భవ హరములు
శ్రీ కేతన మెత్తి నట్లు చెలువము లై శ్రీ
లా కారము దాల్చెనొ యన
సాకారపు శృతుల గంటి జయముర సాయీ !

కం . జగతికి వెలుగులు ‌‌. అగతిక
జగతికి జగ మెరిగి నట్టి సద్గతు లై శీ
ఘ్ర గతిం గాచు కటాక్షపు
సుగతులు నీనయన గతులు శుభకర సాయీ !

ఆ.వె. తీరి విరిసి నట్టి తెల్ల దామరల లో
దూరి తిరుగు నట్టి తుమ్మెద లన
కడు మనో మైన కంటి పాపలు గంటి
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . నన సంపెగ సొబగున నా
నన మున కోటేరు దీర్చు నవ్విధి సొబ గై
కొన దేరి నాసి కాగ్రము
ఘన దీక్షను జాట గంటి ఘనముగ సాయీ !

కం . అధరములో మధు రోక్తుల
సధనములో త్రిభువన హిత సంభాషణ ది
వ్య ధిషణ వేదములో యన
నధర మధుర బింబ ఫలము లరసితి సాయీ !

కం . పలు జన్మల తపమున పు
వ్వులు నీ గళ సీమ జేరు పుణ్యము బడసెన్
వలమురి శంఖమొ యన మం
గళ మయ గళ సీమ గంటి ఘనముగ సాయీ !

కం . భూజనుల కండ దండలు
ఈ జగతిని నాదు కొనగ నేర్పడినవి నీ
యాజాను బాహు దండలు
మా జన్మకు సుగతు లట్లు మాన్యుడ సాయీ !

ఆ.వె. అభయ ముద్ర దాల్చి యరచేత దక్షిణ
హస్త మెత్తి జగతి నాదు కొనెడు
నీదు చేతి చలువ పాదు కొంటిర తండ్రి !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . పాయని దయకు నిధానము
హాయికి కడ లేని చోటు అమృత మయ మౌ
నీ యేద పై తల నానిచి
హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ !

ఆ.వె. ఎడమ కాలి తొడకు కుడి కాలు కీలించి
పైన నెడమ చేయి పాదు కొల్పి
కొంద రాయి నెక్కి కూర్చుంటివా తండ్రి !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . నీ పదములు శ్రీ పధములు
ఈ పృధ్వికి యెన్న దగిన యేడు గడలు మా
కాపద మొక్కుల తెరువులు
మా పాలిటి కల్ప తరులు మాన్యుడ సాయీ !

ఆ.వె. హే సమస్త విశ్వ సృష్ఠి కారక ప్రభో !
హే సంస్త ప్రాణి హృదయ వర్తి !
తే నమోస్తు దివ్య తేజో శుభాకార 1
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

........... వెంకట రాజా రావు . లక్కాకుల